జీసీసీ సొసైటీ ఎన్నికలకు సిద్ధం
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:48 PM
సీతంపేట జీసీసీ (గిరిజన సహకార కో-ఆపరేటివ్) సొసైటీ ఎన్నికలకు టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు.
మార్గదర్శకాల తయారీలో సిబ్బంది
సీతంపేట: సీతంపేట జీసీసీ (గిరిజన సహకార కో-ఆపరేటివ్) సొసైటీ ఎన్నికలకు టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. వాస్తవంగా గత తొమ్మిదేళ్లుగా సొసైటీ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేక అధికారి నిర్వహణలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఎన్నికలు, సభ్యుల నియామకం లేకపోవడంతో రైతులకు ఖరీఫ్, రబీ పెట్టుబడి రుణాల చెల్లింపు కూడా నామమాత్రంగానే చేపట్టారు. వాటిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ కూటమి సర్కారు.. సొసైటీ పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అసలు సీతంపేట సొసైటీ పరిధిలో 800 మంది వరకు గిరిజన రైతులు సొసైటీ సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సభ్యులను ఎన్నుకోనున్నారు. మొత్తంగా తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మేనేజర్ కృష్ణను వివరణ కోరగా.. ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
Updated Date - Jul 23 , 2024 | 11:48 PM