కొత్త రైల్వే లైన్‌పై ఆశలు
ABN, Publish Date - Aug 01 , 2024 | 12:01 AM
విజయనగరం నుంచి పలాస, రాజాం ప్రాంతాలను కలుపుతూ సీతంపేట, పర్లాకిమిడి మీదుగా కొత్తగా రైల్వేలైన్ ఏర్పాటుపై జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గతంలో పూర్తయిన సర్వే
మంజూరైతే జిల్లా వాసులకు తప్పనున్న ఇబ్బందులు
సీతంపేట, జూలై 31: విజయనగరం నుంచి పలాస, రాజాం ప్రాంతాలను కలుపుతూ సీతంపేట, పర్లాకిమిడి మీదుగా కొత్తగా రైల్వేలైన్ ఏర్పాటుపై జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల పార్లమెంట్ సమావేశంలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించడంతో మళ్లీ ఇది చర్చనీయాంశమైంది. 2010లో దీనిపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. 142 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే మధ్యలో వంశధార, నాగావళి నదుల వద్ద, కొండ మార్గం గుండా గెడ్డలు, వాగుల్లో పలుచోట్ల భారీ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. దీంతో సర్వే అనంతరం రైల్వేశాఖ పునరాలోచనలో పడింది. దీంతో ఈ కొత్త రైల్వే మార్గం కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ అంశాన్ని ఎంపీ మరోసారి పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రైలు మార్గం మంజూరైతే అటు ఒడిశా, ఇటు ఆంధ్రా వాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని పలువురు చెబుతున్నారు. కాగా సీతంపేట, చాపర, కొత్తూరు, పాలకొండ, రాజాం ప్రాంతాలకు చెందిన వారు ఇకపై చీపురుపల్లి, ఆమదాలవలస, పార్వతీపురం వెళ్లి రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను సులభంగా పట్టణ ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. మరి దీనిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
డీపీఆర్‌కు ఆమోదం
విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణ సర్వేకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించింది. విజయ నగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగా పలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సర్వేకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదించింది. ఈ రైల్వేలైన్‌తో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశాలోని ఒక జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజా రవాణాతో పాటు పారిశ్రామికాభివృద్ధి, గిరిజన ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌కు మరింత అనుకూలత ఏర్పడ నుంది. పర్యాటకంగానూ కూడా మరింత అభివృద్ధికి అవకాశం కలగనుంది.
Updated Date - Aug 01 , 2024 | 12:01 AM