కోటి ఆశలతో కువైత్ వెళ్లి.. గుక్కెడు నీళ్లకూ దిక్కులేక..!
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:18 AM
కువైత్‌లో వేధింపులకు గురై ఓ కార్మికుడు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
అన్నమయ్య జిల్లా చింతపర్తి వాసి కష్టాలు
ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితుడి వీడియో
సోషల్ మీడియాలో వైరల్.. స్పందించిన మంత్రి లోకేశ్
అప్పులు చేసి పంపించామని భార్య ఆవేదన
క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకోలు
వాల్మీకిపురం, జూలై 14: కువైత్‌లో వేధింపులకు గురై ఓ కార్మికుడు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన ఎ.శివ, శంకరమ్మ దంపతులు ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటూ రోజు కూలీ పనులకు వెళ్లేవారు. రోజూ పనికి వెళ్లకపోతే కానీ పూటగడవని పరిస్థితి. ఆ నిరుపేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పిల్లల భవిష్యత్తు కోసం గత నెల 9వ తేదీన రూ.లక్ష అప్పు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా శివ కువైత్‌కు వెళ్లాడు. తొలుత గొర్రెల కాపరి అని చెప్పి తీరా కువైత్‌కు వెళ్లిన తరువాత శివను తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వదిలేశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర వేధింపులకు గురవుతుండటం, తన బాధను, కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ కావడమే కాకుండా శివ పరిస్థితిని చూసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కువైత్‌లోని ఎడారి ప్రాంతంలో కుక్కలు, బాతులు, మేకలు, గొర్రెలు, పావురాలకు కాపలాగా ఉండటమే కాకుండా.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే చెట్లకు నీళ్లు పట్టడం కష్టంగా ఉందని ఆ వీడియోలో శివ వాపోయాడు. అంతకు మించి రాత్రీపగలు ఒక్కడినే ఎడారిలో నరకయాతన అనుభవిస్తున్నానని విలపిస్తూ గోడు వెళ్లబోసుకున్నాడు.
తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని మరో రెండు రోజులు ఇలాగే ఉంటే బతకలేనని తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ పలువురికి వీడియోలు పంపి ఆవేదన చెందాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై శంకరమ్మను పలకరించగా కూలికి వెళితే గాని జీవనం సాగని నిరుపేద కుటుంబం తమదని, అప్పులు చేసి కువైత్‌కు పంపితే అక్కడ తన భర్త పరిస్థితిని చూడలేకపోతున్నానని విలపించింది. తన భర్త శివను కువైత్‌కు పంపిన ఏజెంట్‌ను సంప్రదిస్తే మళ్లీ తిరిగి ఇండియాకు రావడానికి రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదని విలపిస్తోంది. ఇప్పటికే అప్పుల భారంతో బతుకుతున్న తమకు ఏమి చేయాలో పాలుపోవడం లేదని విచారం వ్యక్తం చేసింది. ఎలాగైనా తన భర్తను సురక్షితంగా ఇంటికి చేర్చాలని వేడుకుంటోంది. కాగా.. కువైత్‌లో ఇరుక్కుని వేధింపులకు గురవుతున్నానంటూ శివ పెట్టిన వీడియోలను సోషల్ మీడియాలో చూసిన మంత్రి నారా లోకేశ్ తక్షణం స్పందించారు. శివను స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ శాఖను కోరినట్టు తెలిసింది. దీంతో బాధిత కుటుంబం సంతోషం వ్యక్తంచేయడంతోపాటు, మంత్రి లోకేశ్ స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక సర్పంచ్ మహిత శేషాద్రిరెడ్డి, టీడీపీ నాయకులు శివ కష్టాలను ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Updated Date - Jul 15 , 2024 | 04:19 AM