ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సదస్సు
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:18 AM
గత నెలలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు యం.ఆర్.పి.ఎస్ చేసిన మూడు దశాబ్దాల ఉద్యమ పోరాట విజయం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ...
గత నెలలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు యం.ఆర్.పి.ఎస్ చేసిన మూడు దశాబ్దాల ఉద్యమ పోరాట విజయం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగబద్ధమేనని ఈ తీర్పు స్పష్టం చేసింది. అయితే ఈ వర్గీకరణ ఎలా చేయాలనే అంశానికి సంబంధించి ఎలాంటి తీర్పూ ఇవ్వలేదు. మార్గదర్శకత్వం కూడా చేయలేదు. పైగా ఈ కేసుకు సంబంధంలేని అంశంలోకి వెళ్లి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పింది. ఇది తీవ్ర అన్యాయమైనది. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేసుకున్న చందంగా మొత్తం రిజర్వేషన్లకే ఎసరుపెట్టే మార్మికత ఈ తీర్పులో దాగి ఉంది. ఈ రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ఒక పాలసీని గైడ్ చేసి అమలు చేయమని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని మినహాయించి రాష్ట్రాలపైకి విభజన అమలును నెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్లను నిరాకరించడమే. ఇలా చేయడం తగదు. ఈ తీర్పు నేపథ్యంలో మరోమారు మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించే అవకాశం ఉంది. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ బోధించిన సామాజిక న్యాయ సిద్ధాంతానికి లోబడి ఎటువంటి ప్రయత్నాన్నైనా ఆపాలి. మాదిగ సోదరులు కూడా సంయమనాన్ని పాటించాలి. ఇప్పటికైనా అన్ని వర్గాల మేధావులు, నాయకత్వాలు కూర్చొని ఒక న్యాయమైన పరిష్కారాన్ని రూపొందించుకోవాలి.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై తీర్పును స్వాగతిస్తున్నాం. క్రీమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కుల జన గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించకపోవడాన్ని తప్పుబడుతున్నాం. ఈ సందర్భంగా నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు దళిత మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరగనున్నది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్‌లో బత్తుల వెంకన్న అధ్యక్షతన జరిగే ఈ సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ముఖ్య అతిథి. ప్రొ. కాశీం, వై.కె., డా. ఎం.ఎఫ్ గోపీనాథ్, సాదు మాల్యాద్రి ప్రధానవక్తలు.
బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ,
తెలంగాణ
Updated Date - Sep 10 , 2024 | 12:18 AM