‘బస్ కా పయ్య’ ఆరాటం! స్వరాష్ట్రం కోసం పోరాటం!
ABN, Publish Date - Jun 14 , 2024 | 02:10 AM
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలంగా జరిగిన ఉద్యమంలో ప్రతి వర్గం తమదైన పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో...
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలంగా జరిగిన ఉద్యమంలో ప్రతి వర్గం తమదైన పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆర్టీసీ పోషించిన ముఖ్య భూమిక చిరస్మరణీయం. నాడు సంస్థ ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తి, అంకితభావం, కృషి, చిత్తశుద్ధి, త్యాగం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయి. ‘బస్ కా పయ్య నహీ చలేగా!’ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఉద్యమానికి ఊపిరిలూదడంతో పాటు ప్రధాన మైలురాయిగా నిలిచింది.
ప్రత్యేక రాష్ట్ర పోరాట మలిదశ 2000 దశకంలో ప్రారంభమైన రోజుల్లో, ఆర్టీసీ సిబ్బంది ఎవరికి వారు వ్యక్తిగతంగా పాల్గొన్నారు. 2010 సంవత్సరంలో, ములాఖత్ అనే వినూత్న కార్యక్రమంతో అప్పటి రాజకీయ నాయకులకు పువ్వులు అందించి తమ ఉద్యమ భావజాలాన్ని వ్యక్తపరచడంతో ఉద్యమం జీవం పోసుకుంది. ఇదే స్ఫూర్తితో ‘ఆర్టీసీ ఉద్యమ శంఖారావం’ అనే నినాదంతో ఉద్యోగులు కదనానికి సిద్ధమయ్యారు. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, మెకానిక్‌లు, ఆర్టిజాన్లు, సూపర్‌వైజర్లు, అధికారులు, మొదలైన ఆర్టీసీ ఉద్యోగులు డిపో, రీజియన్, రాష్ట్ర స్థాయిలో ఉద్యమ బృందాలుగా ఏర్పడి, మలిదశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు తమ డ్యూటీలను నిర్వహిస్తూనే ప్రజా రవాణాకు అంతరాయం కలుగకుండా 2011, 2012లలో వివిధ దశల్లో నిరసనల్ని చేపట్టారు. బస్సు డ్యూటీలకే ప్రాధాన్యతనిస్తూ తమ విరామ సమయంలో సమావేశాలు, చర్చలు నిర్వహించుకుని ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. 2011 మార్చి 10న నిర్వహించిన మిలీనియం మార్చ్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులంతా ఒక బృందంగా ఏర్పడి పెద్ద సంఖ్యలో పాల్గొని కదం తొక్కారు. సెప్టెంబరు 30, 2012లో జరిగిన సాగర హారంలో ఆర్టీసీ ఉద్యోగులు వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతకుముందు సన్నాహక సదస్సులు, ఇంటింటికి కరపత్రాల పంపిణీ, పోస్టర్ల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించారు.
2012 నవంబరు 1న జరిగిన తెలంగాణ విద్రోహ దినంలో ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి డిపోల ముందు విస్తృత ప్రదర్శనలు చేపట్టారు. నవంబరు 29న ఇందిరాపార్కు వద్ద జరిగిన దీక్షా దివస్‌లో వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. అసెంబ్లీ ముట్టడి, సద్భావన ర్యాలీ, కలం కవాతు, సకల జనుల భేరీ, రైల్ రోకో, ధూం ధాం మొదలైన కార్యక్రమాల్లోనూ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు. సంసద్ యాత్రలో పాల్గొని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతకుముందు బస్సు చైతన్య యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలలో నిర్వహించి డిపోలలోని ఉద్యోగులను సమాయత్తపరిచారు.
అంతకు ముందు, 2011 సెప్టెంబరు 13న సకల జనుల సమ్మె ప్రారంభమైనప్పటికీ, 19 సెప్టెంబరు 2011న ఆర్టీసీ ఉద్యోగులు ‘మేము సైతం!’ అంటూ ఉద్యమంలో పాలుపంచుకోవడంతోటే సమ్మె ప్రభావం జన జీవనంపై తీవ్రంగా పడింది. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద సమ్మెలలో ఒకటి. ఫలితంగా, తెలంగాణలో ఆనాడు ఉన్న 89 డిపోలలోని 10,137 బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఎవరి ఒత్తిడితోనో కాకుండా స్వయంగా తెలంగాణకు చెందిన 55,713 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొని అప్పటికే ప్రారంభమైన సకల జనుల సమ్మె సెగ తీవ్రతరం చేశారు.
తెలంగాణలో రోజూ తిరగాల్సిన 33.59లక్షల కిలోమీటర్లకు గానూ ఒక్క కిలోమీటర్ కూడా ఏ ఒక్క బస్సూ తిరగలేదు. నాడు, రోజుకు రూ.7.65కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. సకల జనుల సమ్మె ఆర్టీసీలో 28 రోజులు కొనసాగింది. ఈ కాలంలో సంస్థ మొత్తంగా, రూ.214.20కోట్లు నష్టపోయింది. ఉద్యమం వివిధ దశలలో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో బస్సులు, ఆస్తుల ధ్వంసం వల్ల మరో రూ.100 కోట్లు నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే బస్సులను తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా తిరగనివ్వలేదు. నాడు తెలంగాణలో ఉన్న 360 బస్టాండులు, 2000 బస్ షెల్టర్స్ బోసిపోయాయి. రాష్ట్రం మొత్తం స్తంభించింది. ఈ ఉద్యమం చరిత్ర మహత్తర ఘట్టాలలో ఒకటిగా నిలిచిపోయింది.
ఇతర శాఖలకు, ఆర్టీసీకి తేడాను గమనించినట్లయితే, పై మొత్తం సంస్థ శాశ్వతంగా కోల్పోయింది. ఆదాయాన్ని సమకూర్చుకునే రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ లాంటి ఇతర శాఖలు తదుపరి ఆ ఆదాయాన్ని రాబట్టుకోగల్గుతాయి. కానీ, ‘పెరిషబుల్ ప్రొడక్ట్’ ఉన్న ఆర్టీసీ, ఆ ఆదాయాన్ని శాశ్వతంగా కోల్పోయింది. అయితే, సకల జనుల సమ్మె విజయవంతం కావటంలో ఆర్టీసీ తనదైన చెరగని ముద్రను వేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బాట వేసింది.
ఆనాడే సంస్థ ఉద్యోగులు, రాబోయే తెలంగాణలో ఆర్టీసీ అస్తిత్వాన్ని గుర్తించి, ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఎ.పి.ఎస్. ఆర్టీసీ బస్సులపై, డిపో, బస్టాండు పేర్ల ముందు ‘టి.జి.ఎస్.ఆర్టీసీ’ అని రాయడంతో పాటు (జె.బి.ఎస్) జూబ్లీబస్‌స్టేషన్‌ను జయశంకర్ బస్ స్టేషన్‌గా మార్చి తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు. ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రత్యేకత ఏంటంటే, నిరసలు కొనసాగిస్తూనే ఏనాడు కూడా ఆర్టీసీ బస్సులకు, సంస్థ ఆస్తులకు నష్టం, విఘాతం కలిగించలేదు. అంతేకాకుండా అటువంటి చర్యలకు పాల్పడే వారిని సైతం నిలువరించారు.
ఆర్టీసీ ఉద్యోగుల ప్రత్యేకతను చరిత్రలో నిలిపిన వివిధ కార్యక్రమాలు రాష్ట్ర సాధనలో చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి; ఫలితమే – మన నవ తెలంగాణ!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గత పదేళ్ళుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజల ఆదరణ, రాష్ట్ర ప్రభుత్వ అండదండలు, మహాలక్ష్మి లాంటి ఎన్నో వినూత్న పథకాలు, ఉద్యోగుల నిబద్ధతలతో మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ నష్టాల ఊబినుంచి లాభాల విజయ బాట వైపు పయనిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, దేశంలో నేడు అగ్రగామి ప్రజా రవాణా సంస్థగా రూపొందటంలో అంతర్గత శక్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తియే!
వి.సి. సజ్జనర్, ఐ.పి.ఎస్.
మేనేజింగ్ డైరెక్టర్, టి.జి.ఎస్.ఆర్టీసీ
Updated Date - Jun 14 , 2024 | 02:10 AM