ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వికృతచర్యతో విద్యావ్యవస్థకు పాతర

ABN, Publish Date - Apr 05 , 2024 | 02:55 AM

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోంది. విద్యారంగం అభివృద్ధి చెందితేనే సామాజిక చైతన్యం వికసిస్తుంది, విలువలు పరిరక్షించబడతాయి...

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోంది. విద్యారంగం అభివృద్ధి చెందితేనే సామాజిక చైతన్యం వికసిస్తుంది, విలువలు పరిరక్షించబడతాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. పాఠశాలల విలీనం, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల రద్దు, మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తం, బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అలసత్వం, మౌలికసౌకర్యాల గురించి పట్టించుకోకపోవడం వంటివి విద్యారంగానికి శాపంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదపిల్లలు ఉన్నత చదువులకు వెళ్లేలా చేశాం, ప్రభుత్వబడుల్లో ఆణిముత్యాల్ని తీర్చిదిద్దే విద్యావిధానాన్ని తీసుకొచ్చాం అని చాటుకుంటూనే ఈ ప్రభుత్వం బడులకు తాళాలు వేసి పేదపిల్లల చదువులను చట్టుబండలు చేసింది.

గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించే ట్యాబుల్లో పాలకులు 25,379 ట్యాబులను కోతపెట్టారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్‌ ధర రూ.11,200లు మాత్రమే ఉంటే, రూ.15,500లకు కొన్నట్టు లెక్కలు చూపించి గడచిన రెండేళ్లలో రూ.470 కోట్లు కమీషన్లు కొట్టేశారు. నాడు–నేడు పేరుతో, ప్రభుత్వ పాఠశాలలకు రంగులేసే నెపంతో, ఇతర పనులు చేసినట్టు చెప్పి రూ.3వేల కోట్లు దోచుకున్నారు. పాఠశాల ప్రాంగణాల్లో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు ఏర్పాటుచేసి 2,45,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే, జగన్‌ సర్కార్ ఏకంగా ఆ పథకాన్నే రద్దు చేయడం తెలివిమాలిన చర్య.

దీనికి తోడు టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, బట్టల కొరత, తాగునీటి కొరత.. ఇలా అన్నిరకాల కొరతలతో విద్యావ్యవస్థను అధఃపాతాళానికి నెట్టేసింది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,73,416 మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేశారు. పెత్తందారీ విధానం రూపుమాపడం అంటే పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు మూసి వేయడమా? ప్రైవేటుబడులతో పోటీపడటం అంటే ప్రాథమిక పాఠశాలలకు తాళాలు వేయడమా? పేదవిద్యార్థులను ప్రాథమిక విద్యకు దూరం చేయడమే వారిని అభ్యున్నతివైపు నడిపించడమా? దాదాపు 9 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క టీచర్‌ మాత్రమే ఉన్నారు.

ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమహాస్టళ్ళు మనరాష్ట్రంలో ఉన్నా వాటిలోని వసతులు పరమ అధ్వానంగా ఉండడంతో విద్యార్థుల శాతం తగ్గిపోతోంది. ప్రభుత్వం ఇచ్చే ఛార్జీలు సరిపోక హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తుంటే ఎన్నికలు వస్తున్నాయని ఆగమేఘాల మీద ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియను ప్రకటించి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లుగా ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం విద్యారంగంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిపోయింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పదోతరగతి ఫలితాల్లో కేవలం 64.02 శాతం ఉత్తీర్ణత సాధించడం సిగ్గుచేటైన విషయం. చంద్రబాబు తన హయాంలో ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక మాధ్యమిక పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయగా ప్రస్తుత సర్కార్ నూతన విద్యావిధానం పేరిట 11వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, 3, 4, 5 తరగతుల విలీనంతో ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండే బడుల సంఖ్య భారీగా పెరిగిందని స్వయంగా కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లోనే సమాధానమిచ్చింది. ఆంగ్లంతో పోలిస్తే మాతృభాష తెలుగును చదవడంలో ఏపీ విద్యార్థులు వెనుకబడిపోయారని ప్రముఖ అధ్యయన సంస్థ యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌(అసర్‌) విడుదల చేసిన వార్షిక విద్యాస్థితి నివేదిక–2022లో ఈ విషయాన్ని వెల్లడించింది.

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కోర్సులు పూర్తిచేసిన దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఉన్నతవిద్య చదివే అవకాశం కోల్పోయి, ఉద్యోగావకాశాలు కోల్పోయి వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరమైపోయింది. ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన నిలిపివేస్తూ జీవోను విడుదల చేశారు. 1.7 లక్షల మంది పీజీ విద్యార్ధుల్లో 80 శాతం మందికి ఈ రెండు దీవెనలు రద్దుచేయడం ద్వారా రూ.600 కోట్లు ఆదా చేసుకున్నారు. ఆ చర్యతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదవిద్యార్థుల ఉన్నత చదువుల కలను చెరిపివేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి వికృతచర్యలతో విద్యారంగం ఉనికినే కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఏ దేశ విద్యారంగం ప్రగతిపథంలో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్న పాలనకు ప్రజలు ఇప్పటికైనా ముగింపు పలకాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు అండగా నిలబడడంతో పాటు విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తుంది.

కంచర్ల శ్రీకాంత్

శాసనమండలి సభ్యులు

Updated Date - Apr 05 , 2024 | 02:55 AM

Advertising
Advertising