ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కబళిస్తున్నాయ్‌..

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:32 PM

జిల్లాలో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. జ్వరాలతో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేగుతోంది.

జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

పెరుగుతున్న మలేరియా, డెంగ్యూ కేసులు

పలువురి మృత్యువాత

నియంత్రణ చర్యలు చేపడుతున్నా.. అదుపులోకి రాని పరిస్థితి

ఆందోళనలో జిల్లావాసులు

పార్వతీపురం, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. జ్వరాలతో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేగుతోంది. మరోవైపు మలేరియా, డెంగ్యూ కేసులు కూడా మునుపెన్నడూ లేని విధంగా నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. ఆ సమచారం బయటకు రావడం లేదు. అనధికారికంగా చూసుకుంటే.. జిల్లాలో ఎంతోమంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల వల్ల వ్యాధులు అదుపులోకి రావడం లేదు.

కేసుల నమోదు ఇలా...

జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 1,85,584 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 1153 మందికి మలేరియా ఉన్నట్లు ప్రభుత్వ వైద్యులు గుర్తించారు. ఇందులో పీవీ 354 మందికి, పీఎఫ్‌ 78 మందికి ఉన్నట్లు తేలింది. డెంగ్యూకు సంబంధించి 1043 మందికి వ్యాధి పరీక్షలు నిర్వహించగా 52 మందికి ఆ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయా రోగులకు అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించారు.

నిర్లక్ష్యాన్ని వీడాలి..

ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ వైద్యులు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు న్నాయి. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, కొమరాడ, భామిని తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇంకొంతమంది విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందడం లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో జ్వర పీడితులు సంచి డాక్డర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొందరు నాటు, పసర మందులను వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నిబంధనలు పాటించని వైనం..

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు మలేరియా, డెంగ్యూ నిర్ధారణ అయితే వెంటనే ఆ సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖకు అందించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. వాస్తవంగా డెంగ్యూని నిర్ధారించాలంటే జిల్లా కేంద్ర ఆసుపత్రి లేదా పాలకొండ ఏరియా ఆసుపత్రిలోనే అవకాశం ఉంది. కానీ కొన్నిచోట్ల డెంగ్యూ లక్షణాలున్న వారికి ప్రైవేట్‌ వైద్యులు పరీక్షించి.. ఆ వ్యాధిని ఉన్నట్లు నిర్ధారించి వైద్యసేవలు అందిస్తున్నారు. మొత్తంగా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు వేలాది రూపాయలను వసూలు చేస్తూ.. రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు, ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో లేక పోయినప్పటికీ.. ఏదో ఒక విధంగా నెట్టుకొస్తున్నాయి. మరికొన్నిచోట్ల ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులను సమీపంలో ల్యాబ్‌ల వద్దకు పంపించి.. టెస్ట్‌ల పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కాగా జ్వర లక్షణాలతో వెళ్లిన వారికి సకాలంలో వైద్యం అందిస్తున్నప్పటికీ ఒక్కోసారి రోగుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి వ్యాధులు అదుపులోకి వచ్చేవరకూ అంతటా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వైద్యసేవలు అందిస్తున్నాం..

మలేరియా, డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. జ్వర లక్షణాలున్న వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తున్నాం. మలేరియా, డెంగ్యూ వ్యాధికి గురైన వారి సమాచారాన్ని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు అదించడం లేదు. దీనిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

- విజయపార్వతి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 24 , 2024 | 11:32 PM

Advertising
Advertising
<