అర్ధరాత్రి అవస్థలు
ABN, Publish Date - May 17 , 2024 | 12:48 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియలో జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
జిల్లాలో పోలింగ్ జాప్యం..
పోలింగ్ సిబ్బందికి తప్పని ఇబ్బందులు
పలుచోట్ల భోజనాల కోసం ఎదురుచూపులు
ఏలూరు సిటీ, మే 16 : సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియలో జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించడానికి చాలా ఆలస్యమైంది. అక్కడ పోలింగ్ సామగ్రిని అప్పగించి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడానికి మంగళవారం తెల్లవారుఝాము వరకు సమయం పట్టిందని సిబ్బంది చెబుతు న్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో సిబ్బందికి భోజన సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. స్ట్రాంగ్‌రూమ్ , రిసెప్షన్ సెంటర్ వద్ద మాత్రం భోజనాలు ఏర్పాటు చేసినా అర్ధరాత్రి దాటిన తర్వాత సిబ్బంది అక్కడ భోజనాలు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈసారి ఎన్నికలలో అధికారులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసినా కొన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసినా వారికి భోజనాలు ఏర్పాటు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అక్కడ అధికారులు ముందస్తుగా భోజన ఏర్పాట్లు చేసి ఉంటే తమకు ఇబ్బందులు తప్పేవని పలువురు సిబ్బంది పేర్కొన్నారు. ఒక గ్రామంలో ఆరు బూత్‌లు ఉంటే అక్కడ ఐదు బూత్‌లకు సంబంధించి 7గంటలకే పోలింగ్ పూర్తయినా మిగిలిన ఆ ఒక్క బూత్ పోలింగ్ పూర్తయ్యే వరకు మిగిలిన సిబ్బంది అక్కడ ఉండాల్సిందే. దీంతో ముందుగా పోలింగ్ ప్రక్రియ బూత్‌ల వారు మిగిలిన బూత్‌లో పోలింగ్ పూర్తయ్యే వరకు అక్కడ వేచిఉండాల్సి రావడంతో తీవ్ర అసౌక ర్యానికి గురయ్యారు. జిల్లాలోని దెందులూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి తదితర నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9గంటల నుంచి రాత్రి 11గంటల తర్వాత వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. అక్కడ సిబ్బంది పోలింగ్ సామగ్రిని తరలించడం చాలా ఆలస్యమైంది. గతంలో జరిగిన ఎన్నికలలో సాధారణంగా పోలింగ్ ప్రక్రియ 7గంటలకే పూర్తయ్యేది. అయితే ఓటర్లలో చైతవ్యం రావడం, ప్రవాస ఓటర్లు ఓటు వేయడానికి రావటంతో పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పోటెత్తారు.. అదీగాక ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రక్రియలో సాయంత్రం సమయంలోనే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రానికి రావడం, చాలా మంది ఓటర్లు పోలింగ్ ముగిసే సమయంలో రావడంతో క్యూలైన్లులో ఉన్నవారందరికీ ఓటు హక్కు కల్పించాల్సి ఉండడంతో పోలింగ్ ఆలస్యమైందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు వద్ద ఓటింగ్‌కు ఈసారి ఎక్కువగానే సమయం పట్టిందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రారం భించిన సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొంత ఆలస్యం అయింది. రాత్రి 9గంటలకు పోలింగ్ పూర్తయినా రవాణా వాహనాలు వచ్చి పోలింగ్ సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టింది. పోలింగ్ ప్రక్రియ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు జరిగితే వారు పోలింగ్ సామగ్రిని తీసుకుని స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లటానికి తెల్లవారుఝాము అయిందని కూడా చెబుతున్నారు. జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో పరిశీలిస్తే రేచర్ల , ప్రగడవరం, మల్లాయి గూడెం, రంగాపురం, భోగోలు, మఠంగూడెం, జలపాలవారి గూడెం ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ బూత్‌లలో పోలింగ్ సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించడానికి అర్ధరాత్రి దాటిందని చెబుతున్నారు. ఇలా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పోలింగ్ ఆలస్యం కావడం వల్ల పోలింగ్ సిబ్బంది తీవ్ర అలసటకు గురయ్యారు. పోలింగ్ సామగ్రిని తీసుకునే రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బది కోసం అధికారులు ఏర్పాటు చేసినా అర్ధరాత్రి సమయం దాటడంతో కొంత మంది భోజనాలు చేయలేకపోయారు. వారికి పోలింగ్ కేంద్రాల వద్దే భోజన సౌకర్యం కల్పిస్తే బాగుండేదని కొంతమంది సిబ్బంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Updated Date - May 17 , 2024 | 12:48 AM