చప్పగా జగన్ సభ
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:06 AM
జిల్లాలో వెనుకబాటుతనం, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజలు ఉన్న చోడవరం, మాడుగుల ప్రాంతాలకు ఏం చేస్తామనే హామీ గానీ, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తామనే భరోసా గానీ ఇవ్వకుండానే చోడవరంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ చప్పగా ముగిసిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన రోడ్‌షో ప్రచార సభ కేవలం ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శించడమే లక్ష్యంగా కొనసాగిన తీరు సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
- స్థానిక సమస్యల ప్రస్తావన, ఎటువంటి భరోసా ఇవ్వకుండా సాగిన ప్రసంగం
- చంద్రబాబుపై విమర్శలు, తాము అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరింపు
- గోవాడ షుగర్స్, సాగునీటి వనరుల అభివృద్ధి ఊసేలేదు
- నిరాశ చెందిన రైతాంగం
- దుకాణాలను మూసివేయించడంతో వ్యాపారులు గగ్గోలు
- రోడ్డుపైనే సభ కారణంగా ప్రయాణికులు, వాహనచోదకులకు కష్టాలు
చోడవరం, ఏప్రిల్ 29: జిల్లాలో వెనుకబాటుతనం, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజలు ఉన్న చోడవరం, మాడుగుల ప్రాంతాలకు ఏం చేస్తామనే హామీ గానీ, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తామనే భరోసా గానీ ఇవ్వకుండానే చోడవరంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ చప్పగా ముగిసిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన రోడ్‌షో ప్రచార సభ కేవలం ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శించడమే లక్ష్యంగా కొనసాగిన తీరు సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ కావడంతో ఈ రెండు నియోజకవర్గాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అనే ఆశ అందరిలో నెలకొంది. ప్రత్యేకించి నాడు పాదయాత్ర సందర్భంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఉన్నందున గోవాడ భవితవ్యంపై ఏదైనా మాట్లాడతారని రైతాంగం అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే టీడీపీ హయాంలో దెబ్బతిన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తమ హయాంలో బాగు చేశామని చెప్పి ఊరుకున్నారు తప్పితే ఫ్యాక్టరీని ఏ విధంగా బాగు చేశారో చెప్పకుండా, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుపైనా మాట్లాడకుండానే దాటవేసి వెళ్లిన తీరు విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి వైసీపీ హయాంలో షుగర్స్ రైతుల బకాయిలకు డబ్బులు మంజూరు చేయడం తప్పితే, ఫ్యాక్టరీని గాడిలో పెట్టే చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయి. కమిటీలతో కాలయాపన తప్పితే, గోవాడలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు అంశం పూర్తిగా మరిచిపోయారు. చెరకు రైతులకు బకాయిలు ఇవ్వలేని గోవాడ.. వచ్చే ఏడాది కొనసాగేది కూడా సందేహంగానే మారింది. ఇటువంటి పరిస్థితుల్లో గోవాడకు, ఈ ప్రాంత రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా సీఎం నుంచి గట్టి హామీ లభిస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైందని చెప్పాలి. ఇక ప్రధానంగా సాగునీటి వన రుల అభివ ృద్ధి గురించి కనీస ప్రస్తావన తీసుకు రాకపోవడం, ఈ ప్రాంత రైతాంగం ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గానీ పెద్దేరు, కల్యాణపులోవ, కోనాం,. రైవాడ రిజర్వాయర్ల అభివృద్ధి గురించి ఏమాత్రం సీఎం మాట్లాడకపోవడం స్థానికులను నిరాశకు గురిచేసింది. సీఎం జగన్ కేవలం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి, ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ఇవేమీ అందవని ప్రజలను భయపెట్టడమే అజెండాగా ప్రసంగం సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం ప్రసంగానికి స్పందన కరువు
సుమారు 45 నిమిషాల పాటు సాగిన సీఎం ప్రసంగంలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలైన చోడవరం, మాడుగుల ప్రజలకు ఊరట ఇచ్చే విధంగా ఎలాంటి హామీలు లేకపోగా, చివరి నిమిషంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మశ్రీలను పరిచయం చేస్తూ వారికి ఓటేసి గెలిపించాలని కోరి సభను ముగించడంతో సభకు హాజరైన జనం నుంచి స్పందన కరువైంది. చోడవరం, మాడుగులకు ఏం చేశామో?, ఏం చేస్తామో కూడా ప్రస్తావన లేదు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయలేదని, తాము సంపూర్ణంగా హామీలు అమలు చేశామంటూ గట్టిగా మాట్లాడినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. రాయలసీమ యాసలో సీఎం జగన్ మాట్లాడిన మాటలు చాలా వరకు స్థానికులకు అర్థం కాకపోవడంతో జనం స్పందించలేదు. జగన్ సభతో జనంలో ఊపు వస్తుందని ఆశించిన అధికార పార్టీ నేతలకు ఆశాభంగం కలిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.
వాహనాల్లో జనం తరలింపు
సీఎం జగన్ సభకు వైసీపీ నాయకులు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఆటోలు, వ్యాన్లు, బస్సుల్లో జనాన్ని తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలు స్థానిక గాంధీగ్రామం, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోనూ, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోనూ నిలిపి ఉంచారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో చాలా మంది వాహనాల్లోనే ఉండిపోయారు.
దుకాణాలను మూయించిన పోలీసులు
పట్టణంలో నిర్వహించిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ స్థానిక వ్యాపారులతో పాటు, వాహనదారులకు సంకటంగా మారింది. జగన్ సభ నిర్వహించిన కొత్తూరు జంక్షన్‌తో పాటు ప్రధాన రహదారి, కొత్తూరు జంక్షన్ నుంచి ఇటు దేవరాపల్లి, అటు పీఎస్‌పేట రోడ్డులో చాలా వరకు దుకాణాలను పోలీసులు మూసివేయించారు. అసలే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికల ప్రచార సభ కోసం తమ దుకాణాలను మూసివేయించి తమ కడుపు కొట్టడమేమిటంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సభ జరిగిన కొత్తూరు జంక్షన్‌లో ప్రధాన రహదారిని పూర్తిగా బారికేడ్లతో మూసివేయించి ఎవరినీ అనుమతించకపోవడం, ప్రదాన రహదారిపై ఉదయం 8 గంటల నుంచే వాహనాలను అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక చోడవరంలో సీఎం సభ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పాడేరు- చోడవరం రూట్లో వడ్డాది వద్ద, చోడవరం- విశాఖ- అనకాపల్లి రూట్లో వె ంకన్నపాలెం జంక్షన్ వద్ద బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేయడంతో సుమారు నాలుగు గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేవలం జగన్ సభకు వచ్చే కార్యకర్తల వాహనాలు మినహా మిగిలిన వాహనాలను నిలిపివేయడంతో ఇతర ప్రాంతాల ప్రజలతో పాటు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - Apr 30 , 2024 | 01:06 AM