ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైడ్రా పరిధి మరింత విస్తరించాలి!

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:17 AM

తెలంగాణా ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములతో పాటు, ఇనాం, దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్‌ భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయి. ఆనాడు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన అగ్రకుల సంపన్నవర్గం తెలంగాణ జవ జీవాలను పీల్చివేసింది.

తెలంగాణా ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములతో పాటు, ఇనాం, దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్‌ భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయి. ఆనాడు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన అగ్రకుల సంపన్నవర్గం తెలంగాణ జవ జీవాలను పీల్చివేసింది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు ఈ దోపిడికి ఆ రోజు అండగా నిలబడ్డారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం వనరులను దోపిడీ చేస్తూ, ఇక్కడి ప్రజలను అణచివేతకు గురి చేస్తూ పరిశ్రమలు, విద్యా, వైద్యం, విద్యుత్, రవాణా, కమ్యునికేషన్, బ్యాంకింగ్... వంటి అన్ని కీలక రంగాలలో ప్రైవేటు ఆధిపత్యం జొప్పించారు. సామ్రాజ్యవాద మార్కెట్ సంస్కృతితో తెలంగాణలో విషం నింపారు.

తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రంతోనే తీరిపోదని ఈ దశాబ్ది పాలనలో తేటతెల్లమైంది. సామ్రాజ్యవాదం, ప్రపంచ బ్యాంకు నిర్దేశిస్తున్న విధానాలలో ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి లేదు. ఈ తరుణంలో స్థానిక వనరులతో, స్వావలంబన విధానాలతో కింది నుంచి జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా నిలబడుతుంది. ఈ దిశగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజల నిర్దిష్టమైన సమస్యలకు నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను చూపే విధమైన అభివృద్ధి విధానం కీలకం. ఇందుకు అనుగుణంగా అన్ని ప్రజా సముదాయాలకు అభివృద్ధి సమతూకంలో అందేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే ‘హైడ్రా’తో చేపడుతున్న కూల్చివేతల పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ను హైదారాబాద్‌కు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పడంగాక రాష్ట్రం మొత్తం ‘హైడ్రా’ను విస్తరింపచేయాలి.


ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో రియల్టర్ల చేతుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ భూములను, ఆంధ్రా కాలనీల భూములను స్వాధీన పరచుకుని ఆయా జిల్లాల్లో పేదలకు పంచిపెట్టాలి. అంతేగాక తెలంగాణా ఉద్యమం సందర్భంగా ఫిలింసిటీ, లాంకోహిల్స్‌, చిత్రపురి తదితర భూముల స్వాధీనం గురించిన డిమాండ్‌ ముందుకొచ్చింది. గత కేసీఆర్‌ ప్రభుత్వం అధికార బలంతో తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోస్తా ఆంధ్ర సంపన్నుల ఆధిపత్యాన్ని వేగంగా తొలగించి వేయాలి. సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో సినీ నిర్మాతలు, తదితర సంపన్నులు ఆక్రమించుకున్న విలువైన భూములను స్వాధీనపరచుకుని ప్రజలకు పంచాలి. పరిశ్రమల వ్యర్థ పదార్థాలను మూసీ నదిలోకి వదలకుండా చూడాలి. ఈ వ్యర్థ పదార్థాల వలన తలెత్తిన పర్యావరణ కాలుష్యం, తాగునీటి కొరత, వ్యవసాయ భూములు పనికి రాకుండా పోవడం వంటి సమస్యల కోసం శాశ్వత పరిష్కారాలు వెతకాలి. తెలంగాణ పరిశ్రమల్లో వచ్చే లాభాలు ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు పెట్టాలి.


హైదరాబాద్‌లోని సంపన్న కాలనీవాసులకు నీరందించే విధంగా వాడుకుంటున్న సింగూరు, మంజీరా జలాశయాల నీటిని బస్తీవాసులకు కూడా అందివ్వాలి. ఆ అవినీతికి కుంభకోణానికి పాల్పడే రాజకీయ నాయకుల ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆస్తులు జప్తు చేయాలి. బడా పారిశ్రామిక వాణిజ్య వర్గాలకు సామ్రాజ్యవాదులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష పరోక్ష రాయితీలను, సబ్సిడీలను ఈ తరుణంలోనే నిలిపివేయాలి. వీరు వివిధ రూపాల్లో ఎగవేస్తున్న బకాయిల్ని వెంటనే వసూలు చేయాలి. అన్ని రకాల మిగులు భూములన్నీ పేద రైతాంగానికి పంచాలి. భూస్వాముల నుంచి రైతాంగం తిరిగి స్వాధీనపరుచుకున్న భూములకు పట్టాలు, రైతు భరోసా పథకాలు వర్తింపచేయాలి.

ప్రభుత్వ భూములు, నదులు, ఏర్లు, బఫర్‌ జోన్లు, దేవాదాయ, వక్ఫ్‌ భూములను ఆక్రమంగా ఆక్రమించి పాగా వేసిన భూ కబ్జాదారుల్లో ఇప్పుడు హైడ్రా వల్ల భయాందోళనలు, అలజడులు మొదలయ్యాయి. హైడ్రా నిజాయితీతో నిబద్ధతతో పని చేయాలని, దాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపచేయాలనీ సాధారణ ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. కనుక హైడ్రా విస్తృతి పెంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రైవేట్‌ భూముల ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసి కూల్చివేతకు చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లు, పట్టా భూములను సైతం కొంతమంది రౌడీషీటర్లు ఆక్రమించుకున్నారు. వారిచేత అవన్నీ ఖాళీ చేయించాలి. అక్రమ ఆక్రమణలను తొలగించి చెరువులు, ఏర్లూ, నదుల నీటి ప్రవాహానికి స్వేచ్ఛ కలిగించాలి. ఇలాంటి అన్ని విషయాలతో నిండిన వరంగల్ డిక్లరేషన్ దిశగా హైడ్రా అడుగులు పడాలని తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తున్నది!

రామటెంకి అశోక్

తెలంగాణ ప్రజా ఫ్రంట్

ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు

Updated Date - Sep 10 , 2024 | 01:17 AM

Advertising
Advertising