సిద్దేశ్వరం అలుగు.. ఆంధ్రప్రదేశ్‌కు వెలుగు
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:49 AM
రాయలసీమ సాగునీటి కష్టాలకు పరిష్కారంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్న ప్రజా ఆకాంక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే కేవలం రాయలసీమకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులు నింపే ఆస్కారం...
రాయలసీమ సాగునీటి కష్టాలకు పరిష్కారంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్న ప్రజా ఆకాంక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే కేవలం రాయలసీమకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులు నింపే ఆస్కారం ఈ అలుగు నిర్మాణంతో పుష్కలంగా ఉంది. రాయలసీమ సాగునీటి ఇబ్బందులకు పరిష్కారంగా విశ్రాంత సాగునీటి నిపుణులు సుబ్బరాయుడు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం ముందుంచుతున్న సిద్దేశ్వరం అలుగు ప్రతిపాదనకు దారితీసిన పరిస్థితులు, ఈ అలుగు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగా వెలుగును నింపుతుందో తెలిపే చిరు ప్రయత్నమే ఈ వ్యాసం.
బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం సంవత్సరాల నీటి లభ్యత ఆధారంగా (వంద సంవత్సరాలలో 75 సంవత్సరాలు తప్పక నీరు లభించేలాగా) కృష్ణా జలాల నీటి పంపిణి చేసింది. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రధానంగా కృష్ణా ఉపనది తుంగభద్ర, కృష్ణా నదుల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. కాని రాయలసీమకు కేటాయించిన నీటిని ఏ సంవత్సరం కూడా వినియోగించుకోలేకపోతున్నది. నీటిని నిలువ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవడం, రిజర్వాయర్ల నుంచి పంట పొలాలకు అందించే ప్రధాన కాలువలు తగినంత నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించకపోవడం లేదా ప్రధాన కాలువల నుంచి ఉప కాలువలు, పంట కాలువలు సక్రమంగా లేకపోవడం ఈ దుస్థితికి ప్రధాన కారణాలు.
రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన తుంగభద్ర జలాలు కర్నూలు జిల్లాలోని సంకేసుల బ్యారేజి దాటి నంద్యాల జిల్లాలోని సిద్దేశ్వరం, సంగమేశ్వరం ఎగువన కృష్ణా నదిలో కలుస్తున్నాయి. ఈ నీరంతా అక్కడ నుంచి దిగువకు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నది. శ్రీశైలం వద్ద కృష్ణా నదికి అడ్డంగా ప్రాజెక్టు నిర్మించడం వల్ల కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌లో నిలువ ఉంచే అవకాశం కలిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉంచినపుడు వెనుకకు ఎగదన్నడం వలన సిద్దేశ్వరం, సంగమేశ్వరం ప్రాంతం అంతా సముద్రాన్ని తలపిస్తుంది. అయితే రాయలసీమ ప్రాజెక్టులు ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే కృష్ణా జలాలు దిగువన ఉన్న నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తాయి. రాయలసీమలోని ఒక్క ఎకరాకు కూడా నీరు లభించని పరిస్థితి ఉంది.
రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లభించడానికి ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పొందే అవకాశాన్ని అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. 19 టీఎంసీల నికర జలాల కేటాయింపుతో ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు, మద్రాసుకు త్రాగునీటిని అందించే పథకాన్ని తర్వాత ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. గాలేరు–-నగరి, హంద్రీ–నీవా ఎత్తిపోతల పథకాలకు కూడా ఎన్‌టి రామారావు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు–నగరి ప్రాజెక్టు, కేసి కెనాల్‌కు నీటి కేటాయింపులు (తుంగభద్ర డ్యాం నుంచి కేసి కెనాల్‌కు ఉన్న 10 టీఎంసీల నీటిని హెచ్‌ఎల్‌సీకి బదలాయించి, దీనికి బదులుగా కేసి కెనాల్‌కు 10 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పొందేలాగా అంతర్గత సర్దుబాటుకు అనుమతులు ఇవ్వడం), హంద్రీనీవా ఎత్తిపోతల పథకంను (శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు నంద్యాల జిల్లా మల్యాల గ్రామం వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు) వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.
అయినా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని రాయలసీమ ప్రాజెక్టులు వినియోగించుకోలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం శ్రీశైలం రిజర్వాయర్‌లో తగిన స్థాయిలో నీరు నిలువలేకపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరు అందదు. సముద్రమట్టానికి 841 అడుగుల ఎత్తున ఉన్న నంద్యాల జిల్లా పోతులపాడు గ్రామం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే సుమారు 6000 క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ ఆయకట్టుకు, కృష్ణాడెల్టాకు కేటాయించిన 80 టీఎంసీలు కృష్ణా జలాలకు అదనంగా నీటిని తరలిస్తుండటంతో, ఆ నీరంతా సముద్రం పాలు అవుతున్నది. దీనివలన శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిలువ 854 అడుగులు దిగువకు పడిపోతుండడంతో రాయలసీమకు చుక్క నీరు కూడా దక్కడం లేదు.
శ్రీశైలంలో నీరు నిలువ ఉంచి దిగువన ఉన్న సాగర్, కృష్ణాడెల్టా ఆయకట్టుకు, బ్యాక్ వాటర్ మీద ఆధారపడిన రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందించాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా సిద్దేశ్వరం వద్ద 860 అడుగుల ఎత్తుతో అలుగు నిర్మాణం చేపట్టడం వల్ల అన్ని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందించే వెసలుబాటు కలుగుతుంది. అలుగు నిర్మాణం చేపడితే శ్రీశైలంలో 860 అడుగుల ఎత్తులో నీరు ఉన్నప్పుడు అలుగు దిగువన శ్రీశైలం రిజర్వాయర్ వరకు 60 టీఎంసిల నీరు, అలుగు ఎగువ భాగాన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు సుమారు 50 టీఎంసిల నీరు నిలువ ఉంటుంది. దీనితో నాగార్జునసాగర్‌లో నిలువ ఉండే 312 టీఎంసీలతో పాటు, అలుగు ఉన్న ప్రాంతం నుంచి దిగువన శ్రీశైలం రిజర్వాయర్ వరకు ఉండే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలుగుకు ఎగువ భాగన ఉన్న నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో కృష్ణానది మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల అవసరాలకు సాగునీటిని, తాగునీటిని వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది.
315 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక చేరడం వల్ల నేడు సుమారు 185 టీఎంసీల సామర్థ్యానికి తగ్గిపోయింది. ఇదే విధంగా కొనసాగితే ఇది ఒక పెద్ద కుంటలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీని జీవితకాలం పెంచడం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు అత్యంత కీలకం. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వల్ల శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక చేరికను నివారించి, దాని జీవితకాలాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. అలుగు నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణ అవుతుంది. దీనికి కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. వరద బారి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌ను రక్షించుకోవడం, ప్రాజెక్టు జీవితకాలాన్ని పెంచుకోవడం, నీటి నిర్వహణను సక్రమంగా చేపట్టడం, విద్యుత్తు ఉత్పత్తి చేపట్టడం, తాగునీటి ఇబ్బందులను తొలగించడం తదితర బహుళ ప్రయోజనాలను తక్కువ నిర్మాణ సమయంతో, తక్కువ పెట్టుబడితో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాధించవచ్చు.
సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 1951లోనే ప్లానింగ్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. తరతరాలుగా ఈ ప్రాజెక్టు సాధనకు ప్రభుత్వాలు స్పందించని నేపథ్యంలో, అనేక బహుళార్థ ప్రయోజనాలను కలిగి ఉన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి, అనేక ప్రజా సంఘాలతో కలిసి మే 31, 2016న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 సంవత్సరంలో నిండు ఎండాకాలం మే నెలలో నాలుగు రోజుల 100 కిలోమీటర్ల పాదయాత్రను నంద్యాల నుంచి సిద్దేశ్వరం వరకు వేలాదిమంది ప్రజలతో విజయవంతంగా నిర్వహించింది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఈ పరంపరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి మద్దతును ప్రకటించాయి.
కల్వకుర్తి నంద్యాల మధ్య నిర్మించే జాతీయ రహదారిలో భాగంగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగెల వంతెనకు బదులుగా ‘అలుగుతో కూడిన వంతెన’ నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ అంశాలను నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి సమితి నాయకులు తీసుకొచ్చారు. గత ఆగస్టులో చంద్రబాబునాయుడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్న సందర్భంలో, సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ చేపడతామని ప్రకటించారు.
ఆంగ్లేయుల కాలం నుంచి వందేళ్ళుగా సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశం రాయలసీమ ప్రజానీకాన్ని ఆశల పల్లకిలోనే ఊరేగిస్తున్నది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు వెలుగులను అందించే సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని రాజకీయ దృఢసంకల్పంతో అత్యంత త్వరగా చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.
బొజ్జా దశరథరామిరెడ్డి
అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి
Updated Date - Sep 18 , 2024 | 12:49 AM