16 వసతిగృహాలకు.. ఏడుగురే!
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:33 PM
జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహాలకు సంక్షేమాధికారుల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. గత ఐదేళ్లుగా ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతోంది. ‘మన్యం’లోని 16 వెనుకబడిన తరగతుల వసతి గృహాలకు ఏడుగురు సంక్షేమాధికారులే ఉన్నారు. ఒక్కొక్కరూ మూడు అంతకంటే ఎక్కువ హాస్టళ్లను చూసుకోవాల్సి వస్తోంది.
ఒక్కొక్కరిపై మూడు అంతకంటే ఎక్కువ వసతి గృహాల బాధ్యతలు
కొరవడుతున్న పర్యవేక్షణ
గాడి తప్పుతున్న మెనూ
ఐదేళ్లలో భర్తీకి చర్యలు చేపట్టని వైసీపీ ప్రభుత్వం
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
జియ్యమ్మవలస: జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహాలకు సంక్షేమాధికారుల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. గత ఐదేళ్లుగా ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతోంది. ‘మన్యం’లోని 16 వెనుకబడిన తరగతుల వసతి గృహాలకు ఏడుగురు సంక్షేమాధికారులే ఉన్నారు. ఒక్కొక్కరూ మూడు అంతకంటే ఎక్కువ హాస్టళ్లను చూసుకోవాల్సి వస్తోంది. దీంతో పర్యవేక్షణ కొరవడగా.. నిర్వహణ, మెనూ గాడి తప్పుతోంది. గత వైసీపీ ప్రభుత్వం నియామకాలకు చర్యలు చేపట్టకపోవడంతో వసతిగృహాలకు ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో జియ్యమ్మవలస, రావివలస, చినమేరంగి, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం (గర్ల్స్), పార్వతీపురం (బాలురు), నర్సిపురం, బూర్జి, పాచిపెంటలో పది బీసీ ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 3 నుంచి 10వ తరగతుల వరకు 496 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్, పాలిటెక్నికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం పాలకొండ, చినమేరంగి (బాలురు), చినమేరంగి (బాలికలు), పార్వతీపురం (బాలురు), పార్వతీపురం (బాలికలు), సాలూరు (బాలురు)లో పోస్ట్ మెట్రిక్ బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 387 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా 16 వసతి గృహాలకు 16 మంది సంక్షేమాధికారులు ఉండాలి. కానీ ఏడుగురు మాత్రమే ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి. దీంతో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయకపోవడంతో చివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వార్డెన్‌ను జిల్లాలో ఓ బీసీ వసతి గృహానికి ఇన్‌చార్జిగా నియమించారు.
అడ్జెస్ట్‌మెంట్ ఇలా...
- పాలకొండ బాలురు కాలేజీ హాస్టల్‌కు సీతంపేట టీడబ్ల్యూఏ స్కూల్ సంక్షేమాధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
- సాలూరు బాలికల వసతి గృహంలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న ప్రమీల అనే సంక్షేమాధికారినిని పాచిపెంట బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జిగా నియమించారు.
- పార్వతీపురం బీసీ హాస్టల్ సంక్షేమాధికారి ఎస్.సాంబయ్యకు బూర్జ, నర్సిపురం బీసీ హాస్టళ్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా ఆయన మూడు వసతి గృహాలను పర్యవేక్షించాల్సి ఉది.
- చినమేరంగి కాలేజీ హాస్టల్ సంక్షేమాధికారిణి ఎన్.సభ్రదకు చినమేరంగి బాలికలు, పార్వతీపురం బాలికల కాలేజీ వసతి గృహాలకు ఇన్‌చార్జిగా నియమించారు.
- రావివలస బీసీ హాస్టల్‌కు నాగేశ్వరరావు, పార్వతీపురం బాలికల హాస్టల్‌కు పి.పద్మజ, బాలురు హాస్టల్‌కు హారిక రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇన్‌చార్జి బాధ ్యతలు అప్పగించలేదు.
- గరుగుబిల్లి బీసీ వసతి గృహ సంక్షేమాధికారి ఎన్.శ్రీనివాసరావుకు జియ్యమ్మవలస, చినమేరంగి, కురుపాం వసతి గృహాలకు ఇన్‌చార్జిగా నియమించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాలకు ఒక్క అధికారి ఎలా వెళ్లగలరు.. ఎలా పర్యవేక్షించగలరన్నది ఉన్నతాధికారులకే తెలియాలి. దీనిపై కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
భర్తీకి సన్నాహాలు
వసతి గృహాల్లో సంక్షేమాధికారుల కొరత విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. మెగా డీఎస్సీతో కచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. అంతవరకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
- ఎస్.కృష్ణ, ఇన్‌చార్జి డీబీసీడబ్ల్యూవో, పార్వతీపురం మన్యం
Updated Date - Sep 10 , 2024 | 11:33 PM