ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విశాఖ ఓటర్లు ఎవరి వైపు?

ABN, Publish Date - May 13 , 2024 | 01:25 AM

వైసీపీ ప్రభుత్వ పాలనపై ఓటర్లు తీర్పు ఇచ్చే సమయం వచ్చింది.

ఆలోచించి ఓటు వేయాల్సిన తరుణం

పోటీ రసవత్తరం

ఎంపీ అభ్యర్థులుగా కూటమి నుంచి ఎం.శ్రీభరత్‌, వైసీపీ తరపున బొత్స ఝాన్సీ

అసెంబ్లీ స్థానాల్లో ముఖాముఖి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ పాలనపై ఓటర్లు తీర్పు ఇచ్చే సమయం వచ్చింది. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నం. గత ఐదేళ్లలో పరిశ్రమలేవీ రాకపోగా...ఉన్నవి వెళ్లిపోతున్నాయి. భవన నిర్మాణ రంగం కుదేలైంది. కూలీలకు పనులు లేవు. భూములకు రక్షణ లేదు. ప్రశాంత విశాఖ గంజాయి, డ్రగ్స్‌ కేంద్రంగా మారిపోయింది. పర్యాటక అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటు ఎవరికి వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఓటుతోనే ఐదేళ్ల భవిష్యత్తును రూపొందించుకోవాలి.

ఎంపీ ఎన్నికే కీలకం

జిల్లాలో విశాఖపట్నం లోక్‌సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు (ఒకటి పాక్షికం...పెందుర్తి) జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ), వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. విశాఖపట్నంలో పాగా వేయాలని ఎప్పటి నుంచో జగన్‌ యత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లోనే తల్లి విజయలక్ష్మిని విశాఖ ఎంపీగా పోటీ చేయించారు. ఆమె బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు, గీతం అధ్యక్షులు ఎం.శ్రీభరత్‌ పోటీ చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ తరపున ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన తరఫున మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. చతుర్ముఖ పోటీలో శ్రీభరత్‌పై సుమారు నాలుగు వేల ఓట్ల తేడాతో ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. జనసేన అభ్యర్థికి సుమారు 2,75,000 లక్షల ఓట్లు లభించడంతో శ్రీభరత్‌ ఓటమి పాలయ్యారని, లేనిపక్షంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది ఉండేవారనే రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి అభ్యర్థిగా మళ్లీ శ్రీభరతే ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ ఝాన్సీ పోటీ పడుతున్నారు. ఇంకా బరిలో కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా వీరి మధ్యే పోటీ. శ్రీభరత్‌ విద్యావంతుడు. ఉధృతంగా ప్రచారం చేశారు. గెలిస్తే ఏమి చేస్తానో ప్రజలకు వివరంగా చెప్పారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల, యువతకు ఉపాధి, డ్రగ్స్‌పై ఉక్కు పాదం, భూముల పరిరక్షణ, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధి, మోడల్‌గా విశాఖ పార్లమెంటు అభివృద్ధి వంటి హామీలు ఇచ్చారు. ఈ ప్రాంత సమస్యలను బలంగా వినిపిస్తానని నమ్మకం కలిగించారు. నగరంలోని అన్ని వర్గాలు ఆయన మాటలను విశ్వసిస్తున్నాయి. ఈసారి బీజేపీ, జనసేన కూడా తోడు కావడంతో బలం మరింత పెరిగింది. ఇక వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి పార్టీ బలంపైనే ఆధారపడ్డారు. ఆమె విజయనగరం జిల్లా నుంచి గతంలో ఎంపీగా గెలిచినా విశాఖ ప్రజలకు పెద్దగా తెలియదు. తన గళాన్ని కూడా అందరికీ వినిపించలేకపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో పెరిగిన భూ దందాలు, ప్రాజెక్టుల హస్తగతం, పర్యాటక ప్రాజెక్టుల విధ్వంసం, నిత్యావసర సరకుల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపు, ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు...ఇవన్నీ వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామిక, వ్యాపార, ఉద్యోగ వర్గాలు ఏవీ వైసీపీని కోరుకోవడం లేదు. శ్రీభరత్‌ భారీ మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం కూటమిలో వ్యక్తమవుతోంది.

తూర్పున ఉదయించే సూరీడు ఎవరో?

తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు నాలుగోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అక్కడ ఆయన్ను పడగొట్టడమే లక్ష్యంగా వైసీపీ శ్రీణులు ఐదేళ్లుగా పనిచేస్తున్నాయి. వైసీపీ సమన్వయకర్తలుగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌, అక్కరమాని విజయనిర్మల కూటమిలోకి వచ్చేశారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితు లైనప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు చేశారు. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

పశ్చిమలో నువ్వా..నేనా?

పశ్చిమ నియోజకవర్గంలో పోటీ నువ్వా?, నేనా? అన్నట్టుగా జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు, వైసీపీ తరపున ఆడారి ఆనంద్‌కుమార్‌ పోటీ పడుతున్నారు. గణబాబు ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్‌ సాధించినట్టు అవుతుంది. ఆయనకు నియోజకవర్గంలో అన్ని సమస్యలపైన అవగాహన, వాటిని సాధించుకునే నేర్పు ఉంది. వైసీపీ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన్ను అధిష్ఠానం పశ్చిమ ఇన్‌చార్జిగా నియమించింది. అప్పటినుంచి ఆయన నియోజక వర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు.

ఉత్తరంలో రాజుల మధ్యే యుద్ధం

ఉత్తర నియోజకవర్గంలో కూటమి తరఫున విష్ణుకుమార్‌రాజు పోటీ చేస్తున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఏ పార్టీ సహకారం లేకపోవడంతో బీజేపీ ఓట్లనే సాధించగలిగారు. ఈసారి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అటు టీడీపీ, ఇటు జనసేన సహకరిస్తున్నాయి. అయితే వైసీపీ తరఫున పోటీలో ఉన్న కేకే రాజు గట్టి పోటీ ఇస్తున్నారు. కేకే రాజు గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో గంటా చేతిలో ఓడిపోయారు. అయినా ఈ ఐదేళ్లూ ఆయనే ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. ఇక్కడ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఇక్కడ జై భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

దక్షిణంలో మారిన గాలి

దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవలె జనసేనలో చేరారు. బలమైనా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అక్కడ టీడీపీ నుంచి పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ, వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ బాగా సహకరిస్తున్నారు. వంశీ మొదట్లో కొంత వెనకబడి ఉన్నా ఆ తరువాత స్పీడ్‌ అందుకొని దూసుకుపోయారు. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. కార్పొరేటర్లతో విభేదాలు, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత...తదితరాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందంటున్నారు.

గాజువాకలో పల్లా హవా

గాజువాక నియోజకవర్గంలో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు పోటీ పడుతుండగా, వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బరిలో దిగారు. పల్లా స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అండగా ఉన్నారు. కార్మికులు ఆయన్ను విశ్వసిస్తున్నారు. గతంలో కూడా ఆయన గాజువాక నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రిగా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదనే విమర్శ ఉంది. పవన్‌ కల్యాణ్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడంతో సొంత సామాజిక వర్గం నుంచి కూడా సహకారం లేదంటున్నారు.

భీమిలి మిత్రుల మధ్య వార్‌

భీమిలి నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు పోటీ పడుతున్నారు. ఒకరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు కాగా మరొకరు గంటా శ్రీనివాసరావు. ఇద్దరూ ఒకప్పుడు మిత్రులు. ఒకే పార్టీలో చాలాకాలం కలసి పనిచేశారు. ఐదేళ్ల నుంచి వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు, మంచితనం గెలిపిస్తాయని అవంతి చెబుతుంటే...తన విజయం ఖాయమైపోయిందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. భీమిలి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

పెందుర్తిలో..

పెందుర్తి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు ప్రత్యర్థిగా జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పోటీలో ఉన్నారు. అదీప్‌రాజ్‌ ఈ ఐదేళ్లలో భూ దందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కూటమి మేనిఫెస్టోకు ప్రజలు ఆకర్షితులు కావడంతో పంచకర్ల రమేశ్‌బాబుకు కలిసొస్తుందని అనుకుంటున్నారు.

Updated Date - May 13 , 2024 | 01:25 AM

Advertising
Advertising