సహకార సంఘాలు.. సరికొత్త బాటలో..
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:06 AM
కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు పలు ప్రణాళికలు రూపొందిస్తోంది.
శరవేగంగా కంప్యూటరీకరణ
రైతులు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
గరుగుబిల్లి, ఆగస్టు 23 : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) నిర్వీర్యమయ్యాయి. వాటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. రైతులకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందేవి కావు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు పలు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సంఘాల పరిధిలో కంప్యూటరీకరణ ప్రారంభమైంది. రైతుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఎటువంటి లోపాలు, తప్పులకు అవకాశం లేకుండా పక్కాగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 35 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వాటిల్లో 89,668 మంది సభ్యులు ఉన్నారు. సభ్యత్వం ఉన్నవారికి సంఘం పరిధిలో వ్యవసాయ రుణాలతో పాటు పలు రకాల రుణాలు మంజూరు చేస్తున్నారు. కాగా జిల్లాలో సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సీఈవోలు, సిబ్బంది కేవైసీ చేయడంలో నిమగ్నమయ్యారు. సంఘ పరిధిలో సభ్యత్వం పొందిన వారి పూర్తి సమాచారం పొందుపరుస్తున్నారు. సంఘ పరిధి నుంచి ఎంతమేర రుణం పొందారు, భూవిస్తీర్ణం ఎంత ఉందన్న వివరాలు కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక..
జిల్లాలో పలు సంఘాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. వాటిల్లో పార్వతీపురం పీఏసీఎస్, బందలుప్పి, పెదబొండపల్లి, బలిజిపేట, పలగర, గలావిల్లి, కురుపాం పరిధిలో బీజే పురం, చినమేరంగి, కురుపాం, దుడ్డుఖల్లు, గరుగుబిల్లి, కొమరాడ, కృష్ణపల్లి, రావివలస, శివిని, సాలూరు, చెముడు, కేసలి, మక్కువ, మామిడిపల్లి, మోసూరు, పెదపదం, శంబర, శివరాంపురం, వెంకటబైరిపురం, సీతానగరం, అజ్జాడ, అంటిపేట, బూర్జ, గెడ్డలుప్పి, గుచ్చిమి, కాశీపేట, మరిపివలస, పాపమ్మవలస, ఆర్.వెంకమ్మపేట, తామరఖండి సంఘాలు ఉన్నాయి.
- పీఏసీఎస్‌ల స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రైతుల సమాచారాన్ని జాతీయ స్థాయిలో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా పారదర్శకతను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. కంప్యూటరీకరణతో రైతుల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. సంఘాల కార్యకలాపాల సామర్థ్యం పెంచడంతో పాటు రుణాలు మంజూరు, పంపిణీ, లావాదేవీలు, నిర్వహణ ఖర్చులు, చెల్లింపుల్లో సమస్యలను తగ్గించడం వంటి విధానాలు అమలు కానున్నాయి. రుణాల రీషెడ్యూల్‌కూ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రధానంగా మాన్ అకౌంటింగ్ సిస్టమ్ (సీఏఎస్), మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)ల అమలు ద్వారా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకుల మాదిరిగా పీఏసీఎస్‌లు రూపుదిద్దుకో నున్నాయి. కాగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పూర్తి సమాచారాన్ని పొందుపర్చేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించారు.
ఆక్టోబరు 2 నుంచి ఆన్‌లైన్ వ్యవస్థ
పీఏసీఎస్‌ల నుంచి తీసుకున్న రుణానికి ఎంత చెల్లించాం? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? అనేదానిపై రైతుల్లో ఇప్పటి వరకూ సృష్టత ఉండేది కాదు. అంతా మాన్యువల్‌గా జరిగేది. సిబ్బంది ఎంత చెల్లించమంటే అంతే చెల్లించడం తప్ప, ఒక రసీదు కూడా ఇచ్చే సందర్భాలు లేవు. మరోవైపు బినామీ రుణాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో పీఏసీఎస్‌ల కంప్యూటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకనుగుణంగా ఆన్‌లైన్‌లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ జరుగుతుంది. అక్టోబరు 2 నుంచి ఆన్‌లైన్ వ్యవస్ధ అమలు కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
గడువులోగా పూర్తి చేస్తాం
ఈ నెల 30లోగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తి చేస్తాం. 35 సంఘాల పరిధిలో 89,668 మంది సభ్యులకు గాను 25,089 మందికి పైగా సమాచారం పొందుపర్చాం. సంఘాల పరిధిలో సిబ్బంది కొరత ఉంటే సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోనున్నాం. కంప్యూటరీకరణపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నాం. గతంలో ఉన్న వారి వివరాలనే నమోదు చేస్తున్నాం. నూతనంగా సభ్యత్వం పొందిన వారికి అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వ ఆదేశాలివ్వాల్సి ఉంది.
- పి.శ్రీరామ్మూర్తి, జిల్లా సహకార అధికారి, పార్వతీపురం మన్యం
Updated Date - Aug 24 , 2024 | 12:06 AM