ఆటోను ఢీకొట్టిన లారీ
ABN, Publish Date - Aug 18 , 2024 | 12:40 AM
ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కలపాక పంచాయతీ పరిధిలోని స్వయంభూవరం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పరవాడ సీఐ ఎస్. బాలసూర్యారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
యువకుడు దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు
పరవాడ, ఆగస్టు 17 : ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కలపాక పంచాయతీ పరిధిలోని స్వయంభూవరం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పరవాడ సీఐ ఎస్. బాలసూర్యారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెదగంట్యాడ మండలం మరడిదాసరిపేటకు చెందిన ధర్మాల యల్లయ్యరెడ్డి (16), దాసరి అనిల్‌కుమార్‌తోపాటు పిట్టవానిపాలెం గ్రామానికి చెందిన కర్రి జనార్దనరెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి ఆటోలో లైటింగ్ సామగ్రిని పరవాడలో ఓ శుభకార్యం వద్ద దించారు. అనంతరం ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా స్వయంభూవరం దుర్గమాంబ ఆలయ సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవింగ్ చేస్తున్న కర్రి జనార్దనరెడ్డి, పక్కనే కూర్చున్న ధర్మాల యల్లయ్యరెడ్డి, ఆటో వెనుక తొట్టిలో కూర్చున్న దాసరి అనిల్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో యల్లయ్యరెడ్డి మృతి చెందారు. మృతుడు ఐటీఐ చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో లైటింగ్ పనులకు వెళ్తుంటాడు. మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారి మృతి
కొత్తూరు, ఆగస్టు 17 : అనకాపల్లి మండలం బవులవాడ గ్రామ సమీపంలో శనివారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారి మృతి చెందినట్టు రూరల్ ఎస్‌ఐ తేజేశ్వరరావు తెలిపారు. బవులవాడ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. దీంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని ఎన్‌టీఆర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తేజేశ్వరరావు చెప్పారు.
Updated Date - Aug 18 , 2024 | 12:40 AM