ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ హామీ ఏమైంది?

ABN, Publish Date - Apr 20 , 2024 | 11:05 PM

‘అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఉన్న ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తాం. కార్మికులు, చెరకు రైతులను ఆదుకుంటాం’ అని జిల్లాలో పాదయాత్ర చేపట్టిన సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా... ఇంకా ఆ హామీని నెరవేర్చలేదు.

మూతపడిన లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం

చెరకు రైతులు, కార్మికులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చిన వైనం

అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఊసే ఎత్తని ముఖ్యమంత్రి

చివరకు మూతపడిన చక్కెర కర్మాగారం

ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడిపించాలని అప్పట్లో ప్రజాసంఘాలు ఆందోళన

వీధిన పడిన కార్మిక కుటుంబాలు... చెరకు సాగుకు దూరమైన రైతులు

పట్టించుకోని వైసీపీ సర్కారు.. వలసబాటలో ఎంతోమంది..

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/సీతానగరం)

‘అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఉన్న ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తాం. కార్మికులు, చెరకు రైతులను ఆదుకుంటాం’ అని జిల్లాలో పాదయాత్ర చేపట్టిన సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా... ఇంకా ఆ హామీని నెరవేర్చలేదు. రైతులు, కార్మికులను పట్టించుకునే లేదు. పైగా వైసీపీ ప్రభుత్వ పాలనలోనే ఈ కార్మాగారం మూతబడింది. దీంతో ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అత్యధికంగా రైతులు చెరకు సాగుకు స్వస్తి చెప్పారు. మరికొందరు పొట్ట చేతపట్టుకుని వలసబాట పట్టారు. మొత్తంగా ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పలు చెప్పుకునే సీఎం జగన్‌.. చక్కెర కర్మాగారంపై ఇచ్చిన హామీని గాలిలో కలిపేశారు. కార్మికులు, రైతులకు నిరాశే మిగిల్చారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా పార్వతీపురం, సాలూరుతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గాల్లో రైతులకు లచ్చయ్యపేట ఎన్‌ఎసీఎస్‌ చక్కెర కర్మాగారం అంత్యంత కీలకం. గతంలో 16 మండలాల రైతులు సుమారు 9 వేల ఎకరాల్లో చెరకు సాగు చేపట్టేవారు. తమ పంటను నేరుగా సీతానగరానికి సమీపంలో ఉండే ఈ కర్మాగారానికి తరలించేవారు. అంతా బాగుందనుకున్న తరుణంలో.. ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చెరకు బిల్లులు సకాలంలో రైతులకు చెల్లించలేకపోవడం వల్ల 2021లో ఫ్యాక్టరీ మూతబడింది. ఆ సమయంలో చెరకు రైతులు, కార్మికులను ఆదుకోవాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని ప్రజా, రైతు సంఘాల నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం కనికరించలేదు. పైగా రైతులకు చెల్లించాల్సిన బకాయిల పేరుతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కిందట ఎన్‌సీఎస్‌ భూములను సైతం విక్రయించారు. ఇదే సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఫ్యాక్టరీ మూతపడడంతో ఉమ్మడి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రైతులు నాలుగు వేల ఎకరాల్లోనే సాగు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీకి వారు తమ పంటను తరలించాల్సి వస్తోంది. దీనివల్ల వ్యయప్రయాసాలకు గురికావల్సి వస్తోంది. దూరాభారంతో పాటు రవాణా, లేబర్‌ చార్జీలు అధికం కావడంతో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో చెరకు సాగు చేపట్టడం, ఫ్యాక్టరీకి తరలించడం అన్నది వారికి భారంగా మారింది. మరోవైపు ఈ ప్రాంతంలో అత్యధిక మెట్టు భూములే ఉండడం, సాగునీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా మరే పంటను పండించలేకపోతున్నారు. దీంతో చాలామంది కుటుంబాలతో వలస బాట పట్టారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో..

ఉమ్మడి జిల్లాలో చెరకు రైతులు, కార్మికులు రోడ్డున పడకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. చక్కెర కర్మాగార యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఫ్యాక్టరీ పనిచేసే విధంగా చూశారు. అప్పట్లో ఫ్యాక్టరీ నుంచి రైతులకు బకాయిలు చెల్లించేలా చొరవ చూపి కొంతవరకు సఫలీకృతులయ్యారు. కర్మాగారాన్ని మూసివేస్తామని యాజమాన్యం మొండిపట్టు పట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి.. ఫ్యాక్టరీ నడిపించేలా చేశారు. దీనివల్ల కార్మికులు, చెరకు రైతులకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో సుమారు 9 వేల ఎకరాలకు పైబడి చెరకు పంట సాగయ్యేది. సుమారు 300 మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ఫ్యాక్టరీ నడిచే సమయంలో ఎంతోమంది చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

వైసీపీ పాలనలో..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. ఫ్యాక్టరీని నడిపించేలా చూడాల్సిన సర్కారు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్న హామీని మరిచి మూతపడేలా చేశారు. బకాయిల కోసం ఫ్యాక్టరీకి చెందిన సుమారు 91 ఎకరాలను వేలం వేయించారు తప్ప రైతులు, కార్మికులకు చేసిందేమీ లేదు. అసలు వారి గోడును సైతం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ భూముల విక్రయాల్లో కూడా అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రధాన నాయకులు తెరవెనుక ఉండి అంతా నడిపించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ కారణంగానే తక్కువ ధరకే భూముల విక్రయాలు జరిగాయనే వాదనలు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఫ్యాక్టరీ మూతపడడంతో ప్రస్తుతం చెరకు రైతులు, కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనంతటికీ కారణం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని ఆయా ప్రాంతవాసులు బహిరంగం గానే విమర్శిస్తున్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం జిల్లాలో ఉన్న పరిశ్రమలను సైతం నడిచేలా చేయకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. మొత్తంగా లచ్చయ్యపేట ఎన్‌ఎసీఎస్‌ చక్కెర కర్మాగారం మూతపడేలా చేసిన పాపం వైసీపీదేనంటూ ఆయా ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు.

పండించలేకపోతున్నాం..

ప్రస్తుత పరిస్థితుల్లో చెరకు సాగు చేపట్టలేకపోతున్నాం. లచ్చయ్యపేట చక్కెర ఫ్యాక్టరీ నడిచినప్పుడు పంటను తరలించడానికి వీలుగా ఉండేది. అవసరమైతే నాటుబళ్లతోనైనా చెరకు సప్లై చేసుకోగలమని ధైర్యం ఉండేది. అయితే యాజమాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం, వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడంతో కార్మాగారం మూతపడింది. దీంతో మాకు కష్టాలు మొదలయ్యాయి. సుదూరంలో ఉన్న సంకిలి ఫ్యాక్టరీకి పంటను తరలించాలంటే తడిసిమోపె డవుతోంది. లేబర్‌, రవాణా చార్జిలను తట్టుకోలేక పోతున్నాం. అవసరమైన సమయంలో వాహనాలు రాకపోవడం, చెరకు ఆరిపోవడం వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటున్నాం. దీంతో చెరకును పండించలేకపోతున్నాం.

- బొత్స సింహాచలం , చెరకు రైతు, లచ్చయ్యపేట

===========================

చార్జీల భారం..

విజయనగరం జిల్లాలో సంకలి ఫ్యాక్టరీకి చెరకు పంటను పంపించాలంటే మాపై అధికంగా చార్జీల భారం పడుతుంది. నరికిన చెరకు సరైన సమయంలో ఫ్యాక్టరీకి వెళ్లడం లేదు. మరోవైపు రవాణా, లేబర్‌ చార్జీలను భరించాల్సి వస్తుంది.

- ఉరదండ లక్ష్మం, రైతు, లక్ష్మీపురం

===========================

ఆందోళనలు చేపట్టినా..

2018లో ప్రతిపక్ష నేత జగన్‌ జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో లచ్చయ్యపేట ఫ్యాక్టరీకి పూర్వవైభవం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటనే మరిచారు. పైగా ఫ్యాక్టరీ మూతపడేలా చేశారు. కర్మాగారాన్ని వైసీపీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడిపించాలని రైతులు, కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా స్పందించలేదు. ఇది చాలా బాధాకరం.

- రెడ్డి లక్ష్ముంనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

Updated Date - Apr 20 , 2024 | 11:05 PM

Advertising
Advertising