అధ్వానంగా ఎ.శనివారం రోడ్డు
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:15 AM
మండలంలోని జాజుపాలెం-అంజలి శనివారం ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి ఛిద్రమైంది. దీంతో ఆదివాసీలు ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రూ.రెండు కోట్ల ఉపాధి నిధులు మంజూరు
నిధుల విడుదలలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన
ప్రస్తుత వర్షాలకు దారుణంగా తయారైన రహదారి
చింతపల్లి, జూలై 30: మండలంలోని జాజుపాలెం-అంజలి శనివారం ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి ఛిద్రమైంది. దీంతో ఆదివాసీలు ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మండలంలోని జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు నాలుగు కిలోమీటర్లు. వర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఆదివాసీలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీనిని గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఉపాధి హామీ పథకంలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించింది. 2019 డిసెంబరులో రూ.రెండు కోట్ల మంజూరయ్యాయి. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ 2020లో పనులు ప్రారంభించాడు. అయితే నిధులను వైసీపీ ప్రభుత్వం మంజూరు చేయకుండా కాలయాపన చేసింది. ఎట్టకేలకు గత ఏడాది రూ.1.3 కోట్లు విడతల వారీగా విడుదల చేసింది. దీంతో కాంట్రాక్టర్ 500 మీటర్లు సీసీ రోడ్లు నిర్మించగా.. మరో మూడు కిలోమీటర్లు జీఎస్‌బీ లేయర్ వేశాడు. అయితే మలివిడత నిధులు విడుదల జాప్యం కావడం వల్ల రహదారి నిర్మాణాలు నేటి వరకు పూర్తికాలేదు.
ప్రయాణం సాహసమే..
అంజలి శనివారం రహదారిపై ప్రయాణమంటే సాహసమేనని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో 1.5 కిలోమీటర్లు ఘాట్ ఉన్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డు కోతకు గురైంది. పలుచోట్ల జీఎస్‌బీ లేయర్ కొట్టుకుపోయింది. రహదారిపై అడుగడుగునా భారీ గోతులు ఏర్పడ్డాయి. పలుచోట్ల రహదారి ఆనవాళ్లు కనిపించలేదు. కార్లు, ఆటోలు గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. కేవలం జీపులు, ద్విచక్ర వాహనాల్లో మాత్రమే ప్రయాణించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. అధిక వర్షం కురిస్తే రహదారి బురదమయమైపోతుంది. రోగులు, గర్భిణులను డోలిపై ప్రధాన రహదారి వరకు తరలించాల్సి వస్తుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంజలి శనివారం రహదారి నిర్మాణాలు నూతన ఎన్డీయే కూటమి ప్రభుత్వమే పూర్తిచేయాలని ఆదివాసీలు కోరుతున్నారు.
రహదారి పూర్తి చేయాలి
పేట్ల పోతురాజు, సీపీఐ మండల కార్యదర్శి
ఎ.శనివారం రహదారి పూర్తికాకపోవడం వల్ల ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ రహదారిని పూర్తి చేయలేదు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలి.
Updated Date - Jul 31 , 2024 | 12:15 AM