ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనాథగా మిగిలిన తెలుగు అకాడమి

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:06 AM

రాష్ట్ర విభజన సందర్భంలో తెలుగు అకాడమిని పదవ షెడ్యూల్‌లో చేర్చారు. దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం వంటి భాషా సంస్థల అభివృద్ధి...

రాష్ట్ర విభజన సందర్భంలో తెలుగు అకాడమిని పదవ షెడ్యూల్‌లో చేర్చారు. దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం వంటి భాషా సంస్థల అభివృద్ధి పూర్తిగా ఆగిపోవడమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందున్న ప్రగతి కూడా కోల్పోయింది.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషకు ప్రోత్సాహం లభిస్తుందని మాతృభాషాభిమానులంతా ఆశపడ్డారు. కాని ఈ పదేండ్ల పరిపాలనలో తెలంగాణలో విద్యావికాసానికి ప్రధాన కేంద్రమైన తెలుగు అకాడమిని నిర్వీర్యం చేశారు. సంవత్సరానికి 15 నుంచి 20 కోట్ల వరకు ఆదాయం వచ్చే బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రద్దు చేయించి 140 కోట్లకు పైగా అకాడమి నిధులను అక్రమంగా ప్రభుత్వ ట్రెజరీకి బదిలీ చేయించారు. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏర్పడిన క్రొత్త ప్రభుత్వం విద్యారంగ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఇంటర్‌ నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యాసంస్థలన్నింటికీ దాదాపు 600 సబ్జెక్టులలో పాఠ్యగ్రంథాలను అందించే తెలుగు అకాడమి పునర్నిర్మాణం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


1956లో దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన చారిత్రక నేపథ్యంలో ఆనాటి భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బి.ఆర్‌. అంబేడ్కర్‌ మొదలైన రాజ్యాంగ నిపుణులతో లాంగ్వేజ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. దేశంలో మాతృభాషల వికాసం జాతి వికాసానికి, తద్వారా దేశ వికాసానికి కారణమవుతుందన్న భాషా కమిషన్‌ నివేదికలోని సత్యాన్ని గ్రహించిన ఆనాటి భారత ప్రభుత్వం విద్యావిధానంలో మాతృభాషలకు ప్రాధాన్యం ఇచ్చింది. మాతృభాషలో విద్యాబోధన జరగటానికి వీలుగా భాషా అకాడమిలను ప్రారంభించమని రాష్ట్రప్రభుత్వాలకు నిర్దేశించింది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న ఆయా కోర్సులకు అవసరమైన పాఠ్యగ్రంథాలను మాతృభాషలో రూపొందించమని అకాడమిలకు ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సూచించింది. విజ్ఞానశాస్త్రాల అనువాదం కొరకు ‘టెక్నికల్‌ టర్మినాలజీ’ని తయారు చేసుకోవాలి. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం కమిషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ టెర్మినాలజీ (సి.ఎస్‌.టి.టి) అనే సంస్థను స్థాపించి దాని ద్వారా వివిధ రాష్ట్రాలలోని భాషా అకాడమిలకు కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ అందిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా సంస్థగా తెలుగు అకాడమి 1968 ఆగస్టు 6న రిజిష్టర్డ్‌ సొసైటీగా ఐదుగురు సభ్యులతో ప్రారంభమైంది. అప్పుడు విద్యాశాఖ మంత్రి పి.వి.నరసింహారావు అధ్యక్షులుగా, ఎస్‌.ఆర్‌. రామమూర్తి (విద్యాశాఖ కార్యదర్శి), కె. రామాచారి (డిప్యూటీ సెక్రెటరీ, లా డిపార్ట్‌మెంట్‌), ఎల్‌. బుల్లయ్య (డైరెక్టర్‌, పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌), టి.ఆర్‌. దాస్‌ (డైరెక్టర్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌)– ఈ నలుగురూ సభ్యులుగా ఉన్నారు.


తెలుగు అకాడమి కేవలం భాషా సాహిత్యాలకే పరిమితం కాదు. కళలు, సంస్కృతి, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు మొదలుగా సమస్తమైన విజ్ఞానాన్ని మాతృభాషలో అందించే శాస్త్ర, విజ్ఞాన పరిశోధన సంస్థ. ఎంతోమంది పండితులు, మేధావులు, ఆచార్యులు, విషయ నిపుణులు తమ ప్రతిభా నైపుణ్యాలతో పాఠ్యగ్రంథాలను, శాస్త్ర గ్రంథాలను, సంకేత పదకోశాలను, నిఘంటువులను, మాండలిక పదకోశాలను తయారు చేశారు. కాలానుగుణంగా ఆయా సబ్జెక్టులలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ ప్రామాణికమైన ప్రచురణలను అందించే సంస్థ తెలుగు అకాడమి. అందువల్ల దీనిని కేవలం పాఠ్యగ్రంథ ప్రచురణ సంస్థగా మాత్రమే కాకుండా ‘తెలంగాణ రాష్ట్ర తెలుగు విజ్ఞాన పరిశోధనా సంస్థ’గా గుర్తించి, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయ హోదా కల్పించాలి. దాంతో తెలుగులో విజ్ఞానశాస్త్రాల అభివృద్ధికి, వికాసానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఈ సంస్థ ఏర్పడి 55 ఏళ్లు గడిచింది. నాలుగు వేలకు పైగా శీర్షికలతో లక్షలాది గ్రంథాలను ప్రచురించి దేశంలోని రాష్ట్ర భాషా అకాడమిలలో కేరళ, బెంగాలతో పాటు అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు అకాడమి తెలుగు–ఇంగీషు భాషల్లో ప్రచురించిన ఆంత్రోపాలజీ సంపుటాలు దేశవ్యాప్తంగా సివిల్‌ సర్వీస్‌ విద్యార్థులకు పఠనీయ గ్రంథాలై దాదాపు 200 మంది ఉత్తీర్ణులై ఎంపిక కావడం తెలుగు అకాడమి ప్రతిష్ఠకు నిదర్శనం. ఇది 2014 జూన్‌ వరకు ఉన్న తెలుగు అకాడమి ప్రగతి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంస్థకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను కూడా నియమించకపోవడం దురదృష్టకరం. తెలుగు అకాడమికి పాఠశాల విద్యకు సంబంధించిన అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించడం వల్ల వారికి ఉన్నత విద్యకు సంబంధించిన అవగాహన లేక, పర్యవేక్షణ లోపించి, పరిపాలన కుంటుపడి, విద్యార్థులకు అవసరమైన నూతన గ్రంథాలు రూపొందలేదు. గత పదేళ్ళుగా పాత పాఠ్యగ్రంథాలనే పునర్ముద్రించుకోవలసి వచ్చింది. పైరసీకి అడ్డుకట్ట వేయలేక, అమ్మకాలు తగ్గి అకాడమి ఆర్థికంగా నష్టపోయింది. అంతేకాక ఆంధ్ర ప్రాంతంలో పుస్తకాల సరఫరా, విక్రయం దాదాపు 9 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ముఖ్యంగా కోట్లాది రూపాయల విలువైన పాఠ్యగ్రంథాల కాపీరైటు విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు ప్రచురణ సంస్థ పాఠ్యగ్రంథాలను ప్రచురించడం వల్ల అకాడమికి ఆర్థిక నష్టం జరిగింది.

గత పది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆనవాయితీగా సమర్పించే బడ్జెట్‌ ప్రతిపాదనలు గవర్నింగ్‌ బాడి (పాలకమండలి) ఆమోదం లేకుండా ఆర్థిక వ్యవహారాలు కొనసాగటం అకాడమి నియమావళికి పూర్తి విరుద్ధం. పదేళ్లుగా పాలకమండలి సమావేశాలు జరగకపోవడం, విద్యా విషయక స్థాయీ సంఘం పునర్నియామకం జరగకపోవడం, పూర్తి స్థాయి సంచాలకుడు లేకపోవడం, ఉద్యోగ నియామకాలు లేకపోవడం, సిబ్బంది కొరత– ఇన్ని కారణాల వల్ల తెలుగు అకాడమి అయోమయ పరిస్థితిలో పడిపోయి, ఆర్థిక అవకతవకలకు గురయింది. ఈ పరిస్థితుల నుంచి తెలుగు అకాడమిని ఉద్ధరించడానికి ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావాలి.

రాష్ట్ర విద్యారంగ వికాసానికి ఆధారమైన ‘తెలుగు అకాడమి’ని ‘తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషా సంస్థ’ అనో ‘తెలంగాణ రాష్ట్ర తెలుగు విజ్ఞాన పరిశోధన సంస్థ’ పేరుతోనో ‘రిజిష్టర్డ్‌ సొసైటీ’గా ఏర్పాటు చేయాలి. తెలుగు అకాడమి ఇంటర్మీడియెట్‌ స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు (ఒకేషనల్‌ కోర్సులతో కలిపి) మొత్తం 600 సబ్జెక్టులలో పాఠ్యగ్రంథాలు తయారు చేసి ప్రచురించి ఇచ్చే సంస్థ కాబట్టి, దీనికి రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయ హోదా ఇచ్చి గుర్తించాలి. ఇది ప్రధానంగా తెలుగు విజ్ఞాన పరిశోధన సంస్థ కాబట్టి, దీనికి అన్ని సబ్జెక్టుల విషయ నిపుణులతో (గ్రంథ రచయితలతో) నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంస్థకు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌, తత్‌ సమాన హోదాతో ‘చైర్మన్‌’ పదవి ఏర్పాటు చేయాలి.


ఆ వ్యక్తి తెలుగు భాషా సాహిత్య విజ్ఞాన రంగాలలో నిష్ణాతుడై, విద్యా పరిపాలనా రంగంలో అనుభవం కలిగినవారై ఉండాలి. ప్రస్తుతం ఉన్న తెలుగు అకాడమి ‘డైరెక్టర్‌’ పదవిని ‘కార్యనిర్వహణాధికారి’ (ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా మార్పు చేయాలి. ఈ పదవికి డిప్యూటీ సెక్రెటరీ స్థాయి వారిని నియమించాలి. అలాగే తెలుగు అకాడమి అకౌంట్స్‌ ఆఫీసర్‌ పదవిని ‘ఫైనాన్స్‌ ఆఫీసర్‌’గా మార్పు చేయాలి. ఈ పదవికి ప్రభుత్వ ఆర్థికశాఖ, ఆడిట్‌ విభాగం నుండి అసిస్టెంట్‌ సెక్రెటరీ స్థాయివారిని నియమించాలి.

తెలుగు అకాడమి చేపట్టే నూతన పరిశోధన ప్రాజెక్టుల క్రింద పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, కళాతత్త్వ శాస్త్రాలు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సంకేత పదకోశాలను, నిఘంటువులను, భాషా సాహిత్యాలకు సంబంధించిన మాండలిక పదకోశాలను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ గ్రంథాలను తయారు చేయాలి. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి రాబట్టుకోవాలి.


అకాడమి పునర్నిర్మాణంలో మరొక ముఖ్యమైన అంశం విశాలమైన నూతన క్యాంపస్‌ను వందకోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్ర ‘తెలుగు విజ్ఞాన భవనం’ పేరుతో ఏర్పాటు చేయడం. ఈ ప్రతిపాదనకు 2012లో అకాడమి పాలకమండలి ఆమోదం తెలిపింది, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ కూడా నాలుగు ఎకరాలు స్థలం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం తెలుగు అకాడమి సొంతనిధులతో నూతన క్యాంపస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చు. తెలుగు అకాడమి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర మాతృభాషా సంస్థలయిన తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సాహిత్య అకాడమి, అధికార భాషా సంఘం ఈ మూడు సంస్థలను గురించి కూడా సమీక్షించాలి. ఈ నాలుగు భాషా సంస్థల పనితీరు వేరువేరుగా ఉన్నందున, వీటి పనితీరును సమీక్షిస్తూ మార్గదర్శకాలను సూచించే భాషా సంఘం (లాంగ్వేజ్‌ కమిషన్‌) ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంటే ప్రజలకు మరింత సన్నిహితమై రాష్ట్ర సర్వతోముఖ వికాసానికి దోహదం చేస్తుంది.

ప్రొఫెసర్‌ కె. యాదగిరి

పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి

Updated Date - Jul 23 , 2024 | 05:06 AM

Advertising
Advertising
<