సర్వేపల్లి స్ఫూర్తితో భావి పౌరుల శిక్షణ
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:59 AM
సమాజమంతా నేటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రేపటి సమాజాన్ని గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తిత్వం గురువుల సొంతం. వారు ఈ రోజు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక భవిష్యత్‌ను మహోన్నతంగా నిర్మించాలన్న...
కృత్రిమ మేధ పేరిట మన సమాజం ఉపాధ్యాయుడు లేని విద్య దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇది మంచి పరిణామం కాదు. గురువు స్థానంలో ఓ కృత్రిమ మేధ బొమ్మను ఉంచి చిలక పలుకులు పలికిస్తే చదువు వస్తుంది. చదువు వస్తుందేమో గానీ, సంస్కారం ఎక్కడ నుంచి వస్తుంది? జీవన వికాసానికి నవ్యమార్గాలను నిర్మించే మహోన్నత విద్యాయజ్ఞాన్ని నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో భావి తరాలకు వెలుగు బాటలు వేయాలి.
సమాజమంతా నేటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రేపటి సమాజాన్ని గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తిత్వం గురువుల సొంతం. వారు ఈ రోజు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక భవిష్యత్‌ను మహోన్నతంగా నిర్మించాలన్న సంకల్పమే ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు రేపటి ఆశలకు సారథులుగా, భవిష్యత్ నిర్మాణానికి వారధులుగా నేను భావిస్తాను. తమ కోసం ఆలోచించుకోకుండా, భవిష్యత్ గురించి కలలు కనటం బహుశా వారికే చెల్లింది. అందుకే విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు ఈ సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునేందుకు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని భారత ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. జీవన వికాసానికి నవ్య మార్గాలను నిర్మించే మహోన్నత విద్యాయజ్ఞాన్ని నిర్వహించి ఉన్నత పదవులను అధిష్టించిన రాధాకృష్ణన్ స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పించటంతో పాటు, ఆయన చూపిన ఆదర్శనీయ మార్గాన్ని భావి తరాలకు ఆచరణలో చూపెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.
ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు. నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గమూ కాదు. అది రేపటి సమాజాన్ని సృష్టించే ఓ మహా యజ్ఞం. ఆ యజ్ఞాన్ని మహోన్నతంగా నిర్వహించి, భవిష్యత్తును నిర్మించిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రణతులు అర్పిస్తున్నాను. గతమంతా శృతంగా సాగిన భారతీయ విద్యా వ్యవస్థలో గురువు స్థానం మహోత్కృష్టమైనది. శిష్యులను కుమారుల కంటే ఎక్కువగా చూసిన గొప్పతనం గురువులదైతే, గురువును తల్లిదండ్రుల కంటే గొప్పగా గౌరవించిన సంస్కారం శిష్యుల సొంతం. మైసూరు రాజా వారి కళాశాలలో పని చేసి బదిలీ అవుతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను అక్కడి విద్యార్థులు గుర్రపు బగ్గీలో ఊరేగిద్దామనుకుని, సమయానికి గుర్రాలు రాకపోతే స్వయంగా వారే బండి లాగి తమ గురువు పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సంఘటనకు మొదటి కారణం తరతరాలుగా మన రక్తంలో జీర్ణించుకుపోయిన గురుశిష్య సంబంధం ఒక కారణమైతే, రెండోది సర్వేపల్లి వారు ఆ విద్యార్థుల్లో నాటిన సంస్కార బీజాలు.
ఇటీవల పత్రికల్లో చదివాను. ఇదే విధమైన గౌరవాన్ని శిష్యుల నుంచి పొందిన గురువు గురించి, గురువు బదిలీ అయ్యి వెళుతుంటే కన్నీళ్ళు పెట్టుకున్న శిష్యుల గురించి. ఇదో మంచి పరిణామం. కాలం మారుతోందని మనం నమ్మి తీరాల్సిన వాస్తవం. అయితే మన పెద్దలు నాటిన సంస్కార బీజాల కారణంగా కాలం మారుతున్నా, గురుశిష్య సంబంధాల్లో ఇలాంటి సానుకూల పరిణామాలనే నేను ఆకాంక్షిస్తున్నాను. అయితే కారణాలు ఏవైనా కావచ్చు అక్కడక్కడా మానవీయ విలువలు పలుచనైపోయి, మానవసంబంధాలు ప్రతికూల మార్గంలో వెళుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే మన బోధనా విధానాల్లో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. మన విద్యా వ్యవస్థలో గురువులపైన ఉన్న నమ్మకం సన్నగిల్లలేదు. ఉపాధ్యాయుడు చెప్పింది పొరపాటున ఒకవేళ వాస్తవం కాదని చెప్పినా, మా ఉపాధ్యాయుడు సరిగానే చెబుతాడు అనే నమ్మకం విద్యార్థుల్లో బలంగా ఉంది. మన విద్యావ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పటానికి ఇదొక్కటి చాలు. అయితే బలమైన మూలాల నుంచి మరింత పటిష్ఠమైన భావి భారత నిర్మాణం రూపుదిద్దుకోవాలంటే చదువులోని నిజమైన పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలి.
నేను అనేక సందర్భాల్లో చెప్పినట్లు చదువంటే మార్కులు మాత్రమే అనే సంస్కృతి పోవాలి. జ్ఞానాన్ని అందించటంతో పాటు భారతీయ విలువలతో కూడిన విద్యను బోధించాలి. ఇందుకోసం విద్యా విధానాల్లో మార్పులు రావలసిన అవసరం ఉంది. ఋగ్వేదం చెప్పినట్లుగా ‘ఆనో భద్ర\ కృతవో\ యంతు\ విశ్వతః’ అంటే ఉత్తమమైన భావాలు అన్నివైపుల నుంచి రావాలి. దీన్ని విస్తృత అర్థంలో ఆకళింపు చేసుకోవలసిన అవసరం ఉంది. విద్యార్థులు తరగతి గదుల నుంచి, పుస్తకాల నుంచి మాత్రమే కాదు సమాజం నుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మొక్కలను చూసి ఎదగడం, పక్షులను చూసి ఎగరడం, చెట్టును చూసి సాయం... ఇలా ఎన్నింటినో నేర్చుకోవచ్చు. అప్పుడే విద్యార్థుల్లో నిజమైన నైపుణ్యం బయటకు వస్తుంది. దీనితో పాటు ఉపాధ్యాయులు వ్యక్తిగత అలవాట్లు కీలకమే. అవి విద్యార్థులను ప్రభావితం చేస్తాయి. ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ పుణ్యమాని కొంతమంది ఉపాధ్యాయుల తీరులోనూ మార్పులు వచ్చాయని అక్కడక్కడా వినిపిస్తోంది. ఇంటి సమస్యలను పాఠశాలల వరకూ మోసుకొచ్చేవారు, పాఠశాల సమయంలోనూ ఇంటి గురించి దిగులుపడేవారు ఉన్నారన్నది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి. ఉపాధ్యాయుల కోపం, కష్టం లాంటివి పాఠశాలల గోడలకు బయటే ఉండాలి తప్ప, ఆ గోడలు దాటి తరగతి నాలుగు గోడల మధ్యకు రాకూడదనే విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి.
ఈ సందర్భంగా నాకు ప్రహ్లాద చరిత్రలో ఓ ఘట్టం గుర్తుకువస్తోంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దేవుడు కాదు నేనే దేవుణ్ణి అన్న హిరణ్యకశిపుడు సైతం తన కుమారుడికి విద్యను నేర్పేందుకు గురువుల వద్దకే పంపించాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటూ నిజమైన విద్యలోని పరమార్థాన్ని తెలుసుకోగలిగానన్న ప్రహ్లాదుని జీవితమే ఈ తరాలకు ఆదర్శం కావాలి. ఈ మధ్యకాలంలో కృత్రిమ మేధ పేరిట మన సమాజం గురువు లేని విద్య దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇది మంచి పరిణామం కాదు. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్లు గూగుల్ సైతం గురువుకు ప్రత్యామ్నాయం కాదు. గూగుల్‌కు సమస్య వచ్చినా దాన్ని తీర్చడానికి గురువే కావాలి. అసలు తరగతి గతంలో 30 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు అనే నియమం ఎందుకు పెట్టారన్న కనీస విషయాన్ని ఆలోచించే ఎవరికైనా ఇది అవగతం అవుతుంది. ప్రతి ఒక్కరి పట్ల గురువు శ్రద్ధ వహించాలనేది ఇందులోని పరమార్థం. గురువు స్థానంలో ఓ కృత్రిమ మేధ బొమ్మను ఉంచి చిలకపలుకులు పలికిస్తే చదువు వస్తుంది. చదువు వస్తుందేమో గానీ, సంస్కారం ఎక్కడ నుంచి వస్తుంది? చంపటం ఎలా అని ఎవరైనా గురువును అడిగితే... అది తప్పు అని చెబుతాడు. గూగుల్‌ని అగిడితే మొత్తం వివరాలు అందిస్తుంది. అంటే మనిషి దగ్గర ఉండే ఒకే ఒక మెదడు, సానుకూల ఆలోచనతో సంబంధం లేకుండా భవిష్యత్ తరాలను తయారు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు.
గురువు లేని విద్య – గుడ్డి విద్య అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. విద్య అంటే నాలుగు మాటలు నేర్పి దాన్ని అదే విధంగా రాస్తే మార్కులు వేసి సర్టిఫికేట్ ఇవ్వటం కాదు. విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందింపజేసి, వారిని భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే ఓ అత్యున్నత విధానం. విద్యార్థి మూర్తిమత్వ వికాసం, జ్ఞానాభివృద్ధి సరైన విద్య ద్వారానే సాధ్యమౌతుంది. ప్రపంచంలో ఎన్ని బోధనా పద్ధతులు వచ్చినా, వాటి ప్రధాన ఉద్దేశం ఇదే. విద్య అంటే మార్కుల కోసం నేర్చుకునే అక్షరాలు కాదు... మనుగడ కోసం నేర్చుకోవలసిన సంస్కారం అనే ఆలోచన సమాజంలో రావలసిన అవసరం ఉంది. ఇందుకోసం భారతీయ నూతన విద్యావిధానం సరికొత్త బాటలు వేస్తోంది. వీటిని అధ్యాపకులు వినియోగించుకోవాలి. దీనితో పాటు విద్యార్థులకు మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఏ మీడియంలో బోధించాలనే విషయం మీద అనేక మల్లగుల్లాలు సాగుతున్నాయి. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విద్యార్థులను మనవైన విలువలతో పరిపూర్ణంగా తీర్చిదిద్దగలము.
ఎన్ని నూతన విధానాలు వచ్చినా మంచి సమాజం సాకారం కావాలంటే విద్యే మూలాధారం. విద్యకు ఆధారం గురువే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశానికి రాజైనా ఒక గురువుకు శిష్యుడే. అది గుర్తుంచుకున్న ప్రతి ఒక్కరూ తాము ఎంత స్థానంలో ఉన్నా గురువులను గౌరవిస్తారు, ఆ వృత్తిని పూజిస్తారు. భారతదేశానికి తలమానికమైన గురుశిష్య సంబంధం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం కావాలని ఆకాంక్షిస్తూ... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ముప్పవరపు వెంకయ్యనాయుడు
పూర్వ ఉపరాష్ట్రపతి
(నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం)
Updated Date - Sep 05 , 2024 | 02:00 AM