సైద్ధాంతిక పోరుగా సార్వత్రక సమరం
ABN, Publish Date - May 15 , 2024 | 01:11 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వస్తారా లేదా అన్న ప్రశ్నతో నిమిత్తం లేకుండా ఈ ఎన్నికలతో భారత రాజకీయాలు ఒక నిర్ణాయక ఘట్టంలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వస్తారా లేదా అన్న ప్రశ్నతో నిమిత్తం లేకుండా ఈ ఎన్నికలతో భారత రాజకీయాలు ఒక నిర్ణాయక ఘట్టంలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో భారతదేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు త్వరలో సమాధానం లభించనుంది. 1952 నుంచి వరుసగా మూడుసార్లు జరిగిన ఎన్నికలు వేరు. అప్పుడు కాంగ్రెస్‌కు పెద్ద పోటీ లేదు. కాని 2014, 2019, 2024 ఎన్నికలు వేరు. దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలు ఏ దిశన ఉండాలో ప్రజలు కోరుకుంటున్నారో సూచించే ఎన్నికలు ఇవి. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో రెండు వాదాలు ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరాడుతున్నాయి. తెలిసో, తెలియకో, ఆలోచించో, అన్యమనస్కంగానో ప్రజలు రెండు శిబిరాల్లో ఏదో ఒక శిబిరంలో చేరారు. రెండు దశాబ్దాల క్రితం నిలదొక్కుకునేందుకు నానా అగచాట్లు పడిన ఒక పార్టీ ఇవాళ దేశంలోనే ప్రబల శక్తిగా మారింది. ఆ శక్తిని ఢీకొనేందుకు ఇప్పుడు ఇతర వర్గాలన్నీ తమ అంతర్వైరుధ్యాలన్నీ మరిచి ఏకం కావల్సిన చారిత్రక ఆవశ్యకతను గ్రహించాయి. వారితో పాటు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, సమాజం ఫలానా విధంగా ఉండాలని కోరుకుంటున్న బుద్ధిజీవులు కూడా విడిపోయారు. అందువల్ల స్పష్టంగా ఆలోచనల మధ్య సమరం జరుగుతున్న ఎన్నికలు ఇవి.
నాలుగోదశ ఎన్నికలు జరిగి దేశంలో 379 స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతే సమధికోత్సాహంతో ఎన్డీఏకు 400 సీట్లు రావడం ఖాయం అని ఆత్మస్థైర్యంతో ప్రకటించారు. కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావని ప్రతిపక్ష హోదా కూడా లభించదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని, మూడో టర్మ్ మొత్తం ఆయనే పాలిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. సూర్జిత్ భల్లా వంటి ఆర్థికవేత్తలు కూడా బీజేపీ 350 సీట్లు గెలుస్తోందని చెబుతుంటే, మోదీ ఉధృతి పెరుగుతుందే కాని తగ్గడం లేదని బీజేపీ అనుకూల మేధావులు వాదిస్తున్నారు.
2014లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తే, 2019లో పుల్వామా, బాలాకోట్ ఘటనలు ఫలితాలను ప్రభావితం చేశాయి. ఈ సారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక వ్యక్తిగా దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలనన్నిటినీ ఢీకొనేందుకు సిద్ధపడ్డారు. మోదీ వర్సెస్ ఇతరులు అన్నట్లుగా ప్రచార సరళిని తీర్చిదిద్దారు. ప్రతి నియోజకవర్గంలోనూ మోదీయే పోటీ చేస్తున్నారు అన్న భావన ముఖ్యంగా ఉత్తరాదిన కల్పించారు. నిజంగా ఇది ప్రతిపక్షాలకు మాత్రమే కాదు, ఒక భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న, ముఖ్యంగా మోదీని ద్వేషిస్తున్న వారందరికీ సవాల్.
మరో వైపు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికలు నిర్ణాయకంగా మారనున్నాయని అంగీకరిస్తున్నాయి. ప్రతి దశలోనూ పోలింగ్ పూర్తయిన కొద్దీ ప్రతిపక్షాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, మోదీ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలే ఆయనలో భయాందోళనలను ప్రతిఫలిస్తున్నాయని వారు విశ్వసిస్తున్నారు. మోదీ కీ గ్యారంటీ అన్న నినాదాన్ని కూడా పక్కన పెట్టి ప్రతిపక్షాలపై దాడులు ప్రారంభించారని, కాంగ్రెస్ మేనిఫెస్టోను సైతం వక్రీకరిస్తున్నారని వారు ఎత్తిచూపుతున్నారు. కార్పొరేట్ ఎజెండాకు అనుకూలంగా మోదీ పనిచేస్తుంటే తాము సామాజిక న్యాయ ఎజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పుకుంటున్నారు. ఈ రకంగా కూడా రెండు విధానాల మధ్య ఘర్షణ జరుగుతోందని ప్రతిపక్షాలు కూడా స్పష్టీకరిస్తున్నాయి.
అయితే ఎన్నికల సమయంలో నేతలు ఏ రకంగా ప్రచారం చేసినా, ఎన్ని వ్యాఖ్యలు చేసినా కేవలం వాటి ద్వారానే ప్రజలు ప్రభావితం అవుతారని, ముందుగా తాము ఏర్పర్చుకున్న నిశ్చితాభిప్రాయానికి భిన్నంగా ఆలోచిస్తారని భావించడం అమాయకత్వమే. కొంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న ఓటర్లు మాత్రమే ఎన్నికల సమయంలో జరిగే ప్రచారాలకు, పరిణామాలకు ప్రభావితమవుతారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు తొలి దశ ఫలితాలకు, మలిదశ ఫలితాలకూ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనపడింది. ఇప్పుడా పరిస్థితులేమీ లేవు. నిజానికి దేశంలో చాలా చోట్ల ప్రజలు తాము ఎవరికి ఓటు వేయాలో ఎన్నికలకు చాలా ముందే నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఇలాంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశంలో మూడు వాదనలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. మోదీపై జనాదరణ ఏ మాత్రం తగ్గలేదని ఆయన మళ్లీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ఒక వర్గం చెబుతోంది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బీజేపీకి సీట్లు పెరుగుతాయే కాని తగ్గే అవకాశాలులేవని వారు వాదిస్తున్నారు. మోదీకి కనీసం 70 నుంచి వంద సీట్లు తగ్గుతాయని, ఆయన మళ్లీ ప్రధానమంత్రి కావడం కష్టమని ఇంకో వర్గం చెబుతోంది. 2004లో వాజపేయికి తిరుగులేదని అందరూ భావించారని, భారతదేశం వెలిగిపోతుందన్న ప్రచారాన్ని ఆర్భాటంగా జరిపారని, అయినప్పటికీ ప్రజలు బీజేపీని తిరస్కరించి యూపీఏను అధికారంలోకి తీసుకువచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ ఎన్నికలను 2004లో జరిగిన ఎన్నికలతో పోల్చవచ్చని వారు వాదిస్తున్నారు. ఇక మూడోవర్గం మోదీ, బీజేపీ చెప్పుకుంటున్నట్లు ఎన్డీఏకు 400 సీట్లు రాకపోయినా అధికారంలోకి రావడం ఖాయమని వాదిస్తోంది. 2019కీ, ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా లేదని, కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గినా ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడం ఖాయమని వారు వాదిస్తున్నారు. ఏదో గొప్ప పరిణామం జరిగి బీజేపీ 200 సీట్ల కంటే తక్కువకు పడిపోతుందన్న విషయం వారు ఏ మాత్రం అంగీకరించడం లేదు.
అయితే బీజేపీ ఈ దేశంలో మెజారిటీ వాద పార్టీగా అవతరిస్తుందని మోదీ సమర్థకులు, వ్యతిరేకులు ఇరువురూ అంగీకరిస్తున్నారు. 2014లో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఎదుర్కొంటున్న వ్యతిరేక పవనాలు బీజేపీ ఇప్పుడు ఎదుర్కోవడంలేదని వారే చెబుతున్నారు. ఉచిత రేషన్, కశ్మీర్‌లో 370 రద్దు, రామమందిర నిర్మాణం, విదేశాల్లో దేశ ఆత్మగౌరవాన్ని కాపాడడం వంటి నాలుగు అంశాలే ప్రజలు తమకు చెబుతున్నారని, బీజేపీ పట్ల వారి ఆదరణకు ఇదే కారణమని యోగేంద్ర యాదవ్, సుధీంద్ర కులకర్ణి వంటి రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, దైనందిన జీవన సమస్యల విషయంలో మోదీ హాయాంలో ఏమీ మార్పులేదని గ్రహించినందువల్ల బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలున్నాయని వారు వాదిస్తున్నారు. 2019లో మోదీకి ఓటు వేసిన వారిలో అనేకమంది ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని వారి అభిప్రాయం. కర్ణాటకలో 10 సీట్లు, మహారాష్ట్రలో 20 సీట్లు, రాజస్థాన్, గుజరాత్‌లలో 10 సీట్లు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో 10 సీట్లు, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ లలో 10 సీట్లు, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో 30 సీట్లు, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాల్లో 10 సీట్లు కనీసం తగ్గిపోతాయని యోగేంద్ర యాదవ్ ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్డీఏకు సీట్లు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ వాదనను చాలా మంది బీజేపీ యేతర వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ 210–240 సీట్లు దాటదని తొలుత ప్రకటించారు. ఎన్డీఏ 400 సీట్లు సాధించాలంటే పాకిస్థాన్‌ను గెలవాల్సి ఉంటుందని చమత్కరించారు. శరద్ పవార్ కూడా ఈ వాదనను సమర్థించారు. బీజేపీ 220 సీట్లు దాటదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమలనాథులకు 200 కూడా దాటవని చెబుతున్నారు. ఇక రాహుల్ గాంధీ అందరికంటే ఒకడుగు ముందుకు వేసి బీజేపీకి 150 సీట్లు మించవని చెబుతున్నారు. అంటే దేశంలో బీజేపీయేతర వర్గాలన్నీ ఒకే వాదన వినిపిస్తున్నాయని అర్థమవుతోంది. అసలు తమకెన్ని వస్తాయో చెప్పకుండా బీజేపీ కెన్ని వస్తాయో వారు అంచనా వేయడమే ఆశ్చర్యకరం. బీజేపీ నష్టమే తమకు లాభమని వారు భావిస్తున్నారు.
ఎన్డీఏ 400 సీట్లు, బీజేపీ 370 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో మోదీ జనవరిలోనే తన ప్రచారాన్ని ప్రారంభించారు. 1952లో జరిగిన తొలి సార్వత్రక ఎన్నికల్లో నెహ్రూ సాధించిన 364 సీట్ల రికార్డును అధిగమించాలని, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దును ప్రేరణగా తీసుకొని పనిచేయాలని ఆయన భారత మండపంలో పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాను రానూ సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో మోదీ ఈ లక్ష్యం సాధించడం కష్టమని బీజేపీ నేతలే అనేకమంది అంగీకరిస్తున్నారు. భారీ లక్ష్యం విధిస్తే కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతోనే మోదీ ఈ ప్రకటన చేశారని వారు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో ఆర్‌జేడీ, వామపక్షాలు, ఢిల్లీలో ఆప్, మహారాష్ట్రలో ఎన్‌సీపీ, శివసేన వర్గాలతో కాంగ్రెస్ చేతులు కలిపి, సామాజిక న్యాయాన్ని ఎజెండాగా మార్చి 2019 ఎన్నికల్లో కంటే ఈ సారి మరింత సంఘటితంగా రంగంలోకి దిగడంతో ఈ రాజకీయ పోరు క్రమంగా సైద్ధాంతిక పోరుగా పరిణమించింది. దీనికి తోడు దేశంలో మోదీని వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ ఏకమై ఈ పోరును మరింత దట్టంగా మార్చాయి. దేశంలో అలముకున్న ఈ దట్టమైన కారుమేఘాలు జూన్ 4న చెదిరిపోయి ఒక స్పష్టత ఏర్పడినప్పుడు దేశం ఎటుపోతుందో చెప్పడం సాధ్యం.
ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - May 15 , 2024 | 01:12 AM