డైయేరియా..
ABN, Publish Date - May 17 , 2024 | 12:43 AM
మండుతున్న ఎండలు... దాహర్తి తీర్చుకునేందుకు గ్రామాల్లో చేతిపంపులు లేవు... గ్రామానికి దూరంగా ఉన్న వాగులో ఒక గుంతలో ఈగలు, పురుగులు వాలి కలుషితమైన నీరే ఆదివాసీలకు తాగునీరు. ఆ నీటిని తాగుతున్న వాళ్లకు కడుపునొప్పి ప్రారంభమై వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురవుతున్నారు.
కుక్కునూరు మండలంలో విజృంభణ
రెండు గ్రామాల్లో పదమూడు మందికి అస్వస్థత
రెండు రోజుల్లో ఒకే గ్రామంలో ఇద్దరి మృతి
బాధిత గ్రామాల్లో ఐటీడీఏ పీవో పర్యటన..
ఆస్పత్రులకు బాధితుల తరలింపు
గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
మురుగు నీరే తాగునీరు..
దయనీయంగా మారిన ఆదివాసీల జీవితాలు
కుక్కునూరు, మే 16 : మండుతున్న ఎండలు... దాహర్తి తీర్చుకునేందుకు గ్రామాల్లో చేతిపంపులు లేవు... గ్రామానికి దూరంగా ఉన్న వాగులో ఒక గుంతలో ఈగలు, పురుగులు వాలి కలుషితమైన నీరే ఆదివాసీలకు తాగునీరు. ఆ నీటిని తాగుతున్న వాళ్లకు కడుపునొప్పి ప్రారంభమై వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురవుతున్నారు. మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో డయేరియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం కురుములతోగులో డయేరియా బయట పడగా గురువారం సమీపం మరో గ్రామం కొసాయిగుంపు లోను డయేరియా కేసులు వెలుగుచూశాయి. కురుములతోగు గ్రామంలో 10 మంది, కొసాయిగుంపులో ముగ్గురు డయేరియా బారినపడ్డారు. బుఽధవారం కురుములతోగుకు చెందిన మడకం బుజ్జమ్మ (65) మృతి చెందగా రాత్రి పొద్దుపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన మడకం దేవరాజు (8) భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆ గ్రామానికి చెందిన ఊకే భీమమ్మ, మడకం రాము, మడకం జ్యోతి, ఊకే దూలయ్య, ఊకే రాము, ఆరునెలల మడకం సంజన, పుణేం గంగమ్మతో పాటు మరికొందరిని అమర వరం, భద్రాచలం ఏరియా ఆస్పత్రులను తరలించారు. పూనెం సోని, మొడియం ఇరమమ్మ, కొంతమంది కోలు కున్నారు. వారికి గ్రామంలోనే వైద్యం అందిస్తున్నారు. కొసాయిగుంపుకు చెందిన సోడే గంగమ్మ, మడివి ఇరిమి, చోడే మనీషాలను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
ఐటీడీఏ పీవో పర్యటన
బాధిత ఆది వాసీ గ్రామాల్లో కేఆర్ పురం ఐటీడీఏ పీవో సూర్యతేజ గురు వారం పర్యటిం చారు. గ్రామాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఆదివాసీలు తమ వేదనను వినిపించారు. దీనికి పీవో స్పందిస్తూ వారిని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో చేతి బోర్లు వేస్తామన్నారు. అప్పటి వరకు మినరల్ వాటర్ అందిస్తామని, ప్రభుత్వం తరపున మూడు రోజుల పాటు ఆహారం అందిస్తామన్నారు. గ్రామాల్లోనే ఉండి వారికి పూర్తిగా తగ్గే వరకు మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్యాఽధికారి, మలేరియా అధికారి, స్థానిక అధికారులు గ్రామంలో పర్యటించారు.
జూ కన్నతల్లి ఆస్పత్రిలో.. మరో తల్లి ఒడిలో చిన్నారి
కురుములతోగుకు చెందిన మండకం జ్యోతి అనారోగ్యంతో ఉండడంతో ఆమెను భద్రాచలం తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె రెండు నెలల చిన్నారిని ఇంటి వద్దే వదిలేసింది. ఇంటి పక్కనే ఉన్న మడకం సోమమ్మ ఆ చిన్నారికి తన పాలు ఇస్తూ తల్లిలా మారి కాపాడుతోంది. దయనీయమైన పరిస్థితి ఏమిటంటే సోమమ్మ ఆరునెలల కూతురు మడకం సంజన కూడా విరోచనాలతో బాధ పడుతోంది. ఒక పక్క కన్నకూతురిని చూసుకుంటూ మరో పక్క ఇంకో చిన్నారికి మాతృత్వాన్ని పంచుతోంది.
మృతదేహం ఇచ్చేందుకు రూ.7వేలు అడిగారు..
మా జీవితాల దయనీయంగా మారాయి. బుధవారం రాత్రి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మడకం దేవరాజు చనిపోతే మృతదేహం కోసం వెళ్లాం. రూ.7వేలు ఇస్తేనే శవం ఇస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. చివరికి మా పరిస్థితి చెప్పి రూ.2వేలు చెల్లించి శవాన్ని తీసుకొచ్చాం. గ్రామంలో 150 మంది ఉన్నాం. గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నాం. మమ్మల్ని పట్టించుకునేవారే లేరు.
– మడకం మల్లేష్, కురుములతోగు
మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.
గ్రామంలో 70 మంది వరకు ఉన్నాం. మురుగు నీరే మాకు తాగునీరు. స్నానం చేయాలంటే రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి వాగులో చలమ తీసుకుని ఆ నీటితోనే స్నానం చేయాలి. గుక్కెడు నీరు దొరక్క పసిపిల్లలు ఏడుస్తుంటే చేసేది లేక ఆ మురుగునీరే పడుతున్నాం. ఆధార్, రేషన్, ఓటు కార్డు ఉన్నాయి. కానీ మమ్మల్ని మనుష్యులుగా గుర్తించడం లేదు.
– మడిమి దేవరాజు, కొసాయిగుంపు
Updated Date - May 17 , 2024 | 12:45 AM