యూకో బ్యాంక్ లాభంలో 147% వృద్ధి
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:27 AM
ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం (క్యూ1)లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను నికర లాభం ఏకంగా 147 శాతం వృద్ధి చెంది రూ.551 కోట్లుగా...
క్యూ1 లాభం రూ.551 కోట్లు
కోల్‌కతా : ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం (క్యూ1)లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను నికర లాభం ఏకంగా 147 శాతం వృద్ధి చెంది రూ.551 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.223 కోట్లుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం 11.46 శాతం వృద్ధితో రూ.4,61,408 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో స్థూల అడ్వాన్సులు 7.39 శాతం పెరిగి రూ.2,68,155 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం డిపాజిట్లు కూడా 7.39 శాతం వృద్ధితో రూ.2,68,155 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 12.20 శాతం వృద్ధితో రూ.2,254 కోట్లుగా నమోదైంది.
కాగా సమీక్షా కాలంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 4.48 శాతం నుంచి 3.32 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.18 శాతం నుంచి 0.78 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఈ కాలంలో బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 17.09 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,230 శాఖలు, హాంకాంగ్, సింగపూర్‌లలో ఒక్కో శాఖను, ఇరాన్‌లో రిప్రజెంటేటివ్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు యూకో బ్యాంక్ వెల్లడించింది.
Updated Date - Jul 23 , 2024 | 05:27 AM