భాషల సాహిత్య వారధి భాస్కర్
ABN, Publish Date - Sep 15 , 2024 | 12:45 AM
తెలుగు సాహిత్యంలో తెలంగాణకు సంబంధించి చెప్పుకోదగ్గ సంఘటనలు మూడున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో కవులే లేరన్నందుకు ధిక్కారంగా సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచికను...
ధూర్జటిలోని ధిక్కారం పోతనలోని ఆత్మగౌరవం నలిమెల భాస్కర్‌ను సామాన్యమైన అధ్యాపకుడిగా ఉంచినా జనంలో అసామాన్యమైన వ్యక్తిగా నిలిపాయి. తెలంగాణ భాషమీద సాధికారికంగా వ్యాసాలు రాస్తూ భాస్కర్ తెచ్చిన తెలంగాణ పదకోశం అస్తిత్వ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులకు ఆయుధమైంది. కవులు రచయితలకు ఒక డిక్షన్ అయింది. భారతీయ సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగులోని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని, బిఎస్ రాములు పాలు కథని, శ్వేతరాత్రులు కథల్ని తమిళంలోకి అనువదించి ఇరుగుపొరుగు సాహిత్యానికి భాస్కర్ వారధి వేశాడు.
తెలుగు సాహిత్యంలో తెలంగాణకు సంబంధించి చెప్పుకోదగ్గ సంఘటనలు మూడున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో కవులే లేరన్నందుకు ధిక్కారంగా సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచికను తెచ్చాడు. తెలంగాణలో కథలే లేవన్నందుకు సవాల్‌గా సంగిశెట్టి శ్రీనివాస్ 1500 కథకులతో దస్త్రంను తెచ్చారు. తెలంగాణ భాషను భాషలా గౌరవించనందుకు నిరసనగా నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశాన్ని తెచ్చాడు. 1956 ఆత్మగౌరవానికి సంబంధించిన సంవత్సరం. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్ర తెలంగాణలు ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 2014 కూడా ఆత్మగౌరవానికి సంబంధించిన సంవత్సరమే. ఎన్నో పోరాటాల తర్వాత సొంత రాష్ట్రం ఏర్పడింది.
ఇదే 1956లో బుచ్చమ్మ రామచంద్రం దంపతులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జన్మించిన నలిమెల భాస్కర్ 2014లో ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకొని ఇప్పుడు 2024లో తెలంగాణ అస్తిత్వానికి పతాక అయిన కాళోజీ అవార్డు అందుకుంటున్నారు.
మానేరు నది పరివాహక ప్రాంతం ఉద్యమాలకు పెట్టింది పేరు. అటు జగిత్యాలలో ఇటు సిరిసిల్లలో గోదావరిఖని బొగ్గుగనుల్లో పురుడుపోసుకున్న పోరాటాలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. సిరిసిల్ల నిమ్మపల్లి రైతాంగ పోరాటాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ తరంలో ప్రతి మనిషిని ప్రభావితం చేసాయి. నారాయణపురం కొండాపురం ఆవునూర్ లాంటి నది ఒడ్డు ప్రాంతాల్లో ఆ ప్రభావం మరీ ఎక్కువ. అక్కడే పుట్టి పెరిగిన నలిమెల భాస్కర్ ధిక్కార స్వరంతో అధ్యయన శీలిగా ఎదిగాడు. కథ, కవిత్వం, గేయం లాంటి సాహిత్య ప్రక్రియల్లోనే కాకుండా భారతీయ భాషల మీద పట్టును సాధించాలనుకున్నాడు.
మొదట తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశాడు. తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. తర్వాత పద్నాలుగు భాషలపై పట్టును సాధించి ఆయా భాషలు సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు తెలుగు నుంచి ఆయా భాషలకు పరిచయం చేశాడు.
వ్యక్తిగతంగా భాస్కర్ చాలా నిజాయితీ నిబద్ధతగల మనిషి. ఆయన రాతలు ఎలా ఉంటాయో జీవితం కూడా అలాగే ఉంటుంది. 45 ఏళ్ల కిందనే సంప్రదాయాలను, పద్ధతులను తృనీకరించి నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కూతురైన కొడుకైన ఒక్కరే చాలు అనుకున్నాడు. తను నడిచిన దారిలోనే తన కూతురుకు కూడా ఆదర్శ వివాహం చేశాడు. ఒకవైపు ఇంటికి పెద్దకొడుకుగా ఎన్నో బాధ్యతలు మోస్తూనే సామాజిక స్పృహతో సాహిత్య సృజన చేసాడు. నిజానికి భాస్కర్ అద్భుత మేధోసంపత్తి గల మనిషి. కానీ ఎప్పుడూ అవార్డుల కోసం పరితపించలేదు. వాటి వెంట పడలేదు. నాటి అకాడమీ అవార్డు నుంచి నేటి కాళోజీ అవార్డుదాక ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అదీ ఆయన గొప్పతనం.
చిన్ననాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎంతో దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయన నిటారుగానే నిలబడ్డాడు. కొద్దిగా చూపును దించుకున్నా వెన్ను వంచుకున్నా పెన్ను వంచుకున్నా భజన సంఘంలో చేరినా ఆయన మేధోసంపత్తికి మెడనిండా అవార్డుల హారాలుండేవి. పేరుకు ముందు ఎన్నో బిరుదులు ఉండేవి. కానీ ధూర్జటిలోని ధిక్కారం పోతనలోని ఆత్మగౌరవం ఆయనను సామాన్యమైన అధ్యాపకుడిగానే ఉంచాయి. కానీ జనంలో అసామాన్యమైన వ్యక్తిగా నిలిపాయి.
భాస్కర్ ఒక బడిపంతులు కొడుకు. తాను కూడా చిన్న బడిపంతులుగానే జీవితం మొదలుపెట్టాడు. 1974 నుంచే సాహిత్యంతో అనుబంధం ఉంది. అప్పుడే అభ్యుదయభావాలతో మానవుడా గేయాన్ని రాశారు.
అది ఉద్యమాల కాలం. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రజలు, భూస్వాముల మధ్య అట్టుడుకుతున్న వాతావరణం. నారాయణపురం, దుమాల, అక్కపెల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపెల్లి, అల్మాస్‌పూర్, సిరిసిల్ల, కోనరావుపేట, నూకలమర్రి, మానాల అటవీ ప్రాంతాలు మానేరు బెల్టుగా ఏర్పడి రైతాంగ పోరాటాలు ఊపిరి పోసుకుంటున్న కాలం. దొరలూ భూస్వాములు పోలీసుల అండతో ప్రశ్నించే గొంతుకను రాత్రికి రాత్రే మాయం చేస్తున్న కాలం. ప్రజల్లో ఎన్నికల చైతన్యం ఇంకా రాని కాలం. అదిగో అప్పుడే నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే దొరల పెత్తనం మీద ఓ రాయి విసిరాడు. అదే మంద కథ. అప్పటికీ తెలంగాణ పల్లెల్లో గడీల పునాదులు ఇంకా గట్టిగానే ఉన్నాయి. ఆ కాలంలో వచ్చిన మంద కథ భాస్కర్‌ను మందలోని మనిషి కాడని మందను మలిపే వందలో ఒక మనిషని చెప్పింది. తర్వాత వచ్చిన అదిరింపులు బెదిరింపులకు ఆయన ఎక్కడా భయపడలేదు.
భాస్కర్ సాహిత్యం గురించి చెప్పాలంటే ముందుగా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి. భాస్కర్ అసాధ్యం అనుకున్న ప్రతిదాన్ని సుసాధ్యమే అంటాడు. చేసి చూపిస్తాడు కూడా. ఉపాధ్యాయుడిగా పెద్దపల్లి దగ్గర కొలనూరులో ఉన్నప్పుడు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఆయనను ఈ రోజు బహుభాషావేత్తగా ఈ స్థాయిలో నిలిపింది. 30 రోజులలో భాషను నేర్పే చిన్న గడ్డి పరక లాంటి ఒక పుస్తకంతో భాషల సముద్రాన్ని ఈదేశాడు. ఎంత పట్టుదల మనిషంటే 14 భాషలను నేర్చుకునే వరకు ఆ పనిని వదిలిపెట్టలేదు. ఆయా భాషల సాహిత్యాన్ని తెలుగులోకి తెలుగు సాహిత్యాన్ని ఆయా భాషల్లోకి అనువాదం చేశారు. పదకొండు కవిత్వం పుస్తకాలు అందులో ఏడు అనువాదాలు ఐదు అనువాద కథా సంపుటాలు ఏడు వ్యాస సంపుటాలు మూడు నవలలు రెండు బాల సాహిత్య పుస్తకాలు మొత్తం 32 పుస్తకాలను తెచ్చాడు. ఈ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. గౌట్స్, గ్లకోమా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చుకున్నారు. డాక్టర్ చదువకూడదూ చదివితే కళ్ళు ఉండవు అన్నాడు. కానీ ఈయన ఇప్పటికీ చదువుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఒక భాష తక్కువైందని భగవద్గీతను ముందేసుకుని సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. చిన్న పియానో ముందేసుకుని కీర్తనలను నేర్చుకున్నాడు. గురువు లేనిదే సంగీతం రాదని మనం అనుకుంటే ఎందుకు రాదని తను అనుకున్నాడు. ఏడాదిలోనే 16 రాగాలు 50 పాటలు వాయించడం నేర్చుకున్నాడు.
భాస్కర్‌ను కవిగాను రచయితగాను అనువాదకుడిగాను చివరికి భాషా శాస్త్రవేత్తగాను చెప్పినా పూర్తిగా చెప్పినట్టు కాదు. ఒక దాంట్లో ఒదగడమో ఒకదాంట్లోనే ఎదగడమో ఆయనకు నచ్చని పని. చిన్నతనంలోనే నారాయణపురం లైబ్రరీలో తెలుగు సాహిత్యాన్ని చదివాక స్వచ్ఛమైన తెలుగును వాడుక భాషలో మాట్లాడాడు. తర్వాత అది తన భాష కాదని తెలిసి తెలంగాణ భాష లోతుపాతుల్ని విడమర్చి చెప్పాడు. ద్రావిడ భాషలకు తెలుగు తెలంగాణ మధ్య సంబంధాల్ని శాస్త్రీయంగా చెప్పి నేర్పించాడు. ఈ రచనలన్నీ ఒకెత్తయితే అంగాలను కప్పేది అంగి, లాగి తొడిగేది లాగు, గుండ్రంగా ఉండేది గుండి, తన్నుకుంటూ ఎక్కేది తంతే అంటూ తెలంగాణ భాషమీద సాధికారికంగా వ్యాసాలు రాస్తూ భాస్కర్ తెచ్చిన తెలంగాణ పదకోశం అస్తిత్వ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులకు ఆయుధమైంది. కవులు రచయితలకు ఒక డిక్షన్ అయింది. ఈ ఒక్క మహత్కార్యం చాలు భాస్కర్‌ను పది కాలాలపాటు మనిషిగా నిలబెట్టడానికి.
కవిగా రచయితగా గాయకుడిగా సంగీత సాధకుడిగా అనువాదకుడిగా భాషా శాస్త్రవేత్తగా వ్యాసకర్తగా అధ్యాప కునిగా అన్నింటికీ మించి మంచి మనిషిగా గురువుగా స్నేహితునిగా నిక్కచ్చిగా వ్యవహరించే భాస్కర్ సహచరి సావిత్రక్క గురించి చెప్పకుంటే భాస్కర్‌లోని ఒక పార్శ్వం గురించి చెప్పనట్టే లెక్క. ఇప్పటికీ ఆమెకు భాస్కర్ చిన్న పిల్లవాడే. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఎక్కడో ఉన్న ఆఫ్రికన్ కవులు ఇంగ్లీష్ రచయితలు తెలిసినంతగా మనకు మన పక్కనున్న ఇతర రాష్ట్రాలకు చెందిన రచయితలు తెలియదు. ఆ లోటును పూడ్చడానికి భాస్కర్ భారతీయ సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగులోని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని, బిఎస్ రాములు పాలు కథని, శ్వేతరాత్రులు కథల్ని తమిళంలోకి అనువదించి ఇరుగుపొరుగు సాహిత్యానికి వారధి వేశాడు.
ఈ భాషలు కథలు కవిత్వం ఇవన్నీ పక్కన పెడితే మనిషి మాయమైపోతున్నాడని మనందరం ఆందోళన చెందుతున్న ఈ కాలంలో మనుషుల్ని ప్రేమించి బాధలకు కరిగిపోయి తనవి కాని బాధ్యతలు నెత్తినెత్తుకొని పేరుకో కీర్తికో అవార్డుకో పదవులకో ఆశించని నికార్సైన మనిషి ఇదిగో మన మధ్యనే నిరాడంబరంగా ఉన్నాడు.
పెద్దింటి అశోక్ కుమార్
Updated Date - Sep 15 , 2024 | 12:45 AM