మాటిచ్చారు.. మరిచారు!
ABN, Publish Date - May 26 , 2024 | 11:03 PM
కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్‌కు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోవడం లేదు. సుమారు రూ.28 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది.
రూ.28 కోట్లతో పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ
ఐదేళ్లు గడిచినా ప్రారంభించని వైనం
మూడు మండలాల్లో భూములకు అందని సాగునీరు
ఏటా వరుణుడిపైనే ఆధారం
రైతులకు తప్పని అవస్థలు
కురుపాం రూరల్: కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్‌కు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోవడం లేదు. సుమారు రూ.28 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. దీంతో మూడు మండలాల పరిధిలో ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఏటా వరుణుడిపై ఆఽధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం గుమ్మిడిగెడ్డ ఆయకట్ట కింద ఉన్న కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో 4,100 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. అయితే రిజర్వాయరు నిర్మిస్తే సుమారు 26 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేగాకుండా ఈ ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ సర్కారు ఐదేళ్ల కాలంలో దీనిపై దృష్టి సారించలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతలో ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించకపోవడంతో ఆ జలాలు నాగావళి నదిలో కలిసి పోతున్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ సర్కారు డిస్ర్టిబ్యూటరీ కాలువల నిర్వహణకు నిధులు సైతం మంజూరు చేయలేదు. కనీసం పూడికలు కూడా తీయించలేదు. మరోవైపు ఆనకట్ట వద్ద షట్టర్ల లీకుల వల్ల శివారు భూములకు నీరందడం లేదు. ఇక కిచ్చాడ పరిధిలో కాలువ మరింత అధ్వానంగా మారడంతో ఆ ప్రాంత రైతులు బోర్లపై ఆధార పడి వ్యవసాయం చేస్తున్నారు. పలు చోట్ల ఆయకట్టుదారులే శ్రమదానం చేసి కాలువలు బాగు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతవాసుల కల నెరవేర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.
సర్వే కూడా చేయలేదు..
గుమ్మిడిగెడ్డపై రిజర్వాయరు ఈ ప్రాంతవాసుల కల. సుమారు రూ.28 కోట్లతో జర్వాయర్ నిర్మిస్తామని చాలా కాలంగా నాయకులు, అధికారులు చెబుతున్నారు. అయితే కనీసం సర్వే కూడా చేయడం లేదు. రిజర్వాయరు నిర్మాణం జరిగితే ప్రస్తుతం ఉన్న 4,100 ఎకరాలతో పాటు మరో 26 వేల ఎకరాలకు నీరందుతుంది. తక్షణమే అధికారులు స్పందించాలి.
- బి.పార్థసారథిరావు, ఆయకట్టు రైతు, కురుపాం
==================================================
నీరందడం లేదు..
గుమ్మిడిగెడ్డ కాలువ నుంచి తొలుత మా పొలాలకే నీరు రావాల్సి ఉంది. కానీ రావడం లేదు. కర్లగండ గ్రామం వద్ద కొమరాడ మండలానికి చెందిన వెయ్యి ఎకరాలకు నీరిచ్చేందుకు డైవర్షన్ కెనాల్ నిర్మించారు. కానీ ఏనాడూ పూర్తి స్ధాయిలో నీరు అందించలేదు. ఇక శివారు భూముల సంగతి సరేసరి. ఏటా వరుణడిపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. గుమ్మడిగెడ్డపై రిజర్వాయరు నిర్మిస్తే పంటలకు ఢోకా ఉండదు.
- ఎం.నాగేశ్వరరావు, ఆయకట్టు రైతు, పాలెం గ్రామం
Updated Date - May 26 , 2024 | 11:03 PM