‘కట్’కటా!
ABN, Publish Date - May 26 , 2024 | 12:06 AM
జిల్లాలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. గంటల తరబడి విద్యుత్ రాకపోవడంతో పల్లె, పట్టణ ప్రాంతాలను చీకట్లు కమ్మేస్తున్నాయి. అంతటా అంధకారం అలుముకుంటోంది. సాధారణ కోతలకు తోడు చిన్న గాలి వీచినా.. వర్షం పడినా కరెంటు సరఫరా ఆగిపోతుండడంతో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలి వీచినా, వర్షం కురిసినా సరఫరా నిలుపుదల
మరోవైపు మెయింటేనెన్స్ పేరిట కరెంట్ బంద్
తిరిగి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి
అంతటా అంధకారం.. ఇబ్బందుల్లో ప్రజలు
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/పార్వతీపురం టౌన్/ పార్వతీపురం రూరల్/పాలకొండ/ గరుగుబిల్లి/భామిని/మక్కువ/గుమ్మలక్ష్మీపురం)
జిల్లాలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. గంటల తరబడి విద్యుత్ రాకపోవడంతో పల్లె, పట్టణ ప్రాంతాలను చీకట్లు కమ్మేస్తున్నాయి. అంతటా అంధకారం అలుముకుంటోంది. సాధారణ కోతలకు తోడు చిన్న గాలి వీచినా.. వర్షం పడినా కరెంటు సరఫరా ఆగిపోతుండడంతో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా జిల్లాలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. వారంలో సుమారు నాలుగు రోజుల పాటు ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల రోజులో కొద్దిసేపే విద్యుత్ ఇచ్చి.. గంటలకొలదీ సరఫరాను బంద్ చేస్తున్నారు. కరెంట్ తిరిగి ఎప్పుడిస్తుందోనని ప్రజలు నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోంది. వాస్తవంగా ఈనెలలో పోలింగ్ రోజు వరకు పెద్దగా కరెంట్ కోతలు లేవు. అయితే ఆ తర్వాత రోజు నుంచి గంటల తరబడి అప్రకటిత కోతలు విధిస్తుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి డివిజన్లలో 33 కేవీ సబ్‌స్టేషన్లు 65, 11 కేవీ సబ్ స్టేషన్లు 431 ఉన్నాయి. వాటి పరిధిలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు సుమారు తొమ్మిది లక్షల వరకూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 34 మండలాలకు రోజుకు 13 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా కావల్సి ఉంది. అయితే ఆ మేరకు సరఫరా కావడం లేదు. దీంతో జిల్లాలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కోతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో కరెంట్ సరఫరా ఉండడం లేదు. ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండడంతో సాధారణ ప్రజలతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి లేదని.. ప్రస్తుత కోతలతో వ్యాపారాలు జరగ్గా ఉపాధిని కోల్పోతున్నామని పలువురు వాపోతున్నారు. కరెంట్ సక్రమంగా ఉండకపోయినా.. విద్యుత్ బిల్లులు మాత్రం అధిక మొత్తంలో వస్తుండడంపై అన్ని వర్గాల వారు మండిపడుతున్నారు. కాగా విద్యుత్‌శాఖ అధికారులు మాత్రం ఈ పరిస్థితిని అంగీకరించడం లేదు. అసలు జిల్లాలో విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారు. ‘అనధికారికంగా ఎలాంటి కోతలు లేవు.. కొన్ని రోజుల కిందట ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసిన కారణంగా జిల్లా కేంద్రంలోని 15 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. అందుకే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది’ అని ఏఈ మురళీ తెలిపారు.
నిర్వహణ పేరిట..
విద్యుత్ లైన్ల నిర్వహణ పేరిట జిల్లాలో రోజుకో ప్రాంతంలో అధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. విద్యుత్ లైన్లు సరిచేసే క్రమంలో గ్రామాలకు కొన్ని గంటల పాటు కరెంట్ ఉండడం లేదు. అప్రకటిత విద్యుత్ కోతలకు ఇవి కూడా తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొద్దిరోజులుగా అడపాదడపా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే గాలుల పేరిట విద్యుత్ సరఫరా బంద్ చేస్తుండగా.. తిరిగి ఎప్పుడు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తాగునీటికి ఇబ్బంది..
అనధికార విద్యుత్ కోతల ప్రభావం జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి సరఫరాపై పడుతోంది. వేళాపాలా లేకుండా కోతలు విధిస్తుండడంతో రెండు మూడు రోజులకొకసారి కొళాయిల ద్వారా వచ్చే తాగునీరు కూడా ఇప్పుడు సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో జిల్లాకేంద్రవాసులు బిందెలు పట్టుకుని ట్యాంకర్ల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
వివిధ చోట్ల ఇలా..
- ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల పేరిట గత కొద్ది రోజులుగా పార్వతీపురంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. చిరువ్యాపారులు తమ ఉపాధిని కోల్పోతున్నారు.
- పార్వతీపురం మండలంలోని అనేక గ్రామాల్లో సాయంత్రం సమయాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. గాలులు వీచే సమయంలో అయితే గంటల తరబడి ఆయా ప్రాంతాలు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు విద్యుత్ లైన్ల నిర్వహణ పేరిట కూడా కోతలు విధిస్తున్నారు. దీంతో మండలవాసులతో పాటు చిరు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గరుగుబిల్లి, నాగూరు సబ్‌స్టేషన్ల పరిధిలో అనధికార కోతలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి సమయం వరకు ఆరు నుంచి పది దఫాలు అర గంటకు పైగా సరఫరా నిలిపేస్తున్నారు. విద్యుత్ కోతలకు సంబంధించి పైనుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఏదో కారణం చెప్పి సరఫరా బంద్ చేస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత లేకపోయినప్పటికీ ఉ్కపోతతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక రైతులకు సంబంధించి రోజులో నాలుగు గంటల లోపే సరఫరా చేస్తున్నారు. దీంతో పంటలు ఎండుతున్నాయి. దీనిపై ఏఈ బి.శంకరరావును వివరణ కోరగా.. ‘అనధికారికంగా కోతలు విధించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరెంట్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతులు నిర్వహించిన సమయంలో ముందస్తుగా సమాచారం అందించి సరఫరా నిలుపుదల చేస్తున్నాం. ప్రధానంగా స్తంభాలకు ఆనుకుని తొండలు సంచరించడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. గాలులతో వర్షం కురిసిన సమయంలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే వెంటనే పరిశీలించి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
- భామిని మారుమూల మండలం కావడంతో పాలకొండ, సీతంపేట, కొత్తూరు మీదుగా భామిని 33 కేవీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే పాలకొండ, సీతంపేట, కొత్తూరు మండలాల్లో ఈదురుగాలులతో చిన్నపాటి వర్షం కురిసినా.. భామిని మండలానికి కరెంట్ ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతవాసులు గంటల తరబడి చీకట్లోనే ఉండాల్సి వస్తోంది.
- గాలి వీచినా, ఆకాశం మేఘావృతమైనా.. మక్కువ, దుగ్గేరు, వెంకటబైరిపురం, శంబర గ్రామాల సబ్ ఫీడర్‌ల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో సుమారు 50 గ్రామాలకు కరెంట్ ఉండడం లేదు.
- గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో వేళాపాలా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఉదయం పూట మూడు, నాలుగు గంటల పాటు మూడు దఫాలుగా కరెంట్ సరఫరాను నిలిపేస్తున్నారు. రాత్రిపూట రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులకు వివరణ కోరినా.. సరైన సమాధానం చెప్పడం లేదు.
Updated Date - May 26 , 2024 | 12:06 AM