కార్మికులకూ.. ఏం చేయలే!
ABN, Publish Date - May 01 , 2024 | 12:24 AM
కార్మికుడి కష్టంతో ఫ్యాక్టరీలు నడుస్తాయి.. భవంతులు తయారవుతాయి.. ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.. సౌకర్యాలు ఒనగూడుతాయి.. వసతులు సమకూరుతాయి. సేవలు అందుతాయి. మొత్తంగా మనిషి జీవనమే కార్మికుని శ్రమతో పెనవేసుకుని ఉంది. అలాంటి కార్మికుడు నేడు కష్టపడుతున్నా కష్టాల నుంచి గట్టెక్కలేకపోతున్నాడు.
కార్మికులకూ.. ఏం చేయలే!
వైసీపీ పాలనలో వారికి తీవ్ర నష్టం
జగన్ ఇచ్చిన హామీలకూ దిక్కులేదు
ఉపాధికి కానరాని భరోసా
పవర్ దెబ్బకు ఫెర్రో పరిశ్రమలు కుదేలు
మూతపడిన జూట్ కర్మాగారాలు
శ్రమజీవులకు తప్పని వలస బాట
మేడే సందర్భంగా కథనం
కార్మికుడి కష్టంతో ఫ్యాక్టరీలు నడుస్తాయి.. భవంతులు తయారవుతాయి.. ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.. సౌకర్యాలు ఒనగూడుతాయి.. వసతులు సమకూరుతాయి. సేవలు అందుతాయి. మొత్తంగా మనిషి జీవనమే కార్మికుని శ్రమతో పెనవేసుకుని ఉంది. అలాంటి కార్మికుడు నేడు కష్టపడుతున్నా కష్టాల నుంచి గట్టెక్కలేకపోతున్నాడు. జీవనానికే అవస్థలు పడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని ఐదేళ్లుగా వేతనాలు పెరగక.. సరిగా అందక.. ఉపాధికి భరోసా లేక విలవిల్లాడుతున్నాడు. జిల్లాలో ఏ పరిశ్రమ ఎప్పుడు మూతపడుతుందో తెలియని దుస్థితి. మూతపడిన పరిశ్రమలు తిరిగి తెరుచుకోని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. జూట్, ఫెర్రో పరిశ్రమలను దాదాపు మూసేశారు. ఆ కార్మికుల్లో అనేక మంది నేడు బతుకును భారంగా నెట్టుకొస్తున్నారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ చీపురుపల్లి/ విజయనగరం రూరల్
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లా కార్మికులకు కష్టాలే మిగిలాయి. జూట్, ఫెర్రో పరిశ్రమలను వరుసగా మూసేస్తుండడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. పరిశ్రమలకు ఎప్పటికపుడు లాకౌట్ ప్రకటించడం.. ఆ తర్వాత నిలిపేయడం సర్వసాధారణంగా మారింది. జనపనార పరిశ్రమలను తెరిపించేం దుకు వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా ఉన్న చక్కెర కర్మాగారాలు మూతపడడంతో వాటిలో పనిచేస్తున్న కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. భీమసింగి, లచ్చయ్యపేట చక్కెర పరిశ్రమల్లో రెగ్యులర్ కార్మికులు 120మంది వరకు ఉన్నారు. సీజన్లో అయితే 350 మంది వరకు పనిచేసేవారు. వీరందరికీ ఉపాధి పోయింది. కార్మికుల్లో చాలామందికి ఇప్పటికీ గ్రాట్యుటీ తదితర డబ్బులు చెల్లించలేదు. కాగా బొబ్బిలి, రాజాం, విజయనగరం ప్రాంతాల్లో జూట్ పరిశ్రమలు పదేళ్ల నుంచే దివాలా బాట పట్టాయి. మూత పడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులను ఆదుకుంటామని పాదయాత్రలో జగన్ హామీఇచ్చారు. వాటిని తెరిపించలేకపోగా పనిచేస్తున్న వాటిని కాపాడుకోలేక పోయారు. ఈ రంగంలో 6వేల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వారంతా ఉపాధికోసం కిరాణా షాపుల్లో, కోళ్ల పరిశ్రమల్లో, చెప్పుల షాపుల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత మంది ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వలసపోయారు.
ఫెర్రో పరిశ్రమలు కుదేలు
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల్ని తెరిపిస్తానని ముఖ్యమంత్రి జగన్ మాటిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చి పెట్టిన ఆ రంగాన్ని ఆదుకుంటానన్నారు. భరోసా ఇవ్వకపోగా విద్యుత్ టారిఫ్‌ను ఒక్కసారిగా పెంచేసి పూర్తిగా వాటి ఉనికి లేకుండా చేసేశారు. ఆ పరిశ్రమకు పుట్టినిల్లుగా ఉన్న ఒక్క విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఫెర్రో పరిశ్రమ ఇప్పుడు కుదేలయ్యే దశకు చేరుకుంది. ఈ పరిశ్రమల మనుగడను 2023 ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ప్రకటించిన నూతన టారిఫ్ విధానం మరింత ప్రశ్నార్థకం చేసింది. ఇవి మాత్రమే కాకుండా దీనిపై ఆధార పడి ఉన్న డోలమైట్, క్వార్ట్జ్ వంటి ఇతర ముడి ఖనిజపు క్వారీలు, గనుల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికీ ఉపాధి ధీమా కరువైంది.
ఫ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 17 పరిశ్రమల్లో ప్రస్తుతం సగానికి పైగా మూత పడిపోయాయి. మరికొన్ని లే ఆఫ్‌లతో కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో జిల్లాలోని దాదాపు పది వేల మంది ఉపాధి కోల్పోయారు. ఈ రంగంలో తలెత్తిన సంక్షోభాన్ని తక్షణమే నివారించడం కోసం ఫెర్రో పరిశ్రమల ఉత్పత్తిదారుల సంఘం 2023 జూన్‌లో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వినిపించింది. యూనిట్ విద్యుత్ ధరను రూ.5లు లేదా దాని కంటే తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ సంఘ నాయకులు ముఖ్యమంత్రిని కోరారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఒక్క రూపాయ నుంచి ఆరు పైసలకు, పెంచిన ఎండీ చార్జీలను 90 శాతం తగ్గించింది. అయితే విద్యుత్ రాయితీలేవీ ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ఈ పరిశ్రమలు పూర్తి స్థాయిలో నడవడం లేదు.
వేతన బోర్డు ఏదీ?
ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్మికులకు మొండిచేయే మిగిలింది. కార్మికులకి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇందుకు కనీస వేతన బోర్డును ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు యథావిధిగా ఉన్నాయి. కార్మికుల సంక్షేమం తదితర కార్యక్రమాలు చూడాల్సిన కార్మిక శాఖని కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
పనులు వెతుక్కుంటున్నాం
భవన నిర్మాణ పనుల కోసం కార్మికులు యజమానుల వద్ద ప్రాధేయ పడాల్సి వస్తోంది. ఇసుక రేట్లు భారీగా పెరిగాయి. దీంతో నిర్మాణాల సంఖ్య తగ్గింది. పన్నుల భారం కారణంగా సిమెంటు, ఐరన్ రేట్లు పెరిగాయి. దీంతో నిర్మాణ రంగం పనులు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ ప్రభావం కార్మికులపై పడింది.
- బి.తిరుపతిరావు, నిర్మాణ కార్మికుడు, నెల్లిమర్ల
కనీస వేతనం ఏదీ?
బెహరా శంకరరావు, ఏఎఫ్‌టీయు కార్మిక సంఘ నాయకుడు
ఐదేళ్ల కాలంలో కనీస వేతన బోర్డుని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కార్మికుల గురించి పట్టించుకోలేదు.. ఒక విధంగా చెప్పాలంటే కార్మిక శాఖ నిర్వీర్యం అయ్యిందా అన్న అనుమానం కలుగుతోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు ఐదేళ్ల కాలంలో మరింత పెరిగాయి.
ఉపాధి కరువైంది
ఎం.శ్రీనివాసరావు, చిన్నాపురం
విజయనగరంలో రెండు జూట్ పరిశ్రమలు ఉండేవి. రెండూ మూసేశారు. జూట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. యాజమాన్యం కార్మికుని తరుపున చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని చెల్లించకపోవడం కార్మికులకు ఇబ్బందిగా పరిణమించింది. చిన్న, చిన్న వ్యాపారాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం.
కొత్తపరిశ్రమలేవీ?
భీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
జిల్లాలో పరిశ్రమలకు దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. జనపనార, చెరకు పరిశ్రమలదీ అదే దారి. పనిలేక వేలాదిమంది కార్మికులు వలసబాట పట్టారు. చెరుకు మిల్లులకు ప్రోత్సాహకాలు లేక అవి మూతపడ్డాయి.
పట్టించుకోవడం లేదు
బంటిబోను చినప్పన్న, జూట్ కార్మికుడు, రాజాం
జూట్ కార్మికుల సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను సుమారు 40 ఏళ్ల నుంచి జూట్ మిల్లులో పని చేస్తున్నాను. కార్మికుల విషయంలో ఏ ఒక్క నాయకుడు చొరవ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు.
మనుషులుగా గుర్తించండి
పైడిరాజు, రిక్షా డ్రైవర్, జొన్నగుడ్డి, విజయనగరం
విజయనగరం (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రిక్షా పుల్లర్లను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు. శరీరాన్ని ఇంధనంగా మార్చుకుని రోజంతా కష్టపడితే రెండు మూడు వందలు రావడం లేదు. కుటుంబాన్ని నెట్టుకు రావటం పెనుభారం అవుతోంది. అటోవాలలకు ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తుంది కానీ రిక్షా కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్త రిక్షా కొనుక్కోవడానికి రుణాలు కూడా ఇవ్వడం లేదు.
-------------
Updated Date - May 01 , 2024 | 12:24 AM