ఐదేళ్లూ.. గాలికొదిలేశారు!
ABN, Publish Date - Jun 10 , 2024 | 11:39 PM
ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని.. అత్యద్భుతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ మాటే మరిచారు. ఐదేళ్లూ రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి సారించలేదు.
అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం
పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి..
ఏ మూల చూసినా గోతులే..
జిల్లావాసులకు తప్పని ఇబ్బందులు
గరుగుబిల్లి/సాలూరు రూరల్/భామిని, జూన్ 10 : ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని.. అత్యద్భుతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ మాటే మరిచారు. ఐదేళ్లూ రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి సారించలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారులే తప్ప వైసీపీ పాలనలో కొత్తగా చేసిందేమీ లేదు. దీంతో జిల్లాలో అనేక రహదారులు అడుగుకో గొయ్యితో అధ్వానంగా మారాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేదని పరిస్థితి. వాహనదారులు, ప్రయాణికులు నరకం చూశారు. ఎంతోమంది వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు క్షతగ్రాతులుగా మారారు. కాగా గత ఐదేళ్లూ అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడిన జిల్లావాసులు ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టనుందని అభి ప్రాయపడుతున్నారు. కాగా వైసీపీ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో కొన్ని రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
- పార్వతీపురం మండలం అడ్డాపుశీల మీదుగా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ప్రధాన రహదారి గుండా 2018 సెప్టెంబరు నెలలో జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో రోడ్డు నిర్మాణంపై హామీ ఇచ్చిన ఆయన అధికారంలోకి వచ్చిన పూర్తిగా మారిచారు. దీంతో నవిరి నుంచి పాలకొండ, శ్రీకాకుళం వైపు వెళ్లే ప్రదాన రహదారి మార్గం అత్యంత దారుణంగా తయారైంది. అడుగడునా భారీ గోతులు ఏర్పడ్డాయి. మరోవైపు రహదారిపై ఉన్న పొరలు ఊడిపోగా అది దారుణంగా మారింది. తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. గత ఐదేళ్లలో రహదారులు మెరుగుకు వైసీపీ ప్రభుత్వం చొరవ చూపలేదు. ప్రధానంగా రహదారుల మరమ్మతులకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల రూపురేఖలు మారాలంటే టీడీపీతోనే సాధ్యమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- సాలూరు-మక్కువ రోడ్డులో 2018, అక్టోబరు 23, 24, 25 తేదీల్లో జగన్ పాదయాత్ర సాగింది. అయితే ఆయన నడిచిన ఆ రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలమైంది. గతంలో ఈ రహదారి నిర్మాణానికి రూ. 55 కోట్లు మంజూరయ్యాయి. అయితే రెండేళ్ల కిందట పనులు ప్రారంభించారు. అయితే సుమారు రూ.నాలుగు కోట్ల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపేశారు. దీంతో ఈ రోడ్డు గోతులతో మరింత అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు.
- భామిని మండలం అలికాం-బత్తిలి రహదారి పునర్నిర్మిస్తామని గతంలో వైసీపీ సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయా ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తూరు నుంచి బత్తిలి సుమారు 30 కిలోమీటర్లు ఉండగా ఇటీవల మరమ్మతుల పేరిట అక్కడకక్కడా బిట్‌లు తొలగించి సిమెంట్ మెటల్ డస్ట్ పూడ్చారు. దీంతో వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో దుమ్ము రేగుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. కాగా వేసిన సిమెంట్ మెటల్ పాత రోడ్డుకు అడుగున్నర మేర కుంగిపోవడంతో ఆ ప్రదేశంలో ఆటో, ద్విచక్ర వాహనాలు కూరుకుపోతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Jun 10 , 2024 | 11:39 PM