‘‘లోకం చూపే జాలిలో శాడిజం ఉంటుంది’’
ABN, Publish Date - Apr 29 , 2024 | 04:43 AM
అనిశెట్టి రజిత రుద్రమ ప్రచురణల నుంచి ప్రధాన సంపాదకులుగా ఇటీవల వెలువరించిన గ్రంథం ‘భారత దేశంలో వితంతు వ్యవస్థ’. కొమర్రాజు రామలక్ష్మి, తమ్మెర రాధిక, చందనాల సుమిత్రలు...
అనిశెట్టి రజిత : పలకరింపు
అనిశెట్టి రజిత రుద్రమ ప్రచురణల నుంచి ప్రధాన సంపాదకులుగా ఇటీవల వెలువరించిన గ్రంథం ‘భారత దేశంలో వితంతు వ్యవస్థ’. కొమర్రాజు రామలక్ష్మి, తమ్మెర రాధిక, చందనాల సుమిత్రలు ఈ సంకలనానికి సంపాద కులు. ఇందులో సామాజిక సాహిత్య వ్యాసాలు, సంస్కర్తల వ్యక్తిత్వాలు, వితంతు స్త్రీల కథనాలు, నివేదికలూ ఉన్నాయి. దేశం ఎంత ముందుకి వెళుతుందని చెప్పుకుంటున్నా స్త్రీల స్థాయి విషయానికి వస్తే ఏదో ఒక డొంక పట్టుకు ఆమెను వెనక్కు లాగడం మతం పేరున చేసినప్పుడు ఆ చిక్కు ముడులు విప్పకుండా ముందుకు వెళ్లడం జరగదు. ఈ వ్యవస్థ విధివంచితులని ముద్ర వేస్తున్న స్త్రీల పరిస్థితిని సమాజం ముందుకు తేవాలన్న ఆలోచనతో ఈ పుస్తకాన్ని తెచ్చారు. ఈ సంకలనం గురించి అనిశెట్టి రజితను పలకరిద్దాం.
ఈ పుస్తకంలో వివిధ రచయితలు తొలి దశ నుంచి తెలుగు సాహిత్యంలో ఉన్న వితంతు సందర్భాలను, పాత్రలను గురించి వ్యాసాలు రాశారు. నేటి తెలుగు సాహిత్యం వితంతు వ్యవస్థను ఎలా చూస్తుంది?
అచ్చంగా వివిధ భాషా ప్రాంత రచయితల రచనల్లో ఉన్నట్టుగానే ఆది నుండి వితంతు వ్యవస్థను భారతీయ సమాజం కాపాడుకుంటూ వస్తున్నది. మతాన్ని బలమైన పునాదిగా చేసుకొని ఆచార సంప్రదాయాలను పవిత్ర శాసనాలుగా అనుసరించాలంటూ ఒక క్రూరమైన వ్యవస్థను నిర్మించి కొనసాగిస్తున్నది మన సమాజం. ఈ విషయంలో సాహిత్యం మానవీయంగా ప్రగతిశీలంగానే ఉండి ఉన్నది ఉన్నట్లుగా చిత్రిస్తూ వస్తున్నది. గతానికి సంబంధించి అదొక సాహసమే.
భర్తను కోల్పోయిన కొందరు సెలబ్రిటీ స్త్రీలు విషయంలో ఈరోజు సామాజిక మాధ్యమాలలో వితంతు ఆచారాల ఆంక్షలు లేనితనాన్ని చూస్తున్నాం. ఏ వర్గం స్త్రీలని ఈ వితంతు వ్యవస్థ దూరం పెడుతుంది?
సెలబ్రిటీలు ఎవరు? వారు మన సమాజం మొత్తానికి ప్రతినిధులు కాదు కదా. వారున్న రంగాల్లో వారు వేరుగా ఉంటే కుదరదు. ఎప్పటిలా ఉండాల్సిందే. అక్కడ అంతగా పాటించవలసిన నిబంధనలు ఉండవు. చూసీ చూడనట్టు ఉంటారు. వారు అవసరాన్ని అనుసరించి పైపైన అలా కనిపిస్తున్నా లోలోన వారు ఏమి ఎదుర్కోరని, మానసికమైన డిస్టర్బెన్స్ ఉండదని అనుకోలేము.
వితంతు వ్యవస్థ అనేది కేవలం వస్త్రధారణ, పూలు, బొట్టు, గాజులు వంటి భౌతిక అలంకరణకు మాత్రమే పరిమితమైనది కాదు. అది ఒక సజీవమైన అస్తిత్వాన్ని నిండా రసాయనాలు పోసి కడిగి మేకప్ వేసి శవప్రాయం చేసే దౌర్జన్యపు వ్యవస్థ. స్వల్పమైన తేడాలతో దాని ప్రభావాన్ని పూర్తిస్థాయి అని అంచనా వేయలేము. ఆంక్షల రాతి గోడల లోపల జరిగేవన్నీ అందరికీ కనిపించాలనీ లేదు. అది అనుభవించే వారికే తెలుస్తుంది.
ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో భక్తి, సనాతన ధర్మం, సంస్కృతి అంటూ స్త్రీ కట్టు బొట్టుపై మరోసారి పునరాలోచన చేయాలని వస్తున్న వ్యాఖ్యలు రేపు అదే స్త్రీ వితంతువయ్యాక జరగబోయే దానికి ఆజ్యం పోస్తున్నట్టేనా?
ఇప్పుడు సోషల్ మీడియానే సమస్తం అనుకుంటున్నారు కొందరు. స్త్రీ కట్టుబొట్టుల గూర్చిన పునరాలోచన ఒత్తిడి ఒకటే కాదు, స్త్రీని బ్రాహ్మణీయ పితృస్వామ్యం, పితృస్వామ్య భూస్వామ్యం, కులస్వామ్యం, మత భావనలు అన్నీ దేహపు ముద్దగా, సొంత ఆస్తిగా, విలాసాలకు సాధనంగా చేసుకొని, శతాబ్దాలుగా బొమ్మను చేసి ఆడుకుంటున్నాయి. ధర్మాన్ని మతాన్ని ఉల్లంఘించి కూడా స్త్రీల పట్ల దాష్టీకం చేస్తున్నాయి. ఈ విషగాలులు ఎప్పుడు వీచినా ప్రమాదకరమైనవి, నేరపూరితమైనవి. ముందు ముందు పరిస్థితి ఇంకా భయానకం కానున్నది. పెనం మీద నుండి పొయ్యిలోకి పడిపోతామా అని నిరాశతో అంటున్నది కాదు.
లౌకిక ప్రజాస్వామ్య భారతదేశంలో కేవలం హిందూ సంప్రదాయంలో వితంతు వ్యవస్థపై పుస్తకం తీసుకురావడం పై మీ వ్యాఖ్య?
మొదట నేను స్పష్టం చేయాల్సింది స్త్రీలను మతాల కులాలపరంగా విభజించుకుని వర్గీకరించుకొని ఈ సంకలనం వేయాలన్న స్పృహ లేకపోవడం. అయితే ఒక ప్రారంభం కావాలని దీనిపై వివిధ సెక్షన్లలో ఒక చర్చ రావాలని ఒక ఆశతో నాలో వేదనకు ఒక అవుట్‌లెట్‌గా ఈ బాధ్యతను చేపట్టాను.
రెండో మాట- ఇంకా ఎంతో చేయాలని ఉన్నా ఆ పరిశోధన చేయలేకపోవడం కలెక్టివ్ వర్క్ వైఫల్యమే. ఈ సంకలనంలోని సాహిత్య వ్యాసాల విభాగం దానికి ఒక ఉదాహరణ. ప్రయత్నం కొంత జరిగినా రావాల్సిన స్పందన రాకపోవడం ఒక కారణం.
హిందూ వ్యవస్థలో స్త్రీకి ఉన్న అన్ని ప్రివిలేజెస్ అంగీకరించి వితంతు ఆచారాల దగ్గరకు వచ్చేసరికి కేవలం తృణీకరణే వారిని ఇబ్బంది పెడుతుందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా?
హిందూమత వ్యవస్థలో అనే కాదు, ఈ అసమ వ్యవస్థలో ఏ స్త్రీకీ ఏ ప్రివిలైజస్ లేవు. డబ్బు పరంగా వచ్చే కొన్ని సౌకర్యాలు కులం వర్గం పరంగా వచ్చే కొన్ని సౌలభ్యాలు ఏ విధంగానూ ప్రివిలైజస్ అని మినహాయించ లేము అన్నది ఒక అవగాహన. స్త్రీలందరూ ఎన్నో రూపాల్లో అవమానాలు అణిచివేతలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక భర్త చనిపోతే ఆయా స్త్రీలను పోల్చకోవలసి వస్తే రూపంలో కొన్ని తేడాలు ఉన్నా సారంలో వారి పట్ల ఆచార వ్యవహార క్రూరత్వం ప్రదర్శించడంలో తేడాలు ఉండవు.
సాధారణ గృహిణులు, మధ్యతరగతి మహిళలే ఎక్కువగా ఈ వితంతు వ్యవస్థకు బలి కాబడుతున్నారనుకోవచ్చా?
ఒక సెక్షన్ వర్గం స్త్రీలు అని అనుకోలేము. సోషల్ స్టిగ్మా, సోషల్ నెగ్లెట్ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఆచార సాంప్రదాయాల ముసుగులో బంధించడం అనేది అందరికీ ఓపెన్‌గా కనిపించేది కాదు, గుట్టుగా ఒకింత రట్టుగా వారి కుటుంబాల లోపల జరిగేది. ఇదంతా తమ పట్ల జరుగుతుంటే ఒక బండి చక్రం విరిగిపోతే ఒకే చక్రంతో జీవితపు బండిని ఎలా ఈదాలా అని నిస్పృహలో స్త్రీలు కూరుకుపోతారు. అప్పటిదాకా ఉన్న అస్తిత్వం కోల్పోయినతనం బాధిస్తుంది. ఇతరుల సానుభూతి నామమాత్రమే. లోకం చూపే జాలిలో శాడిజం ఉంటుంది.
ఇంటర్వ్యూ : మానస ఎండ్లూరి
Updated Date - Apr 29 , 2024 | 04:44 AM