బంజారాల తొలి పండుగ
ABN, Publish Date - Jul 09 , 2024 | 03:12 AM
గిరిజనులు ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్న అమాయకులు. ప్రతికూల పరిస్థితుల మధ్య తమ సంస్కృతీ సంప్రదాయాలను, కళలను, మౌఖిక సాహిత్యాన్ని కాపాడుకుంటున్నారు. ప్రకృతిని పూజించడం, ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత...
గిరిజనులు ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్న అమాయకులు. ప్రతికూల పరిస్థితుల మధ్య తమ సంస్కృతీ సంప్రదాయాలను, కళలను, మౌఖిక సాహిత్యాన్ని కాపాడుకుంటున్నారు. ప్రకృతిని పూజించడం, ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత. పండుగ సందర్భాల్లో పశువులను అలంకరించి, వాటికి పేర్లు పెట్టి, మనుషులతో సమానంగా ప్రేమగా చూసుకుంటారు. చరిత్ర ఉనికిని మొదలుకొని నేటి వరకు లంబాడీలకు పశుసంపదే జీవనాధారం. వారి ఆర్థిక వ్యవస్థ వారి పశుసంపదపై ఆధారపడి ఉంటుంది. అందువలనే బంజారా సమాజం పశుసంపద వృద్ధి కోసం కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో, పశుగ్రాసం, నీరు ఎక్కువగా లభించే ప్రాంతాలలో తండాలు ఏర్పాటు చేసుకుంటారు. పశువుల ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి కోసం ప్రతి ఏటా పునర్వసు కార్తెలో గిరిజన తండాల్లో సీత్ల పండుగను బంజారాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బంజారాల తొలి పండుగ సీత్లా పండుగ. వర్షాకాలంలో పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా, తండ ప్రజలు ఎలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా తమను సీత్లా భవాని రక్షిస్తుందని గిరిజన లంబాడీల విశ్వాసం.
పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకొని, సప్త మాతృకలైన మేరామా, తొల్జా, మంత్రాల్, కంకాళీ, హింగ్లా, ద్వాళ్లాగర్, సీత్ల భవానీలను పూజిస్తారు. గిరిజన లంబాడీల సంస్కృతీ సంప్రదాయాలకు సీత్లా పండుగ ప్రతీకగా నిలుస్తుంది. తెలుగు వారి పండుగలు ఉగాదితో ఏ విధంగా ప్రారంభమవుతుందో, బంజారా పండుగలు సీత్ల పండుగతో ప్రారంభమవుతాయి. లంబాడీలు తీజ్, దసరా, దీపావళీ, హోలీ, ఉగాది, తుల్జా భవాని పండుగలను కూడా జరుపుకుంటారు. నిరంతరం శ్రమించే లంబాడీలకు వారి పండుగలు, ప్రదర్శన కళలు సేదతీర్చడానికి ఉపయోగపడతాయి. సీత్లా పండుగ నిర్వహణ తండా బయట తూర్పు దిక్కున జరుగుతుంది. సీత్లా మాత ప్రతిమ మధ్య భాగంలో ఉండేలా మిగతా భవానీలను ఇరువైపులా ఒక వరుసలో ప్రతిష్టిస్తారు. పండుగకు ఒకరోజు ముందు జొన్నలు, పప్పుధాన్యాలతో వండిన ఘుగ్రీ (గుగ్గిళ్ళు), లాప్షి (పాయసం)ని పెళ్లికాని యువతుల చేత సప్త దేవతలకు నైవేద్యంగా చెల్లిస్తారు. తండవాసులు మేళతాళాలతో కోళ్లు, గొర్రెపోతులు, మేకపోతులతో బోనాలు ఎత్తుకొని తండా నుంచి బయలుదేరతారు. మగవారు డప్పు వాయిస్తుండగా వాయిద్యానికి అనుగుణంగా బంజారా స్త్రీలు కాళ్ళు, చేతులు ముందుకు వెనకకు కదుపుతూ వలయాకారంలో తిరుగుతూ నృత్యాలు చేస్తారు. వనదేవతలను కీర్తిస్తూ పాటలు పాడుతారు. గొర్రెపోతులను దేవతలకు బలి ఇచ్చి, గొర్రెపోతుల పొట్టలోని పేగులను బయటకు తీసి, ఏడుగురు భవానీల ప్రతిమల నుంచి లుంకడియా ప్రతిమ వరకు నేలపై పరిచి, యువతుల చేత నీటితో జలాభిషేకం చేయిస్తారు. ఆ పేగుల పైనుండి పశువులు, గొర్రెలు, మేకలను దాటిస్తారు. అందువల్ల సీత్లా పండుగను దాటుడు పండుగ అని కూడా అంటారు.
తండాల్లో దేవుళ్లకు గుడి గోపురాలు కట్టించి పూజించే సంప్రదాయం లంబాడీలకు లేదు. కానీ ఇటీవల కాలంలో తండాలలో వివిధ రకాల పేర్లతో దేవుళ్ళ గుళ్ళు నిర్మించడం మొదలైంది. ఇలా తండా ప్రజలు తమ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకుంటూ మిగతా పండుగలను కూడా జరుపుకోవడం వలన ఆర్థిక భారం పెరుగుతున్నది. అంతేకాకుండా కొత్త ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు వివిధ పేర్లతో గిరిజన తండాలోకి ప్రవేశించి తండా సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాయి. పండుగ నిర్వహణకు అయ్యే ఖర్చు కంటే ఆ సందర్భంగా బంజారా ప్రజలు మద్యం పైన చేసే ఖర్చు ఎక్కువగా ఉంటున్నది. ఫలితంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారు. ఇది గిరిజన బంజారా సమాజాన్ని పొదుపు వైపు ప్రోత్సహించటం లేదు. వాళ్లు వ్యవసాయం పైన చేసే పెట్టుబడి, విద్య, వైద్యం పైన చేసే ఖర్చు కన్నా ఒక కుటుంబం ఒక సంవత్సర కాలంలో మద్యం, ధూమపానంపై చేసే ఖర్చు ఎక్కువగా ఉంటున్నది. గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యమైనా, పండుగైనా, పెళ్లయినా, పంచాయతీ అయినా సామూహికంగా పరిష్కరించుకునే సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు తండాల్లో ఆ సంస్కృతి నశించిపోయింది. తండాలోని ప్రజలు ఉద్యోగ ఉపాధి కోసం, ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వలస వెళ్లడం ద్వారా తండా ప్రజల్లో చైతన్యం కొరవడింది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ తండావాసులు సతమతమైపోతున్నారు. తండాలో మద్యపానాన్ని నిషేధించవలసిన అవసరం ఉంది.
బంజారా జాతిలో ఉన్న మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుకుంటున్న గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడే బాధ్యతను తీసుకొని వాటి ప్రాధాన్యతను భవిష్యత్ బంజారా తరానికి అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీత్లా పండుగను జూలై 9వ తారీఖున జరుపుకోవాలని గిరిజన మత పెద్దలు, సాహితీవేత్తలు, విద్యావంతులు కోరుకుంటున్నారు.
డా. వల్య లునావత్
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎకనామిక్స్
Updated Date - Jul 09 , 2024 | 03:12 AM