అరకు ఎంపీ స్థానం.. వైసీపీ కైవసం
ABN, Publish Date - Jun 05 , 2024 | 01:01 AM
అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై విజయం సాధించారు.
పార్వతీపురం, (ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి మెజార్టీ కొనసాగిస్తూ చివరి వరకు వెళ్లారు. 22 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి తనూజారాణి 50,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు 4,77,005 ఓట్లు రాగా, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు 4,26,425 ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు 1,23,129ఓట్లు వచ్చాయి. నోటాకు 50,205ఓట్లు వచ్చాయి. తనూజారాణి ఎంపీగా ఎన్నికైనట్లు అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నిశాంత్‌కుమార్ ధ్రువీకరణ పత్రం అందించారు. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని కొత్తపల్లి గీత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Updated Date - Jun 05 , 2024 | 01:01 AM