సర్పంచ్‌పై వైసీపీ వర్గీయుల దాడి
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:20 AM
చింతలపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్‌ఐ సుదర్శనరావు సమక్షంలోనే వైసీపీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ సర్పంచ్ మాకెన సీతారామపాత్రుడు(నవీన్)ను తీవ్రంగా గాయపర్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
సర్పంచ్‌పై వైసీపీ వర్గీయుల దాడి
చింతలపాలెంలో ఎమ్మెల్యే సమక్షంలోనే ఘటన
కొత్తవలస, ఆగస్టు 23: చింతలపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్‌ఐ సుదర్శనరావు సమక్షంలోనే వైసీపీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ సర్పంచ్ మాకెన సీతారామపాత్రుడు(నవీన్)ను తీవ్రంగా గాయపర్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో తొలుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు గ్రామపెద్దలు సర్పంచ్ మాకెన సీతారామపాత్రుడు గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. చివరగా ఎమ్మెల్యే మాట్లాడాక సమావేశాన్ని ముగించి అధికారులందరూ వేదిక దిగిపోయే సమయానికి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు కాయితపు బీష్మ తనకు మాట్లాడటానికి మైక్ ఇవ్వాలన్నారు. సమావేశం ముగించిన తరువాత మైక్ ఇవ్వాలంటే ఎలా అని సర్పంచ్ అనడంతో కోపోద్రిక్తుడైన బీష్మ, మరికొంతమంది యువకులు అక్కడే ఉన్న పోలీసు అధికారిని, మిగిలిన ప్రభుత్వ అధికారులను నెట్టేసి వేదికపైకి వచ్చి సర్పంచ్‌పై దాడి చేశారు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడే ఉన్న ఎమ్మెల్యే, అధికారులు నిశ్చేష్టులయ్యారు. వెంటనే అందరూ కలిసి అడ్డుకున్నారు. అయితే అప్పటికే సర్పంచ్‌కు తీవ్ర గాయమైంది. కుడిచేయి విరిగిపోయింది. ఎస్‌ఐ సుదర్శనరావు దాడి చేసిన మాజీ సర్పంచ్‌తోపాటు దాడిలో పాల్గొన్న వైసీపీకి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సర్పంచ్ సీతారామపాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తవలస సీఐ షణ్ముకరావు గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 12:20 AM