కలెక్టర్ బదిలీ
ABN, Publish Date - Jun 23 , 2024 | 01:15 AM
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది.
సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు
జాయింట్ కలెక్టర్‌కు
తాత్కాలికంగా ఇన్‌చార్జి బాధ్యతలు
దాదాపు మూడేళ్లు కలెక్టర్ పనిచేసిన డాక్టర్ ఎ.మల్లికార్జున
విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. నేరుగా సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను బదిలీలు జరుగుతాయని వారం నుంచి చర్చ సాగుతుంది. నాలుగు రోజుల క్రితం సీనియర్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం శనివారం కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖ కలెక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌కు తాత్కాలికంగా కలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌గా ఉన్న మల్లికార్జునను గత ప్రభుత్వం 2021 జూలై 28న విశాఖ కలెక్టర్‌గా నియమించింది. 2012 సివిల్ సర్వీస్ డైరెక్ట రిరక్రూటీ అయిన మల్లికార్జున విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా రెండు సంవత్సరాల 11 నెలలపాటు పనిచేశారు. ఆయన ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడే 2022 ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరిగింది. అప్పుడు మల్లికార్జునను విశాఖ కలెక్టర్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోపాటు ఆయన వీఎంఆర్డీఏ కమిషనర్‌గా రెండేళ్లకుపైగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు.
కేజీహెచ్‌లో సమూల మార్పులు
ఉత్తరాంధ్రలో అతి పెద్ద ఆస్పత్రి కేజీహెచ్‌లో అనేక మార్పులు తీసుకురావడంతో డాక్టర్ మల్లికార్జున ముద్ర ఉంది. స్వతహాగా వైద్యుడైన మల్లికార్జున విశాఖ పరిసరాల్లో పలు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన సీఎస్సార్ నిధుల నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేసి కేజీహెచ్‌లో మౌలిక వసతులు కల్పించారు. ఓపీ కౌంటర్‌తోపాటు పలు విభాగాల ఆధునికీకరణ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ యంత్రాల కొనుగోలు, మార్చురీలో వసతులు పెంపు, రోగుల అటెండెంట్లు ఉండేందుకు పది షెడ్లు నిర్మాణం వంటివి చేపట్టారు. విక్టోరియా ఆస్పత్రి, మానసిక ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో వసతులు పెంచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా సీఎస్సార్ నిధుల నుంచి జిల్లాలో 23 సాంఘిక, బీసీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించారు. కలెక్టర్‌గా తనను కలిసేందుకు వచ్చే వారిలో ప్రతి ఒక్కరి సమస్య వినేవారు. ఈ నేపథ్యంలో పేద వర్గాల కోసం సంజీవని నిధి ఏర్పాటుచేశారు.
దసపల్లా భూముల అప్పగింతపై విమర్శలు
నగరంలో వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూముల విషయంలో కలెక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. దసపల్లా భూములను 2014లో అప్పటి కలెక్టర్ యువరాజ్ ‘22 ఎ’ పెట్టారు. అయితే హైకోర్టు ఆదేశాలలో 2016లో 22 (ఎ) నుంచి తొలగించారు. ఈ భూములను గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీనిపై ఆనేక విమర్శలు వచ్చాయి. ఇక, నగర పరిధిలోని ఎండాడలో వైసీపీ కార్యాలయం కోసం అడ్డగోలుగా నిర్మించిన భారీ భవనానికి అనుమతులు ఇచ్చే విషయంలో వీఎంఆర్‌డీఏ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కలెక్టర్‌పై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేసిందనే ప్రచారం సాగుతుంది.
నేడు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు బాధ్యతలు
బదిలీపై వెళుతున్న కలెక్టర్ మల్లికార్జున ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు.
విశాఖతో చాలా మధురస్మృతులు
మల్లికార్జున
విశాఖ కలెక్టర్‌గా మూడేళ్లు సమర్థంగా పనిచేయడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు. విశాఖపట్నం నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చింది. ఉద్యోగరీత్యా సమర్థంగా పనిచేసేలా ఎన్నో నేర్చించింది. నాకు అనేక మధురస్మృతులు ఇచ్చింది. విశాఖ జిల్లాకు కలెక్టర్‌గా మంచి చేశాననే భావనతో వెళుతున్నా. భవిష్యత్తులో విశాఖకు సేవ చేసే అవకాశం వస్తే సంతోషిస్తా. ఉద్యోగ రీత్యా విశాఖకు మేలు చేసే ఏ సహాయం చేయడానికి అయినా ముందువరుసలో ఉంటా. అందరికీ ధన్యవాదాలు.
Updated Date - Jun 23 , 2024 | 01:15 AM