మళ్లీ పెరుగుతున్న గోదావరి
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:25 AM
గోదావరి వరద మళ్ళీ నెమ్మదిగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 5గంటలకు 42.70, సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద 43.50 అడుగుల నీటిమట్టం నమోదైంది.
కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద
బయట పడుతున్న ఇళ్లు తిరిగి ముంపులో..
పోలవరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
పట్టిసీమ నుంచి ,726 క్యూసెక్కులు
కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం, జూలై 30: గోదావరి వరద మళ్ళీ నెమ్మదిగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 5గంటలకు 42.70, సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద 43.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం నుంచి గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. మరో రెండు రోజులు నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుక్కునూరు మండలంలో 8గ్రామాలకు 881మంది పునరావాస కాలనీలో ఉంటున్నారు. గోదావరి మళ్లీ పెరుగుతుండడంతో వేలేరుపాడు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్లు బయట పడుతున్న తరుణంలో మరోసారి వరద పెరుగుతోంది.
పోలవరంలో గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 23.337 మీటర్లకు చేరడంతో 10 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువ కు విడుదల చేసినట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న వరద జలాలను 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 10,08,762 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 32.710 మీటర్లు, దిగువన 24.300 మీటర్లు నీటి మట్టం నమోదైంది. కడమ్మ వంతెనపై నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో ప్రాజెక్టుకు రాకపోకలు కొనసా గుతున్నాయి. కడమ్మ స్లూయిజ్ గేట్లు మూసుకుపోయి ఏటిగట్టుకు కుడివైపున 20 రోజులుగా పంటపొలాలు ముంపులో ఉన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 6,726 క్యూసెక్కుల జలాలు విడుదల చేసినట్లు డీఈఈ పెద్దిరాజు తెలిపారు. 20 మోటార్లు 20 పంపులతో పట్టిసీమ నుంచి నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Jul 31 , 2024 | 12:26 AM