కమ్యూనిస్టుల కంచుకోటలో టీడీపీ పాగా
ABN, Publish Date - May 04 , 2024 | 01:44 AM
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రమంగా తెలుగుదేశం పార్టీ పాగా వేసింది.
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ జోరు
నియోజకవర్గానికి ఇప్పటివరకూ 15 సార్లు ఎన్నికలు
ఆరు పర్యాయలు విజయ ఢంకా మోగించిన టీడీపీ
నాలుగు సార్లు కమ్యూనిస్టులు...
కాంగ్రెస్ రెండుసార్లు, ప్రజారాజ్యం, వైసీపీ ఒక్కొక్కసారి గెలుపు
ఈసారి కూటమి, వైసీపీ మధ్య పోటీ
కొత్తూరు, మే 2 :
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రమంగా తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. 1983లో తొలిసారిగా కమ్యూనిస్టులతో పోటీపడి విజయఢంకా మోగించింది. ఆ తరువాత అదే ఊపు కొనసాగించింది. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. సీపీఐ నాలుగు పర్యాయాలు, కాంగ్రెస్ రెండుసార్లు, ప్రజారాజ్యం, వైసీపీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి.
అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి 1952లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి కె.గోవిందరావు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించడానికి మిగతా పార్టీలు అన్ని జట్టుకట్టాయి. అప్పుడు కృషికార్ లోక్‌పార్టీ తరపున పోటీ చేసిన భీశెట్టి అప్పారావు ఎన్నికయ్యారు. ఆ తరువాత సీపీఐ తరపున 1962, 1967 ఎన్నికల్లో మళ్లీ గోవిందరావు ఎన్నికయ్యారు. 1972లో జరిగిన ఎన్నికల్లో సమీకరణలు మారాయి. కమ్యూనిస్టు పార్టీలో గోవిందరావు, పీవీ రమణ ముఖ్య నేతలు. కాగా గోవిందరావును అసెంబ్లీకి పంపగా ఇతర పదవులకు రమణను ఎంపిక చేసేవారు. ఈ విధంగా రమణను 1951లో జిల్లా బోర్డు సభ్యుడిగా, 1958లో ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది. దీన్ని వ్యతిరేకించిన రమణ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 1962 ఎన్నికల్లో గోవిందరావును అనకాపల్లి నుంచి, రమణను కొండకర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీకి నిలిపారు. ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలో వున్న కొండకర్ల ఆనాడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు విజయం సాధించారు. 1972 ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొండకర్లను తొలగించారు. అనకాపల్లి ఒక్కటే మిగిలింది. ఆదినుంచీ అనకాపల్లి నుంచి గోవిందరావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున పార్టీ రమణకు అవకాశం ఇవ్వలేదు. సీపీఐలో అంతర్గత కలహాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. సీపీఐ తరపున గోవిందరావు పోటీ చేయగా, కాంగ్రెస్ తరుపున రమణ పోటీ చేసి 6,893 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో తిరిగి సీపీఐ తరపున కె.గోవిందరావు పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి పీవీ చలపతిరావుపై గెలుపొందారు.
టీడీపీ ఆవిర్భావం తరువాత జైత్రయాత్ర....
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత అనకాపల్లి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల స్పీడుకు బ్రేకులు పడ్డాయి. క్రమంగా నియోజకవర్గంలో కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. టీడీపీ హవా కొనసాగింది. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి రాజా కన్నబాబు గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో కన్నబాబు నాదెండ్ల వర్గంలో చేరడంతో అప్పట్లో ఏఎంఏఎల్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో చేరారు. ఆయన వరుసగా నాలుగుసార్లు (1985, 1989, 1994, 1999) విజయం సాధించారు. ఆయన రికార్డును ఇప్పటివరకూ ఎవరూ అధిగమించలేకపోయారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొణతాల రామకృష్ణ, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పీలా గోవింద సత్యనారాయణ, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున గుడివాడ అమర్‌నాథ్ గెలుపొందారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు దాడి వీరభద్రరావు ఎన్నికయ్యారు. 1985 నుంచి 1999 వరకు దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా) తరపున కొణతాల రామకృష్ణ, వైసీపీ నుంచి మలసాల భరత్‌కుమార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. అనకాపల్లి కోటలో ఎవరు పాగా వేస్తారో చూడాలి.
అనకాపల్లి నియోజకవర్గం...
---------------------------------------------------------------------
సంవత్సరం విజేత పార్టీ మెజార్టీ ప్రత్యర్థి
---------------------------------------------------------------------
1952-1955 కొడుగంటి గోవిందరావు సీపీఐ 6,622 విల్లూరి వెంకటరమణ (కేఎల్‌పీ)
1955-1962 భీశెట్టి అప్పారావు కేఎల్‌పీ 664 కొడుగంటి గోవిందరావు (సీపీఐ)
1962-1967 కొడుగంటి గోవిందరావు సీపీఐ 11,750 బి.వి.నాయుడు (కాంగ్రెస్)
1967-1972 కొడుగంటి గోవిందరావు సీపీఐ 8,295 బి.వి.నాయుడు (కాంగ్రెస్)
1972-1978 పి.వి.రమణ కాంగ్రెస్ 7,893 కె.గోవిందరావు (సిపీఐ)
1978-1983 కె.గోవిందరావు సీపీఐ 8,437 పి.వి.చలపతిరావు (జతతా పార్టీ)
1983-1985 రాజా కన్నబాబు టీడీపీ 25,384 మళ్ళ లక్ష్మీనారాయణ (కాంగ్రెస్)
1985-1989 దాడి వీరభద్రరావు టీడీపీ 29,541 నిమ్మదల సత్యనారాయణ (కాంగ్రెస్)
1989-1994 దాడి వీరభద్రరావు టీడీపీ 2,258 దంతులూరి దీలీప్‌కుమార్ (కాంగ్రెస్)
1994-1999 దాడి వీరభద్రరావు టీడీపీ 1,655 దంతులూరి దిలీప్‌కుమార్ (ఇండిపెండెంట్)
1999-2004 దాడి వీరభద్రరావు టీడీపీ 3,671 కొణతాల రామకృష్ణ (కాంగ్రెస్)
2004- 2009 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ 17,033 దాడి వీరభద్రరావు (టీడీపీ)
2009- 2014 గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం 10,866 కొణతాల రామకృష్ణ (కాంగ్రెస్)
2014-2019 పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ 22,341 కొణతాల రఘునాథ్ (వైసీపీ)
2019-2024 గుడివాడ అమర్‌నాథ్ వైసీపీ 8,169 పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)
Updated Date - May 04 , 2024 | 01:44 AM