కేజీహెచ్ కథ మారేనా?
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:51 AM
ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జి ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం
సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది
వివిధ విభాగాల్లో తాగునీటికి ఇక్కట్లు
వేధిస్తున్న పరికరాల కొరత
ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పాలనలోనే ఆస్పత్రి
శిథిలావస్థలో అనేక భవనాలు
నేడు ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన
విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జి ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. శిథిల భవనాలు, పరికరాల కొరత, ఇతర సమస్యలు ఓవైపు పీడిస్తుండగా... మరో వైపు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం... రోగులకు సమయానికి అందని వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలకు ఎదురుచూపులు... ఇలా అనేక అవస్థల మధ్య ఆస్పత్రి నడుస్తోంది. దీనికితోడు గత కొద్ది నెలలుగా కేజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పర్యవేక్షణలోనే నడుస్తుండడం మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం కేజీహెచ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఇక్కడి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రోగులు, వారి బంధువులు ఆశిస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కేజీహెచ్‌కు ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. అయితే ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కీలక విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తుండడం రోగులకు సమస్యగా మారింది. ఆస్పత్రిలో 30కిపైగా విభాగాలుండగా, సుమారు పదికిపైగా విభాగాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. సూపర్ స్పెషాలిటీ వంటి విభాగాల్లో అధునాతన వైద్య పరికరాలకు కొరత పీడిస్తోంది. పెరుగుతున్న రోగులు సంఖ్యకు అనుగుణంగా విభాగాలను, వార్డులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. నర్సింగ్, ఇతర సిబ్బంది సంఖ్యకూడా తక్కువగానే ఉంది.
శిథిలావస్థలో భవనాలు..
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కేజీహెచ్‌లోని అనేక విభాగాలకు చెందిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షాలు కురిస్తే నీరు కారుతున్నాయి. కొన్ని విభాగాల గోడలపై మొక్కలు మొలిచాయి. ఈ భవనాల వల్ల రోగులు, వైద్యులకు ప్రమాదం. గత ప్రభుత్వం నాడు - నేడు పథకంలో భాగంగా నూతన భవనాలను నిర్మిస్తామని హామీ ఇవ్వడం మినహా రూపాయి విదల్చలేదు. ఫలితంగా సమస్యకు పరిష్కారం లభించలేదు.
సిబ్బందిపై పర్యవేక్షణ నిల్
వైద్యులు, సిబ్బందితోపాటు వార్డు బాయ్‌లు, ఇతర సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తారన్న ఆరోపణలున్నాయి. చాలా మంది వైద్యులు విధి నిర్వహణ సమయంలో తమ క్లినిక్‌లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వీరి వ్యవహారశైలిలో మార్పు కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బంది రోగులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరు డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, ఇవ్వకుంటే సేవలు అందించని పరిస్థితి నెలకొంది. కీలక మందుల సరఫరాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా సమయాల్లో రోగులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో మందులు, శస్త్రచికిత్స పరికరాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా కేజీహెచ్ వివాదాలకు కేంద్రంగా మారింది.
ఇబ్బందులకు చెక్ చెప్పేలా..
ఆస్పత్రిలోని క్యాజువాల్టీ నుంచి, వార్డుల్లో చేరిన తరువాత వరకు రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వార్డుబాయ్‌లు సక్రమంగా పనిచేయకపోవడం, డబ్బులు డిమాండ్ చేయడం, లేదంటే రోగిని పట్టించుకోకపోవడం లాంటి సంఘటనలున్నాయి. వార్డుల్లో చేరేందుకు, పరీక్షల నిమిత్తం వార్డుల నుంచి ల్యాబ్‌లు, ఇతర పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు రోగుల సహాయకులే వీల్‌చైర్లు, స్ట్రెచర్లపై తరలించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు విమర్శిస్తున్నారు. అడపాదడపా చర్యలు తీసుకున్నా సిబ్బంది పని తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
తాగు నీటికీ సమస్య..
కేజీహెచ్‌లోని అనేక విభాగాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కూలర్లు నిర్వహణ లేక పనిచేయడం లేదు. దీంతో రోగుల బంధువులు బయటి నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని ఆర్వో ప్లాంటు వద్ద నీటి సరఫరా ఆశించినస్థాయిలో జరగడం లేదు. దీనికితోడు మరుగుదొడ్లు అధ్వానంగా మారడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. నిర్వహణను సిబ్బంది పట్టించుకోకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో రోగులతో పాటు వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు.
మంత్రి పర్యటనపై ఆశలు
ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారిగా సత్యకుమార్ యాదవ్ కేజీహెచ్‌కు రానున్నారు. కేజీహెచ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెడతారని, వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి తోడు ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలను అధికారులు మంత్రికి నివేదించనున్నారని సమాచారం.
నేడు జిల్లాకు ఆరోగ్యశాఖా మంత్రి
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 11.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్థానికంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేజీహెచ్‌కు చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి విజయవాడ వెళతారు.
Updated Date - Jul 15 , 2024 | 12:51 AM