వేటు మొదలైందా...
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:15 AM
తీగ లాగితే డొంక కదులుతోంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్‌లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు పడుతోంది. శృంగవరపుకోట సబ్ రిజిస్ర్టార్ శ్యామలపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ విజయలక్మ్షి ఈనెల 22న ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ హయాంలో నిషేధిత భూములు, ప్రభుత్వ స్థలాల అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు చేశారు.
వేటు మొదలైందా...
శృంగవరపుకోట సబ్ రిజిస్ర్టార్‌పై చర్యలు
సస్పెండ్ చేస్తూ ఆ శాఖ డీఐజీ ఆదేశాలు
మిగతా వారిలో ఆందోళన
విజయనగరం (ఆంధ్రజ్యోతి):
తీగ లాగితే డొంక కదులుతోంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్‌లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు పడుతోంది. శృంగవరపుకోట సబ్ రిజిస్ర్టార్ శ్యామలపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ విజయలక్మ్షి ఈనెల 22న ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ హయాంలో నిషేధిత భూములు, ప్రభుత్వ స్థలాల అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా జిల్లాలో పర్యటించారు. ఎస్.కోట, భోగాపురం, గజపతినగరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలను సందర్శించారు. వివాదాస్పద భూములను పరిశీలించి భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. అందులో భాగంగా ఎస్.కోట సబ్ రిజిస్ర్టార్‌పై వేటు వేసినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో మిగతా అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అటు అక్రమాలకు పాల్పడిన వారు సైతం టెన్షన్ పడుతున్నారు.
ఏం జరిగిందంటే..
ప్రభుత్వం పంపిణీ చేసి 20 సంవత్సరాలు పూర్తయిన డీపట్టాదారులకు ఆ భూములపై హక్కులు కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వంలో జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలో అర్హత సాధించిన పట్టాదారు భూములు 21 వేల ఎకరాల వరకూ ఉన్నాయి. అయితే తొలి విడతలో 11,025 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వ జీవో వస్తుందని తెలిసి కొందరు వైసీపీ పెద్దలు ముందుగానే ప్లాన్ చేశారు. ఒక పథకం ప్రకారం భూ యజమానులకు కొంతమొత్తం అందించి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అయితే దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను మూడు నెలల పాటు నిలిపివేసింది. అయితే జిల్లాలో మాత్రం 214 ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్లు జరిగిపోయాయి. ఇందులో రెవెన్యూతో పాటు రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు, సిబ్బంది పాత్ర ఉంది. దీనిని తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇటీవల జిల్లాలో పర్యటించారు. స్వయంగా కొన్ని లోపాలను గుర్తించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ప్రస్తుతం అటు రెవెన్యూ, ఇటు స్టాంప్స్, రిజిస్ర్టేషన్ల శాఖాపరంగా లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్.కోట సబ్ రిజిస్ర్టార్ పాత్ర స్పష్టంగా బయటపడడంతో ఆమెపై వేటు పడింది.
ముందస్తు ఒప్పందాలు..
ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం జీవో జారీచేస్తుందని కొంతమంది నేతలకు తెలుసు. అందుకే ఎక్కడికక్కడే ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా సరిహద్దు మండలాల్లోని భూములపైనే కొందరు వైసీపీ నేతలు కన్నేశారు. భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం నేపథ్యంలో అక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇటు ఎస్.కోట మండలంలో సైతం భూమలు ధరలు భారీగా ఉన్నాయి. అందుకే అక్కడ డీపట్టాదారులతో ముందుగానే మాట్లాడుకున్నారు. ఎకరా రూ.2 కోట్లు ధర ఉన్న చోట.. రూ.25 లక్షలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొందరి అవసరాలకు ముందుగానే డబ్బు సమకూర్చారు. జిల్లాలో అత్యధికంగా ఎస్.కోటలో 98.32 ఎకరాల ఫ్రీహోల్డ్ భూమి రిజిస్ర్టేషన్ అయినట్టు తెలుస్తోంది. భోగాపురంలో 41 ఎకరాలు, గజపతినగరంలో 39.99 ఎకరాలు, విజయనగరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో 10.38 ఎకరాలు రిజిస్ర్టేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్.కోటలో దాదాపు 100 ఎకరాలు చేతులు మారడం గమనార్హం.
పనితీరుపై విమర్శలు..
జిల్లాలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల కార్యాలయాలుండగా కొన్నిచోట్ల సాయంత్రం 6 దాటితేనే కొన్ని రకాల రిజిస్ర్టేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. నమ్మకమైన డాక్యుమెంట్ రైటర్లు, దళారులు సాయంత్రం 6 గంటలు దాటితే తమ పని కానిచ్చేస్తుంటారని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్ని కార్యాలయాల్లో అనధికార వ్యక్తులదే హవా. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మాదిరిగా వ్యవహరిస్తున్నారు. క్రయ, విక్రయదారులను కార్యాలయంలోకి రాకుండా కట్టడి చేస్తుంటారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఇట్టే ప్రవేశించి చక్కగా రిజిస్ర్టేషన్లు చేయిస్తుంటారు. తనిఖీల సమయంలో వీరు జాగ్రత్తపడతారు. తరువాత పరిస్థితి షరా మూమ్మూలుగానే కొనసాగుతోంది.
Updated Date - Aug 24 , 2024 | 12:15 AM