ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధం
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:45 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవి (స్థానిక సంస్థల కోటా)కి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
షెడ్యూల్ విడుదల
వచ్చే నెల 6న నోటిఫికేషన్
13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ
30న పోలింగ్
సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అమలులోకి ఎన్నికల కోడ్
బదిలీలు, శంకుస్థాపనలకు బ్రేక్
విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవి (స్థానిక సంస్థల కోటా)కి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2021 డిసెంబరులో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాగా వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి ఎన్నికయ్యారు. అయితే వంశీకృష్ణ గత ఏడాది నవంబరులో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ ఫిరాయింపు పేరుతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా శాసన మండలి చైర్మన్ ప్రకటించారు. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకోవలసి ఉంది. దీనికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.
ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్ జారీచేస్తారు. ఆగస్టు 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఉంటుంది. అదే నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల అధికారి అయిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా వారి పదవీ కాలం 2027 డిసెంబరు ఒకటో తేదీ వరకు ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదల చేసినందున ఎన్నికల కోడ్ మూడు జిల్లాలలోను అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టంచేశారు. కోడ్ ముగిసేంత వరకూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఉండవు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉండవు.
Updated Date - Jul 31 , 2024 | 12:45 AM