8న ఎస్‌ఎంసీల ఎన్నికలు
ABN, Publish Date - Jul 31 , 2024 | 11:59 PM
జిల్లాలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నికలకు ప్రభుత్వం నేడు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు డీఈవో జి.పగడాలమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికైన ఎస్‌ఎంసీల పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త కమిటీల ఎన్నికకు విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
పార్వతీపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి)/గరుగుబిల్లి/సాలూరు రూరల్: జిల్లాలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నికలకు ప్రభుత్వం నేడు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు డీఈవో జి.పగడాలమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికైన ఎస్‌ఎంసీల పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త కమిటీల ఎన్నికకు విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్, సభ్యుల ఎన్నికలకు గురువారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుందని, మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ఉంచుతారని తెలిపారు. 5న ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకు ఓటరు జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 3, 4 గంటల మధ్య తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారన్నారు. 8న ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మొదటి సమావేశాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.
ఎన్నిక ఇలా..
ఎన్నికల నిర్వహణకు విధిగా 50 శాతం మేర తల్లిదండ్రులు, సంరక్షకులు హాజరుకావాల్సి ఉంది. కోరం ఏర్పాటుకు సంబంధించి హెచ్‌ఎంలు సమయాన్ని నిర్ణయిస్తారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించనున్నారు. వివాదం ఉన్నట్లయితే రహస్య బ్యాలెట్ విధానాన్ని అమలు పర్చనున్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. పలు క్లాసుల్లో పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రతి తరగతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులు. తరగతిని యూనిట్‌గా తీసుకుని ముగ్గురు సభ్యులను ఎన్నుకోవలసి ఉంటుంది. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురిలో ఒకరు విధిగా ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారు ఉండాలి. మరొకరు బీసీ లేదా ఓబీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు ఉండాలి. తరగతిలో ఆరుగురు విద్యార్థులు లేకుంటే వీరిని మరొక తరగతిలో విలీనం చేసి ఎన్నుకోవలసి ఉంటుంది. ఎన్నికల అధికారిగా సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు, పరిశీలకులుగా తహసీల్దార్, ఎంపీడీవో, వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఉంటారు. ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాత 8న ఎంఎస్‌సీ రిజిస్టర్లలో సభ్యుల వివరాలు పొందుపర్చి వారితో సంతకాలు చేయించాల్సి ఉంది. ఈ సమాచారాన్ని ఎంఈవోలకు తెలియజేయాలి. ఎన్నికైన సభ్యుల పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 1582 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 94 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
Updated Date - Jul 31 , 2024 | 11:59 PM