తాడేపల్లిగూడెంలో వైసీపీ ఎదురీత
ABN, Publish Date - May 11 , 2024 | 12:28 AM
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. విజయం సాధించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, తిరిగి తమ స్ధానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన కూటమి అభ్యర్థి
అధికార పార్టీకి అవినీతి మచ్చ
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. విజయం సాధించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, తిరిగి తమ స్ధానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తులు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకతతో వైసీపీ ఎదురీదుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో విజయం దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ప్రజలతో కలసిపోయి సానుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు మంత్రి, వైసీపీ అభ్యర్థిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు సైతం మంత్రిని నిలదీయడం నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితితో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతుంది.
భీమవరం–ఆంధ్రజ్యోతి
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో నిలిచారు. వైసీపీ తరుపున మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. రెండు వర్గాలలో గెలుపు ధీమా కనిపిస్తోంది. తమదే పైచేయి అని భావిస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత జనసేన కూటమికి కలసివస్తోంది. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వైసీపీ కుయుక్తులు పన్నింది. అదే పేరుతో నవయుగ కాంగ్రెస్ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపారు. ఇవేమి తమ విజయాన్ని అడ్డుకోలేవని జనసేన కూటమి విశ్వసిస్తోంది.
వైసీపీలో అసంతృప్తి సెగ
వైసీపీకి అసంతృప్తి సెగ గట్టిగానే తగిలింది. పార్టీ నుంచి ముఖ్య నాయకులు వైదొలిగారు. మంత్రి కొట్టు సత్యనారాయణకు కుడి ఎడమలుగా ఉండే నాయకులు కూడా దూరమయ్యారు. సీనియర్ నేతలు, కీలక నేతలు వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమైన నాయకులు దూరం కావడంతో వైసీపీ ఈ ఎన్నికల్లో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైసీపీలో చేరారు. కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కానీ నాని వర్గంగా ముద్రపడిన నాయకులు టీడీపీలో కొనసాగుతున్నారు. వారు జనసేనకు మద్దతుగా నిలిచారు.
అభివృద్ధి శూన్యం.. అవినీతి ఘనం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఐదేళ్లలో అభివృద్దికి నోచుకోలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. పట్టణానికి ప్రధానమైన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముందుకు సాగలేదు. మరోవైపు అవినీతి పెరిగిపోయింది. అధికార పార్టీ నేత దందాకు అంతులేకుండా పోయింది. భవనాల నిర్మాణాలు చేపడితే కమీషన్‌లు, లేఅవుట్‌లు వేస్తే కాసులు ఇలా కోట్లాది రూపాయి దండుకున్నారు. వైసీపీ అభ్యర్ధికి వ్యతిరేకత ఉన్న నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలచింది. ఇదే ఇప్పుడు అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. గత ఎన్నికల్లో ఉన్న సందడి ఈసారి వైసీపీ శిబిరంలో కనిపించడం లేదు. అన్ని వర్గాలల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ అంశం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి కలసివస్తోంది.
జనసేన కూటమిలో ఐక్యత
జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌కు టికెట్టు కేటాయించినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. జనసేన గెలుపు ను భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును సీఎం చెయ్యాలి, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఓడించాలని ద్రుఢ సంకల్పంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా టీడీపీకి ప్రాతినిధ్యం లేదన్న బాధను పక్కన పెట్టి పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి జనసేనకు పూర్తి సహకారం అందిస్తున్నారు. పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. ఇది జనసేనకు పూర్తిగా కలసి వస్తోంది. నియోజకవర్గంలో జనసేన కూటమిదే పై చేయిగా కనిపిస్తోంది.
మునిసిపల్ చైర్మన్‌గా బొలిశెట్టి ప్రస్థానం
కూటమి తరుపున పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం హయాంలో మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. పట్టణంలో అభివృద్ధి పనులు చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓటమి చవి చూశారు. ఇప్పుడు కూటమి తరపున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి, జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనితో కూటమి సునాయాసంగా విజయం సొంతం కానుంది.
గాలి ఉంటేనే కొట్టు గెలుపు
మంత్రి కొట్టు సత్యనారాయణ 1994 నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. రెండు సార్లు గెలుపుసాధించారు. పార్టీ గాలి ఉన్నప్పుడే ఆయన గెలుపు సాధ్యమవుతోంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జగన్ గాలిలో విజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జగన్, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఎదురుగాలి వీస్తోంది. కూటమి పవనాలు బలంగా వీస్తున్నాయి. కొట్టు సత్యనారాయణ ఎన్నికల్లో ఓడిపోతారనే అంచనాలున్నాయి. దీనితో బెట్టింగ్ రాయుళ్లకు నియోజకవర్గంలో పందేలు దొరకడం లేదు. తాయిలాల పంపిణీపై వైసీపీ ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.
Updated Date - May 11 , 2024 | 12:28 AM