జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు రూ.9,200 కోట్లేనా?
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:42 AM
ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వంలో జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు 9200 కోట్లు మాత్రమే కేటాయించడం వారికి తీరని అన్యాయం తలపెట్టడమే. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ...
ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వంలో జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు 9200 కోట్లు మాత్రమే కేటాయించడం వారికి తీరని అన్యాయం తలపెట్టడమే. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకే వాగ్దానాలను చేసినట్టు తేలిపోయింది. 17 శాతం ఉన్న ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, ఏడు శాతం ఉన్న ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఐదు శాతం ఉన్న మైనార్టీ సంక్షేమానికి రూ.3,003 కోట్లు... ఈ బడ్జెట్ కేటాయింపులు అసమగ్రం అయినా, వీరికి ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.
అన్ని రకాల రంగాలకు బడ్జెట్ రూపకల్పన నెల రోజుల నుండి జరుగుతుంది. ఈ ప్రజాప్రతినిధులు అప్పటి నుండి ఏమి చేస్తున్నారు? రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు సరిపడా కేటాయింపులను చేయించుకోలేని, బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆధిపత్య కుల స్వభావం ఎలా వుండిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తమ సామాజిక వర్గానికి రూ.33,124 కోట్లు కేటాయింపులను చేయించడంలో సక్సెస్ అయ్యారు (ఇది సమగ్రమైన పంపిణీ కాదు, ఇక్కడ ఏ సామాజిక వర్గానికి బీసీ సమాజం వ్యతిరేకం కాదు.) కానీ, బీసీలకు నాయకత్వం వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి అన్యాయం చేశారు. పదవుల కోసం ఉద్యమాలు చేసి, అతితెలివి తేటలను ప్రదర్శించడంలో అగ్రకులాలను మించిపోయిన వీరు, తమ సమాజాన్నే మోసం చేస్తున్నారు. బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగినందున ఆ కేటాయింపులకు నైతికంగా బాధ్యత వహించి బీసీ ప్రజాప్రతినిధులు అందరు మూకుమ్మడిగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. లేదా బడ్జెట్ కేటాయింపులలో సవరణలు చేయించి, ఆ కేటాయింపులను పెంచేలా చేసి వారివారి నియోజకవర్గాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నాం.
పాపని నాగరాజు
అధ్యక్షులు, కుల నిర్మూలన వేదిక (కెఎన్‌వి)
Updated Date - Jul 31 , 2024 | 01:43 AM