చలం : నేటికీ ఓ శేష ప్రశ్న
ABN, Publish Date - May 18 , 2024 | 05:22 AM
‘రచయితలు రెండు రకాలు: ఒక ఉద్గ్రంథాన్ని వదిలిపోయేవారు. తాము స్వంతంగా గొప్పగా ఏదీ రాయకపోయినా, సారస్వతానికి కొత్త జీవనాన్నిచ్చేవారు. ఏ కొందరో ఈ రెండూ చేయగలవారుంటారు’
‘రచయితలు రెండు రకాలు: ఒక ఉద్గ్రంథాన్ని వదిలిపోయేవారు. తాము స్వంతంగా గొప్పగా ఏదీ రాయకపోయినా, సారస్వతానికి కొత్త జీవనాన్నిచ్చేవారు. ఏ కొందరో ఈ రెండూ చేయగలవారుంటారు’ అని చలం ఒక చోట చెప్పుకున్నారు. ఇలా రెండూ చెయ్యగలిగిన వారిలో చలం ముందు వరుసలో ఉంటారు. కీర్తి కోసం చలం రచనలు చేయలేదు. కీర్తి అతనిని కావాలని కావలించుకుంది.
ఆయన రచనల్లోని ‘ఆక్రోశం’ ఆయనదే అనే సాహితీ విమర్శకులున్నారు. వ్యక్తిగత జీవితం సాహిత్యంలో తొంగి చూడటం సహజమే. ‘గీతాంజలి’కి ముందుమాటలో చలం ‘ఈ గుడ్డి సృష్టి నా సవతి తల్లి. నన్ను కొడుతుంది. తిడుతుంది. నాకు దిక్కులేదు. కర్కశ భూయిష్టమైన ఈ ప్రపంచంలో దిక్కులేని ఏకాకిని, నా సోదరులని వంచించి, దోచుకుని, వారితో పోటీపడి, పీక్కొని, నేను దాక్కోవాలి. ఎవరిని నమ్మను? ఎవరని ప్రేమించను? ఈ మనుషులు నా స్వార్థానికి ఉపకరణాలు. ద్వేషంలో, మోసంలో వారిని మించి కపటిని కావాలి: లేదా నన్ను వంచిస్తారు’ అంటారు. విశ్వకవి రచనాత్మను చలం ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాతనే ఆయన గీతాంజలిని తెలుగులోకి తెచ్చారనిపిస్తుంది: ‘గీతాంజలిని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన అభ్యంతరాలు– అద్వైత వేదాంతము, సైన్సు’ అనటం ఆయనలోని తత్వాన్ని బహిర్గతం చేస్తుంది. చలంను అర్థం చేసుకోవడం సైతం క్లిష్టమే. ఆయన రచనలను చదివి ‘చలం అంటే ఈయన’ అని చెప్ప వీలవదు.
‘నన్ను మెచ్చుకున్న వారంతా, నా రచనలు అర్థం చేసుకున్నారని భ్రమపడ్డాను’ అనేది ఆయన ఆవేదన. చలం వ్యక్తిత్వంలో విభిన్నమైన పార్శ్వాలున్నాయి. స్త్రీ ప్రేమికునిగా, తండ్రిగా, భర్తగా, సంఘ బహిష్కర్తగా... ఇలా చలంలో అనేకమైన విభిన్న కోణాలు రచనల ద్వారా ఆవిష్కృతమయ్యాయి. వీటిని తనదైన శైలిలో ఆయన సాహితీ ప్రియులకు అందించారు. ఇక్కడ గమనించదగ్గ అంశం చలం శైలి. ‘నేను రచనలు సాగించేటప్పటికీ నాకు తెలియకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలన్నీ పుస్తకాల భాషలో రాశాను. అసలు ఈనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు,’ అంటారు. ఆయన భాష ఓ వరద. భయం, సంకోచం, భీతి లేని వాక్యాల ప్రవాహం. ఆయన రచనలను ప్రతిఘటించినవారే ఆ వాక్యాలను ప్రేమించారు. ఆయన భాషను అనుకరించే ప్రయత్నం చేశారు. ‘రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించడం ప్రారంభించారు. భాషా దిగ్గజాల మోకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు కూలాయి’ అని ఆయనే తన ఆత్మకథలో రాసుకున్నారు.
గుడిపాటి వెంకటాచలం 1894 మే 18న మద్రాసు నగరంలో జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. తాతగారు గుడిపాటి వెంకటరామయ్య దత్తత తీసుకోవడంతో ఇంటి పేరు గుడిపాటిగా స్థిరపడింది. చిన్నతనంలో నిత్య సంధ్యావందనం నిష్టగా చేసేవారు. ఉన్నత విద్య నేర్వక ముందే ఇతిహాస, పురాణాలను క్షుణ్ణంగా చదివారు. తన తండ్రి తన తల్లిని వేధించే తీరు ఆయనను బాధించింది. అది పసి మనసుపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు అమ్మణ్ణి పెళ్లి ఆగిపోవడం స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాల పైకి ఆయన దృష్టి మళ్ళింది. 1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో ప్రవేశం పొందిన తరువాత రఘుపతి వెంకటరత్నం నాయుడు నాయకత్వంలో నడుస్తున్న బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యారు. బీఏ చదువు కోసం మద్రాసు వెళ్ళకముందే చిట్టి రంగనాయకమ్మతో వివాహం జరిగింది. తన భార్యను కాన్వెంట్లో చేర్పించారు. కళాశాల చదువు తర్వాత తను కాకినాడలో ట్యూటరుగా చేరారు. తిరిగి బ్రహ్మ సమాజం ఉద్యమంలో పాల్గొన్నారు. రత్నమ్మతో ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అనంతరం రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశారు. ‘రాతిని, ప్రభుత్వ బానిసను, స్కూళ్ళ తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయ వర్గ ప్రాణ మూషికాలకు మార్జాలాన్ని’ అని ఆయనే చెప్పుకున్నారు.
చలం రచనల్లో వ్యక్తపరిచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు అప్పటి సమాజం మీద విపరీతమైన ప్రభావం చూపాయి. ఈ కారణంగా ఆయనను దూరంగా జరిపారు. స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆయన పుస్తకాలను బహిరంగంగా చదివేందుకు కూడా భయపడేవారు. ఈ భయాలకు, వ్యతిరేకతకు ఆయన వ్యక్తిత్వం కూడా కారణమేనంటారు. అతనిలోని స్త్రీ లోలత్వాన్ని సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది.
‘అత్త అధికారం నుంచి భర్త ఆధీనం నుంచి తప్పించుకుంటున్న నవీన స్త్రీ షోకులకి, సంఘ గౌరవానికి, ఫ్యాషన్స్‌కి బానిస అవుతుంది. ఒక పురుషుడి నీడ కింద నుంచి లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫ్యాషన్ పేర వెయ్యి మందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి తన చుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు’ అన్న ‘స్త్రీ’ రచనలోని చలం వ్యాఖ్యలను ఈ నాటికీ వాస్తవంగా స్వీకరించవచ్చు. ఇదే రచనలో మరోచోట ‘భర్త వద్దని ఏడుస్తున్న చిన్నపిల్లలకి బలవంతంగా కట్టబెడుతుంది, భర్త కావాలని గోల పెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి,’ అంటారు. ఇలా సమాజాన్ని ఏ ‘లౌక్యమూ’ లేకుండా ప్రశ్నించిన చలం ధిక్కారస్వరం వినిపిస్తున్నాడని భావించి సంఘం ఆయనను వెలివేయటంలో వింతేముంది. ఒకానొక దశలో ఆయనకు ఇల్లు అద్దెకివ్వటానికి కూడా ఎవరు అంగీకరించలేదు. ‘వెలి’ని భరించలేక కుటుంబంతో ఆయన ‘అరుణాచలం’ 1950లో వెళ్ళిపోయారు. 1979 మే 4న మరణించారు.
చలం గురించి రాస్తూ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితా సంపుటికి ఆయన రాసిన ‘యోగ్యతా పత్రం’ను ప్రస్తావించకపోతే సమగ్రం అనిపించుకోదు. ‘ఇది మహాప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీశ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు...’ అంటూ మొదలయ్యే ఈ ముందుమాటకు తెలుగు రచనల్లో అత్యంత ప్రసిద్ధమైనదిగా పేరుంది.
తెలుగులో స్త్రీల గురించి ఏ రచయితా చలం అంత గొప్పగా రాయలేదు అనడం అతిశయోక్తి కాదు. అసలు సిసలు స్త్రీవాద రచయిత చలం. చలం తన భావాలను వ్యక్తం చేయడానికి అనేక రచనా ప్రక్రియలను ఎన్నుకొన్నారు. అవన్నీ ఆయనకు పేరు తీసుకువచ్చాయి. ‘ఆ నిమిషానికి కులాసాగా చదవటానికి పనికివస్తాయి. ప్రస్తుత కాలపు కుటుంబ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి’ అంటారు మునిమాణిక్యం. ‘చలం ఒంటరి. ఆయన ఒంటరితనం తన చుట్టూ ఉన్న వారికి కూడా సోకిందేమోననుకుంటాను. అదే ఆయన్ను రమణాశ్రమం చేర్చింది’ అంటారు కొడవటిగంటి. ఎందరెందరు చదివితే అందరందరి చలంగా విస్తరించగల ఒకే ఒక్క తెలుగు రచయిత చలం. నేటికీ ఒక శేష ప్రశ్న.
తెలుగులో స్త్రీల గురించి ఏ రచయితా చలం అంత గొప్పగా రాయలేదు అనడం అతిశయోక్తి కాదు. అసలు సిసలు స్త్రీవాద రచయిత చలం. చలం తన భావాలను వ్యక్తం చేయడానికి అనేక రచనా ప్రక్రియలను ఎన్నుకొన్నారు. ఎందరెందరు చదివితే అందరందరికి విస్తరించగల ఒకే ఒక్క తెలుగు రచయిత చలం.
భమిడిపాటి గౌరీశంకర్
(నేడు చలం 130వ జయంతి)
Updated Date - May 18 , 2024 | 05:22 AM