సీడ్.. సిరులు
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:12 AM
దేశంలోని వివిధ రాష్ట్రాలకు కైకలూరు నుంచి ఏటా చేప పిల్లల రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. వివిధ సైజులను బట్టి రైతు వద్ద కొనుగోలు చేస్తుంటారు. నీటి కొరత ఉన్నప్పటికీ ఇటీ వల కురిసిన వర్షాలకు వ్యాపారం ఊపందుకుంది.
కైకలూరులో 50 వేల మందికి ఉపాధి
ఏటా ఎనిమిది లక్షల టన్నుల సీడ్ ఉత్పత్తి
ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం
కైకలూరు, ఆగస్టు 20 : దేశంలోని వివిధ రాష్ట్రాలకు కైకలూరు నుంచి ఏటా చేప పిల్లల రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. వివిధ సైజులను బట్టి రైతు వద్ద కొనుగోలు చేస్తుంటారు. నీటి కొరత ఉన్నప్పటికీ ఇటీ వల కురిసిన వర్షాలకు వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి కృష్టా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏటా 15 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రవ్యా ప్తంగా 5.50 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.30 వేల కోట్ల ఆదా యం సమకూరుతోంది. చేప పిల్లలను రిజర్వాయర్లు, ఇరిగేషన్ చెరువుల్లో విడిచి పెట్టేందుకు నేషనల్ ఫిష రీస్ డెవలెప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డిబి) రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన(ఆర్‌కేవీవై) సీడ్ ఉత్ప త్తులకు పలు రాయితీలను కల్పిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం లో ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో ఆంధ్రా లోని డ్యామ్‌లలో చేప పిల్లలు వదిలిన దాఖలాలు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు మత్స్య ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించడంతో వందల కోట్లు ఏటా కేటాయించి ఆయా రాష్ట్రాల్లో చేప ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఒక్క తెలం గాణకే ఏటా సుమారు 70 కోట్లపైన చేప పిల్లలు ఆంధ్ర నుంచి రవాణా జరుగుతోంది. ఇందులో అత్యధి కంగా కైకలూరు కొల్లేరు ప్రాంతం నుంచే చేపపిల్లల రవాణా చేయడంలో మొదటి స్థానంలో ఉంది.
సీడ్ ఉత్పత్తిలోనూ అగ్రగామి
కొల్లేరులో చేపలు సాగు చేసే విధానంలో రైతులు పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు అపారమైన అను భవాన్ని చూపుతూ ఉంటాయి. నాణ్యమైన సీడ్ ఉత్ప త్తిని ఎంపిక చేసుకుంటారు. కట్ల(బొచ్చె), రోహు (శీలా వతి), మిరాగల్ (మోసు), గ్రాస్‌కార్ప్ (గడ్డి చేప), బంగారు తీగ, ఇతర రాష్ట్రాలకు భారీ ఎత్తున ఎగుమతులవుతుంటాయి. చేప పిల్లలను విక్రయాల్లో ప్రస్తుతం రెండు నుండు మూడు అంగుళాలు సైజు వున్న చేప పిల్లలకు డిమాండ్ ఎక్కువ. అంగుళం సైజు గడ్డి చేప అర్ధ రూపాయి, శీలావతి 30 పైసలు, కట్ల అర్ధ రూపాయి, బంగారుతీగ 60 పైసలు, మోసు 30 పైసలు ధర పలుకుతున్నాయి. వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చేపపిల్లల సంతానోత్పత్తికి అనుకూలం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో డ్యామ్‌లు నీటితో కళకళలాడడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. చేప పిల్లల పట్టుబడులకు ఆడ, మగ పనులకు వెళుతుంటారు. ‘ప్రభుత్వం ఏటా కాలు వల ద్వారా నీటినందిస్తే సీడ్ ఉత్పత్తులను ఎక్కువగా పెంచే అవకాశం కలుగుతుంది’ అని సీడ్ వ్యాపారి బి.దుర్గారావు చెబుతున్నారు. తీపి నీటితో పిల్ల ఆరోగ్య వంతంగా పెరిగి వ్యాధులను తట్టుకుంటుందన్నారు. కైకలూరు మండల వ్యవసాయాధికారిణి ఎం.భవిత మాట్లాడుతూ ‘రైతులు మంచి హేచరీలను గుర్తించి నాణ్యత కల్గిన చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలి. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో సీడ్ రవాణా అధికం. రైతులు సాగులో మెలకవులు పాటిస్తే చేప పిల్ల ఆరోగ్యవంతంగా పెరుగుతుంది’ అని అన్నారు.
ఇతర రాష్ట్రాలకు రవాణా
కైకలూరు ప్రాంతం నుంచి ఏటా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు వ్యాన్‌ల ద్వారా సీడ్‌ను రవాణా చేస్తుంటారు. ఒక వ్యానులో 10 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేస్తా రు. ఒక్కొక్క డ్రమ్ముకు 40–50 వేలు ఆయా సైజుల ను బట్టీ చేప పిల్లలను తీసుకువెళతారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఎనిమిది వేల ఎకరాల్లో సీడ్ పెంచుతారు. 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సీడ్ పిల్లల పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. చేప పిల్లల పట్టుబడి నుంచి రవాణా అయ్యే వరకు కూలీలు పనులు చేస్తుంటారు.
వేధిస్తున్న నీటి కొరత
ఏటా జూన్‌లో కాలువల ద్వారా నీటి సరఫరా జరగకపోవడంతో స్థానికంగా వున్న చెరువుల్లో నీరు చిక్కబడి సీడ్ ఉత్పత్తి దెబ్బతింటున్నది. హేచరీల నుంచి కొనుగోలు చేసిన సీడ్‌ను చెరువుల్లో వేసే సమయంలో తీపి నీరుంటేనే వేసిన చేపపిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. చిక్కబడిన నీటి వల్ల వ్యాధుల బారిన పడడమే గాక చనిపోతాయి. ప్రభుత్వం చేపల సీడ్ ఉత్పత్తులు పెంచేందుకు తీపి నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 01:12 AM