ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూ’చోళ్లు

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:18 PM

గిరిజన యూనివర్సిటీ రాకమునుపే పరిసరాల్లోని భూములపై వైసీపీ నాయకులు గద్దల్లా వాలిపోయారు. వర్సిటీ వచ్చాక భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని భావించి వీలైనన్ని ఎకరాలను చేజిక్కించుకునేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి కీలక నేత, ఆయన సమీప బంధువు చక్రం తిప్పారు. పేదలను మభ్యపెట్టి, బెదిరించి అన్యాక్రాంతం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు రైతులు భూచోళ్ల దందాపై ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

చినమేడపల్లి వద్ద గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన భూమి

‘భూ’చోళ్లు

గిరిజన వర్సిటీ సమీపంలో తిష్టవేసిన వైసీపీ నాయకులు

పేదలను బెదిరించి మరీ భూముల అన్యాక్రాంతం

చక్రం తిప్పిన ఓ కీలక నేత, ఆయన సమీప బంధువు

కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం

గిరిజన యూనివర్సిటీ రాకమునుపే పరిసరాల్లోని భూములపై వైసీపీ నాయకులు గద్దల్లా వాలిపోయారు. వర్సిటీ వచ్చాక భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని భావించి వీలైనన్ని ఎకరాలను చేజిక్కించుకునేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి కీలక నేత, ఆయన సమీప బంధువు చక్రం తిప్పారు. పేదలను మభ్యపెట్టి, బెదిరించి అన్యాక్రాంతం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు రైతులు భూచోళ్ల దందాపై ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి) / మెంటాడ, జూలై 15:

గిరిజన యూనివర్సిటీని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో ఏర్పాటు చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రాకమునుపే కొందరు వైసీపీ జిల్లా నాయకులు అక్కడి భూముల వివరాలు ఆరా తీశారు. రియల్టర్ల అవతారమెత్తారు. రైతులకు మాయమాటలు చెప్పి, కొందరిని బెదిరించి కోట్ల విలువైన భూములను చౌకగా కొనేశారు. కొన్నింటిని అన్యాక్రాంతం చేసేశారు.

మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని కుంఠినవలస, చినమేడపల్లి పంచాయతీల పరిధిలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం సుమారు 561 ఎకరాలు సేకరించింది. గత ఏడాది ఆగస్టులో నాటి ముఖ్యమంత్రి జగన్‌, అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంఖుస్థాపన చేశారు. ఈ తంతు జరగడానికి ముందు నుంచే వర్సిటీ భూముల వివరాలను వైసీపీ నాయకులు ఆరా తీసి పేదల నుంచి వివిధ మార్గాల్లో తీసుకున్నారు. అయితే అసలు ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగు పడిందే టీడీపీ హయాంలో. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2014లో కేంద్రం గిరిజన వర్సిటీని మన రాష్ట్రానికి మంజూరు చేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తే మంచిదని, తద్వారా ఉమ్మడి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతానికి ఇటు ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని గిరిజనులకు అనుకూలంగా ఉంటుందని భావించింది. కేంద్రబృందం వర్సిటీ ప్రతిపాదిత భూములను పరిశీలించి ఆమోదం తెలిపింది. అనంతరం టీడీపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తూ సుమారు 500 ఎకరాలను సేకరించింది. అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబు గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశారు. భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఆపై ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వర్సిటీ స్థలాన్నే మార్చేసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాలకు చెందిన 561 ఎకరాలను సేకరించింది. ఇందులో జిరాయితీ కేవలం 67.50 ఎకరాలు మాత్రమే. మిగిలిన 500 ఎకరాలు డి పట్టా భూములు. కాగా జిరాయితీకి రూ.12లక్షలు, డి.పట్టా భూమికి ఏడున్నర లక్షలు, ఆక్రమణ భూమికి మూడు లక్షలు చొప్పున పరిహారం నిర్ణయించారు. మొత్తంగా సేకరించిన భూముల కోసం రూ.28,79,18,660 ప్రభుత్వం చెల్లించింది. అటు తర్వాత వర్సిటీ భవనాలకు కుంఠినవలస వద్ద శంకుస్థాపన చేశారు.

భూముల ఆక్రమణకు ప్లాన్‌

కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే తమ పాచికలు పారవని భావించిన వైసీపీ జిల్లా పెద్దలు ప్రభుత్వం వద్ద తమకున్న పలుకుబడిని ఉపయోగించి స్థలం మార్చేవారు. ఆపై వర్సిటీ భూముల సమీపంలో పేద రైతుల వద్దనున్న భూములపై కన్నేశారు. కారుచౌకగా కొట్టేసిన ప్రబుద్ధులు కొందరైతే.. అన్యాక్రాంతానికి తెగబడిన వారు మరికొందరు. భూములు ఇవ్వబోమని చెప్పిన వారి పట్ల బెదిరింపులకు కూడా దిగినట్లు తెలిసింది. ఈ విధంగా వారు స్వాధీనం చేసుకున్న భూమిపై నిర్దిష్ట వివరాలు అందుబాటులో లేనప్పటికీ వాటి విలువ వందల కోట్లలోనే ఉంటుందన్న అంచనా.

భూబాగోతంపై ఫిర్యాదు

భూగోతంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు రైతులు నిర్ణయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వంలో రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన, జిల్లా కీలక నేత తమ్ముడు(ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే), ఆ కీలక నేత నీడలో ఎదిగి ఇటీవల పక్కలో బల్లెంలా మారిన జిల్లాస్థాయి మరోనేత ఆగడాలపై రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. నాటి నాయకులు వ్యవహరించిన బినామీ వ్యాపారం గుట్టురట్టు చేసే దిశగా రైతులు ఆలోచిస్తున్నారు. మొత్తమ్మీద యూనివర్సిటీ ముసుగులో ఈ ‘భూ’చోళ్ల భూదాహానికి పేద రైతులు బలైన వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Jul 15 , 2024 | 11:18 PM

Advertising
Advertising
<