వీడని వరద
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:03 AM
జిల్లాలో వర్షాలు ఆగినప్పటికీ ఇంకా వరద గండం వీడలేదు. గెడ్డలు, వాగులు, వంకల్లో ప్రవాహ తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గలేదు. పంట పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాలు అధికంగానే ఉన్నాయి.
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, గెడ్డలు
నిండుగా చెరువులు.. నీటిలోనే పంటలు
ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం
అయినా జిల్లాలో వర్షాలు పడే అవకాశం
పార్వతీపురం, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాలు ఆగినప్పటికీ ఇంకా వరద గండం వీడలేదు. గెడ్డలు, వాగులు, వంకల్లో ప్రవాహ తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గలేదు. పంట పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాలు అధికంగానే ఉన్నాయి. ఇంకా వరద ఉధృతి పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు వారు నష్టం అంచనాల్లో తలమునకలయ్యారు. వాయుగుండం కారణంగా జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేని వాన కురిసిన సంగతి తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కూడళ్లు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు, చెరువులు, వాగులు, వంకలకు వరద పోటెత్తగా.. జిల్లాలో పలుచోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. అరటి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ప్రస్తుతం వాయుగుండం ఒడిశాలో తీరం దాటినప్పటికీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల వద్ద నీటి మట్టాలను పరిశీలించారు. వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రిజర్వాయర్ల గేట్లు తెరిచి దిగువకు నీటిని విచిడిపెట్టారు. మరోవైపు నదీతీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా జిల్లాలో అత్యధికంగా భామిని మండలంలో 79.6 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా మక్కువ మండలంలో 5.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టుల నీటి నిల్వలు ఇలా..
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు వద్ద ఎఫ్‌ఆర్‌ఎల్ 105 మీటర్లు ఉండాల్సి ఉండగా, 104.7 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. వట్టిగెడ్డ వద్ద 121 మీటర్లకు గాను 118 మీటర్లు, పెద్దగెడ్డలో 213 మీటర్లకు 212.4మీటర్లు, వీఆర్‌ఎస్ వద్ద 161 మీటర్లుకు గాను 159.55 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి.
వివిధ చోట్ల ఇలా...
- మక్కువ మండలం శంబర గ్రామంలో 15 ఎకరాల్లో అరటి, జియమ్మవలసలో ఒకటి, పాలకొండలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బాసంగిలో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
- పాలకొండ మండలంలో ఎల్‌ఎల్‌పురంలో ఓ పూరిల్లు కూలిపోవడంతో ఆ కుటుంబ సభ్యులకు సచివాలయంలో ఆశ్రయం కల్పించారు.
- భారీ వర్షాలకు అలికాం-బత్తిలి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దాని మరమ్మతుల కోసం సుమారు రూ.60 లక్షలతో ప్రతిపాదనలు వెళ్లాయి.
ముంపులో పంట పొలాలు
పాలకొండ: వాయుగుండం కారణంగా జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. పాలకొండ మండలంలోని జంపరకోటగెడ్డ, ఓనిగెడ్డ, రావాడ గెడ్డ, గజిలిగెడ్డలు ఉధృతంగా ప్రవహించడంతో వీపీరాజుపేట, తుమరాడ, తంపటాపల్లి, అర్థలి, మంగళాపురం, బుక్కూరు, గోపాలపురం, పాలకొండలో వరి పొలాలు పూర్తిగా ముంపునకు గురై చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు రోజులు ఇలానే ఉంటే పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా పాలకొండ-వీరఘట్టం ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కమిటీలు
పార్వతీపురం, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలను దీటుగా ఎదుర్కోవడానికి కమిటీలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 86 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు. అధికారుల సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం గొప్ప విషయమాన్నరు. అదే స్ఫూర్తితో ఇక ముందు కూడా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు అంచనాలు తయారు చేసి పంపించాలని తెలిపారు. వసతిగృహాల్లో విద్యార్థులకు వేడి, వేడి ఆహారం అందించాలన్నారు. వాగులు, వంకలు పొంగినప్పుడు రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం అందించాలని చెప్పారు. పల్లెల్లో పారిశుధ్య నిర్వహణలో స్థానికులను భాగస్వాములుగా చేయాలని సూచించారు. ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. సంబంధిత గ్రామ సెక్రటరీ బాధ్యులవుతారని స్పష్టం చేశారు.
నాగావళికి పోటెత్తిన వరద
గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళికి సోమవారం వరద పోటెత్తింది. వాయుగుండం కారణంగా జిల్లాతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నదిలో 5,100 క్యూసెక్కులు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు 2,200 క్యూసెక్కులను విడుదల చేశారు. మరోవైపు ఎడమ ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులు, పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి కాలువ నుంచి 40 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గండ్లు పడే అవకాశం ఉండడంతో కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీరు నిలుపుదల చేశారు. ఒడిశాలో వర్షాలు కురుస్తుండడం వల్ల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేశామని డీఈ టి.రఘునాఽథనాయుడు, జేఈలు కె.శ్రీనివాసరావు, బి.కిషోర్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు.
కోతకు గురవుతున్న ఒడ్డు
అధిక వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న ఒడ్లు కోతకు గురవుతున్నాయి. దీంతో నదీతీర ప్రాంతవాసులఉ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద ప్రవాహం పెరిగితే పంట పొలాలు, సమీపంలో ఉన్న రహదారి దెబ్బతినే అవకాశం ఉందని, పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయని వారు వాపోతున్నారు. వాస్తవంగా కుడి, ఎడమ ఒడ్లు కోతకు గురికాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమేర పనులు చేపట్టారు. అయితే బిల్లులు చెల్లించకపోవడంతో పనులకు బ్రేక్ పడింది. దీంతో ఏటా వర్షాకాలంలో కోతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.
నిలకడగా వంశధార
భామిని: నేరడి వద్ద వంశధార నదిలో వరద నిలకడగానే ఉంది. అయితే ఎగువున ఉన్న ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం రెవెన్యూ సిబ్బంది నదీతీర ప్రాంతవాసులు అప్రమత్తం చేశారు. అయితే ఇప్పటికీ నులకజోడు, బురుజోల, వడ్డంగి, పసుకుడి చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉధృతంగా సువర్ణముఖీ
సాలూరు రూరల్: ఏవోబీలో ఒడిశా కొండల్లో సోమవారం భారీ వర్షాలు కురవడంతో మండల పరిధిలో సువర్ణముఖీ నదికి వరద పోటెత్తింది. దీంతో మామిడిపల్లి వంతెన వద్ద పొలాలు నీట మునిగాయి. మరోవైపు వెంగళరాయసాగర్ నుంచి 600 క్యూసెక్కులను కిందకు విడుదల చేశారు.
గుమ్మగెడ్డ వద్ద గండి
సీతంపేట రూరల్: భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో గొయిది సమీపంలో ఉన్న గుమ్మగెడ్డ రిజర్వాయర్ కుండి వద్ద గండి పడింది. దీంతో సుమారు 20 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గండి పూడ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెద్దగెడ్డ నీరు విడుదల
పాచిపెంట : వాయుగుండం కారణంగా రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పెద్దగెడ్డ జలాశయంలో నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం సాయంత్రం స్పిల్‌వే ద్వారా 520 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాలువ ద్వారా 30 క్యూసెక్కులను విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే.. దిగువకు మరిన్ని క్యూసెక్కులు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జంఝావతిని పరిశీలించిన కలెక్టర్
జియ్యమ్మవలస / కొమరాడ : కొమరాడ మండలంలో సోమవారం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా జంఝావతి ప్రాజెక్టును సందర్శించారు. జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి, ప్రస్తుత నీటి మట్టం పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రబ్బరు డ్యామ్ దెబ్బతినకుండా ముందస్తుగా మూసివేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కాలువల ద్వారా సాగునీరందిస్తామని తెలిపారు. అనంతరం పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. 12 స్లాబ్‌ల్లో ఏడు పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. ఈ వంతెనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆతర్వాత ఆయన కళ్లికోట ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఆర్డీవో కె.హేమలత, జంఝావతి ప్రాజెక్టు ఎస్‌ఈ ఎస్.జగదీశ్వరరావు, డీఈ ఎ.ఢిల్లేశ్వరరావు, ఏఈ అభిషేక్ వర్మ, తహసీల్దార్ రమేష్‌కుమార్, పీఆర్ ఇంజనీరింగ్ అధికారి పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
1
Updated Date - Sep 10 , 2024 | 12:03 AM