ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగని గ్రావెల్‌ దందా

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:56 AM

జిల్లాలో అనధికార గ్రావెల్‌ తవ్వకాలు, అక్రమ తరలింపు ఇంకా ఆగలేదు. ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే అక్రమ గ్రావెల్‌ దందా కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్థానిక వైసీపీ నాయకులు అన్ని పార్టీల నేతలను కలుపుకుపోయి ఎప్పటిలాగానే గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అనకాపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గ్రావెల్‌తో పట్టుబడిన లారీలు

- ప్రభుత్వం మారినా పంథా మార్చుకోని వైసీపీ నేతలు

- కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు, రవాణా

- పట్టించుకోని అధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అనధికార గ్రావెల్‌ తవ్వకాలు, అక్రమ తరలింపు ఇంకా ఆగలేదు. ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే అక్రమ గ్రావెల్‌ దందా కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్థానిక వైసీపీ నాయకులు అన్ని పార్టీల నేతలను కలుపుకుపోయి ఎప్పటిలాగానే గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలోని 24 మండలాల్లో గ్రావెల్‌ తవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. స్థానిక రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులకు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై సమాచారం అందుతున్నా, వారి వాటాలు పుచ్చుకొని అక్రమ తవ్వకాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడికక్కడ గ్రావెల్‌ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనకాపల్లి మండలం సంపతిపురం పరిధిలో జగనన్న లేఅవుట్‌ మెరక పనులకు అంటూ గత రెండు నెలలుగా యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్నారు. కొందరు వైసీపీ నాయకులు అనకాపల్లి జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఆవఖండం భూముల్లో ఉన్న ప్రైవేటు లేఅవుట్‌లకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. భట్లపూడి సర్వే నంబర్‌ 1లోని ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామానికి శివారున మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో స్థానిక నాయకుల అండదండలతో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు గత వారం రోజులుగా గుట్టుగా జరుగున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇక్కడ నుంచి సమీపంలో కొప్పాక రైల్వే వంతెన వద్ద నిర్మాణంలో వున్న భారీ ప్రైవేటు లేఅవుట్‌కు గ్రావెల్‌ రవాణా చేసి మెరక పనులు చేస్తున్నారు. రెండు రోజుల కిందట సీతానగరం, వెంకుపాలెం, తగరంపూడి పరిసరాల్లో అనుమతి లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్న రెండు లారీలను అనకాపల్లి రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక నేతలు ఒత్తిడి తేవడంతో మొక్కుబడిగా జరిమానా కట్టించుకొని వదిలేశారు.

అనుమతులు లేకుండానే..

జిల్లాలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదని గనుల శాఖాధికారులు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన లీజు అనుమతుల ప్రకారం గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు రద్దు చేసినట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన గ్రావెల్‌ క్వారీల నిర్వాహకులు గనులు, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలకు జీఎస్‌టీ కింద చదరపు క్యూబిక్‌ మీటరు గ్రావెల్‌ తవ్వినందుకు రూ.100 వరకు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో పలు మండలాల్లో ప్రధానంగా అనకాపల్లి, సబ్బవరం, అచ్యుతాపురం, పరవాడ, కశింకోట మండలాల్లో కొందరు రియల్టర్లు స్థానిక నాయకులతో చేతులు కలిపి ఎటువంటి అనుమతులు పొందకుండానే ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్లో సైతం గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డుకట్టు వేయాలని కోరుతున్నారు. జిల్లాలో గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్న వైనంపై గనుల శాఖ ఏడీ సబ్బారాయుడును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా గ్రావెల్‌ తవ్వకాలకు కొత్తగా ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. సబ్బవరంలో పది మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం కొత్తగా గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అంత వరకు ఎవరికీ గ్రావెల్‌ తవ్వకాలు అనుమతులు లేవని స్పష్టం చేశారు.

Updated Date - Jun 30 , 2024 | 12:56 AM

Advertising
Advertising