ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చౌడప్ప శతకంలో చేరని కొత్త పద్యాలు

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:44 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాదు’ వారు 1982లో ‘అధిక్షేప శతకములు’ గ్రంథాన్ని ప్రచురించారు. ‘అధిక్షేపం’ అంతస్సూత్రంగా కలిగి, పూర్వకవులు రచించిన ఆరు శతకముల సంకలనమీ గ్రంథం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాదు’ వారు 1982లో ‘అధిక్షేప శతకములు’ గ్రంథాన్ని ప్రచురించారు. ‘అధిక్షేపం’ అంతస్సూత్రంగా కలిగి, పూర్వకవులు రచించిన ఆరు శతకముల సంకలనమీ గ్రంథం. అందులో ఒకటి కవి చౌడప్ప రచించిన ‘కవి చౌడప్ప శతకము’. క్రీ.శ. 17వ శతాబ్దికి చెందినవాడైన కవి చౌడప్ప తెలుగు శతక కర్తలలో బహుళ ప్రసిద్ధిని పొందినవాడు. ఈ శతకానికి రాసిన పీఠికలో కవి చౌడప్ప శతకము లోనివిగా దాదాపుగా రెండు వందల పద్యాలు లభ్యమౌతు న్నాయని, వాటిల్లోంచి పండితులు పరిష్కరించిన నూట వొక్క పద్యాలు అందులో ప్రచురింపబడుతున్నాయని పేర్కొన్నారు. నాకు తెలిసి, ‘కవి చౌడప్ప శతకము’గా ప్రచురించబడిన శతకం అధికారికంగా ఇది ఒక్కటే!

చెన్నైలోని ‘గవర్నమెంట్‌ ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్ట్స్‌ లైబ్రరీ’ తెలుగు విభాగం రికార్డు సంఖ్య ‘ఆర్‌ 01722’ తాళపత్ర వ్రాతప్రతిలో 79 పద్యాలతో కూడిన ‘కవి చౌడప్ప శతకం’ రాత ప్రతి ఒకటి ఉంది. ఏ కాలపుదో, ఎవరిదో తెలియని ఈ రాతప్రతిలో పైన చెప్పిన ‘కవి చౌడప్ప శతకము’లో చేరని పద్యాలు కొన్ని ఉన్నాయి. పేరు తెలియని ఈ లేఖకుని దస్తూరీ అంత కుదురైనదిగా లేదు. దానికితోడు తాళపత్రంలో అక్కడక్కడా పడిన మరకల వలన కూడా మాటలలో కొన్ని చోట్ల స్పష్టత కరువైంది. ఇప్పటివరకూ అప్రకటితాలై ఈ తాళపత్ర ప్రతిలో మగ్గుతున్న కవి చౌడప్ప పద్యాలలో భావ స్పష్టత ఉన్న పద్యాలను కొన్నిటిని విడిగా తీసి పరిష్కరించి, స్వల్పమైన వ్యాఖ్యను పద్యం క్రింద చేర్చి ఇక్కడ పొందుపరుస్తున్నాను. ప్రతి పద్యానికి పక్కనున్న సంఖ్య తాళపత్ర వ్రాతప్రతిలోనిది:

కం. రూకేరా సకలానికి

మూకేరా దొరలకెల్ల ముఖ్యము ధరలో

కాకేరా బంగారుకు

కాకోదర కుందవరము కవి చౌడప్పా! (5)

లోకంలో ఏ పని సాధించాలన్నా డబ్బుండాలి. ఆ రోజుల్లో ప్రభువుకు సైన్యం బలమైనదిగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ రోజులలో ప్రతి దేశానికి సైనికబలం అంతే ముఖ్యం గనుక ఈ పద్యంలోని చౌడప్ప మాటలు సర్వకాలీనమైనవిగా చెప్పుకోవచ్చు. బంగారానికి ఎంత సెగ తగిలితే అంత వన్నె తేలుతుందన్నది అందరూ ఎరిగిన నిజం.

ఈ తాళపత్ర రాతప్రతిలో లేఖకుడు ‘కుందవరము’ అనే చాలా పద్యాల్లో వ్రాసుకున్నాడు. ‘కుందపురము’ అని ఒకటి రెండు పద్యాల్లో కనపడు తుంది. పైన చెప్పబడిన ‘అధిక్షేప శతకములు’ సంకలనంలోని ‘కవి చౌడప్ప పద్యాలలో పేర్కొనబడినట్లుగా ‘కుందవరపు’ అని ఒక్క పద్యంలో కూడా లేదు.

కం. పేదలకు నెవ్వ డైనను

యీదలచిన వాని చేత యిప్పించ వలెన్‌

పేదల కీరాదన మే

ల్గాదప్పా కుందవరము కవి చౌడప్పా! (9)

కవి చౌడప్ప శతకంలోని పద్యాలంటే బూతుమాటలమయం అనే అభిప్రాయం జనసామాన్యంలో ప్రసిద్ధమై ఉందన్నది విదితమే! అశ్లీల పదజాలంతో కూడిన పద్యాలను మిగతా శతక కవులెవరూ చెప్పనంత పచ్చిగా కవి చౌడప్ప చెప్పాడనడం కాదనలేని నిజం అయినప్పటికీ, పేదరికం గురించిన పద్యాలను అత్యంత గౌరవ ప్రదమైన మాటలతో చెప్పాడనడం కూడా అంతే నిజం. అందుకు ఒక ఉదాహరణగా నిలిచేదే పై పద్యం!

కం. వాకిట నొకపర దేశియు

ఆకలి గొనియున్నవాని కన్నం బిడకే

తాకుడుచుట దాకుడుచుట

కాకోదర కుందవరము కవి చౌడప్పా! (10)

అభ్యాగతుడు గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూస్తుండగా, గృహస్థుడు ఇంట్లో నింపాదిగా భోజనం చేయడం చాలా తప్పని, అది ‘దాకుడుచుట’ అనగా ‘ఎడమ చేతితో తినడం’తో సమానమైనదని పై పద్యంలో సారాంశం.

కం. నడవడి గలనాడే సా

పడ వలయును పదియునైదు పాశంబులుచా

రెడు నెయి రాజన్నము మీ

గడ పెరుగుతొ కుందవరము కవి చౌడప్పా! (18)

శరీరంలో శక్తి, ఖర్చుపెట్టగల తాహతు, తిన్న తిండిని అరిగించుకోవ డానికి సరిపోయేంత పని సమంగా ఉండడం అన్నదే ‘నడవడి’ కలిగి ఉండడం అంటే! ఆ స్థితి పుష్కలంగా సాగుతున్న రోజులలో భోజనంలో పదీపదిహేనుకు తక్కువ కాకుండా పాయసాలు అనగా రుచికరమైన పదార్థాలు, చారెడు నెయ్యి, తెల్లని రాజనాల బియ్యపు అన్నము, మీగడ పెరుగుతో సంతృప్తిగా భోజనం చేయాలి అని భావం.

కం. తన విద్య దొరల వద్దను

వినిపించినవాడు లోకవిఖ్యాతుండౌ

వినిపించక తన చాతురి

కనుపించదు కుందవరము కవి చౌడప్పా! (28)

ప్రదర్శించనిదే వ్యక్తిలో దాగివున్న ప్రతిభ బహిర్గతం కాదు, నలుగురికీ తెలియదు. ఎప్పడో ఒకప్పుడు గుర్తించబడకపోతామా అని ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవడం సరైన పని కాదు. తనలో దాగివున్న విలక్షణమైన విద్యను, అర్థంచేసుకుని ఆదరించే అధికారి ముందు పెట్టడం వలన ఉపయో గమే కాని అపకారం జరగదు అని భావం.

కం. ముండా కొడుకుల సంపద

దండుగలకు గాక దాన ధర్మము గలదా

దండించువాని కిత్తురు

ఖండితముగ కుందవరము కవి చౌడప్పా! (38)

భయపెట్టి, దౌర్జన్యం చేసి లాగేసుకునే వాళ్ళకు చేసేది లేక డబ్బును పోగొట్టుకుంటారుగాని, తమంతతాముగా ధర్మకార్యాలకు ఖర్చుపెట్టడానికి, దానంగా ఇవ్వడానికి మాత్రం మనస్కరించని వ్యక్తుల చిత్తవృత్తిని అధిక్షేపిస్తూ చెప్పిన పద్యం ఇది. చౌడప్ప పద విన్యాసం స్పష్టంగా కనిపిస్తుంది ఈ పద్యంలో!

కం. శాంతమున తనదు కార్యము

ఎంత అసాధ్యమయినను జయింపగ వచ్చున్‌

కుంతి సుతుండు జయించడె

కాంతాశ్రమలకును వోర్చి కవి చౌడప్పా! (74)

శాంతగుణాన్నే ప్రధానంగా ఆశ్రయించినవారికి ఎప్పటికైనా విజయం సిద్ధిస్తుంది అని తానే కాకుండా తన తమ్ములు, వెంట ఉన్న స్త్రీజనం ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ చివరి వరకూ శాంత స్వభావాన్ని వీడక మహాభారత సంగ్రామంలో విజయం సాధించిన ధర్మరాజును ఉదాహరణగా చూపి చెప్పిన పద్యం పైది.

ఆం.సా. అకాడమీ వారు ‘అధిక్షేప శతకములు’ గ్రంథంలో ప్రచురించిన ‘కవి చౌడప్ప శతకము’లో లేకుండా పైన చెప్పిన తాళపత్ర రాతప్రతిలో కనపడిన పద్యములలో నా పరిష్కరణకు లొంగిన అర్థవంతమైన పద్యములు ప్రస్తుతానికి ఇవి మాత్రమే! ఛందస్సు పరంగా కందపద్యానికి సరిపోతూ, పరిష్కరణకు లొంగుతున్నా అర్థం సరిగా కుదరనివి, ఈ తర్వాత ఉదాహరించిన టువంటి పద్యాలు మరి కొన్ని ఉన్నాయి.

కం. నేరుతునని మాటాడగ

వారిజభవుడైన వాని వశమా తంజ్జా

వూరి రఘనాథనాయలు

గారప్పా కుంద్దపురము కవిచౌడప్పా! (75)

అర్థం బోధపడుతున్నప్పటికీ కందపద్యం ఛందస్సుకు సరిపోని పద్యాలు, ఈ క్రింద ఉదాహరించినట్టివి మరికొన్ని ఉన్నాయి.

వేడుక తోవిన వలెనా

రూఢిక విత్వము నలుగురి లోనన్‌

ఊడిగ ము శేయు వాడే

గాడిద యయ్యెను గదప్ప కవి చౌడప్పా!

అర్థమూ కుదరక, ఛందస్సుకు అన్ని విధాలా సరిపోతున్నా, పరిష్కర ణానికి లొంగకుండా ఉన్న పద్యాలు కొన్ని క్రింద ఇస్తున్నాను.

కం. దొరకైనను పేదకైనను

వెరపకు నిల్లాలికైన వేశ్యకునైనన్‌

గెరగెరి బాగౌ సుమ్మీ

కరుణాకర కుందవరము కవి చౌడప్పా! (60)

కం. హృదయము పదిలంబైతే

గదికొను సంన్యాసికైన కొంమ్ములు గలవా

యిది యెరుగని చదువయ్యలు

గదవప్పా కుందవరము కవి చౌడప్పా! (62)

ఇవన్నీ పరిశీలించి, పరిష్కరిస్తే ఇప్పుడు లభ్యమయ్యే కవి చౌడప్ప పద్యాలకు కనీసం ఇరవై పద్యాలైనా అదనంగా చేరే అవకాశం ఉంది.

భట్టు వెంకటరావు

Updated Date - Apr 08 , 2024 | 12:44 AM

Advertising
Advertising