YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:25 AM
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)ని అడ్డుపెట్టుకుని గౌతం అదానీతో ముఖ్యమంత్రి హోదాలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైఎస్ జగన్మోహనరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.
స్వప్రయోజనాల కోసమే అదానీతో డీల్
విద్యుత్ ఒప్పందంతో ప్రజలపై లక్షన్నర కోట్ల భారం
జగన్‌పై ఏసీబీకి పీసీసీ చీఫ్ ఫిర్యాదు
కూటమిని నమ్మి రాత్రి దాకా క్యూలో ఉండి ఓట్లేశారు
ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు నిలబెట్టాలి
పంజరంలో చిలక ఏసీబీని విడుదల చేయాలి: షర్మిల
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)ని అడ్డుపెట్టుకుని గౌతం అదానీతో ముఖ్యమంత్రి హోదాలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైఎస్ జగన్మోహనరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. గురువారం విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్(ఆంధ్ర) రజనీని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏసీబీని పంజరంలో చిలుకలా బందీని చేశారని ఆరోపిస్తూ పంజరంలో చిలుకను పట్టుకుని మీడియాతో మాట్లాడారు. అదానీపై చర్యలెందుకు తీసుకోవడంలేదని చంద్రబాబును ప్రశ్నించారు. అదానీ బీజేపీ మనిషి అని, మోదీతో కూటమికి అనుబంధం ఉందని, అందుకే అదానీకి, మోదీకి భయపడుతున్నారని, అదానీని కాపాడుతున్నారని ఆరోపించారు. అమెరికా దర్యాప్తు సంస్థ చెబితేగాని అదానీ అవినీతి, జగన్ ముడుపుల వ్యవహారం బయటకు రాలేదన్నారు. ‘ఈ అవినీతిని బయట పెట్టడం సీబీఐకి చేతకాదా? మోదీ చేతకానివాడా’ అని నిలదీశారు. సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్‌పైన, ఒప్పందాలపైన దర్యాప్తు చేయాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఏసీబీని బందీని చేశారని ఆరోపించారు.
‘టీడీపీ పంజరంలో ఏసీబీ బందీ అయింది. ఆ పంజరం నుంచి వెంటనే విడుదల చేయాలి. ఏసీబీ జగన్ లంచాల వ్యవహారాన్ని బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల భారాన్ని పెట్టారని, అదానీ డీల్‌తో మరో లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలను చంద్రబాబు పక్కన పెట్టాలన్నారు. జగన్ తన సొంత ప్రయోజనాల కోసం డీల్ చేసుకున్నారని విమర్శించారు. జగన్‌కూ చంద్రబాబుకూ తేడా లేదన్నారు. ప్రజలు కూటమిని నమ్మి రాత్రి 9 గంటల దాకా క్యూలో నిలుచుని ఓటు వేశారని ఆమె గుర్తు చేశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలని చంద్రబాబును కోరారు.
Updated Date - Dec 06 , 2024 | 04:25 AM