సప్పర్ల ఆశ్రమ విద్యార్థి మృతి
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:46 AM
జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీలోని ఎం.బూసుకొండ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో సోమవారం రాత్రి మృతి చెందాడు. సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థికి అక్కడి పీహెచ్‌సీలో వైద్యం చేయించకుండా హెచ్‌ఎం, వార్డెన్ ఎటువంటి వైద్య సదుపాయాలు లేని మారుమూల స్వగ్రామానికి తరలించారని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే..
టెన్త్ విద్యార్థికి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు
వైద్యం చేయించకుండా స్వగ్రామానికి
పంపిన పాఠశాల సిబ్బంది
వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
సీలేరు, జూలై 30: జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీలోని ఎం.బూసుకొండ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో సోమవారం రాత్రి మృతి చెందాడు. సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థికి అక్కడి పీహెచ్‌సీలో వైద్యం చేయించకుండా హెచ్‌ఎం, వార్డెన్ ఎటువంటి వైద్య సదుపాయాలు లేని మారుమూల స్వగ్రామానికి తరలించారని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే..
జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని ఎం.బూసుకొండ గ్రామానికి చెందిన జర్తా శంకరరావు, కాసులమ్మ దంపతుల కుమారుడు శ్యామ్యూల్ (13) సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శ్యామ్యూల్‌కు కడుపునొప్పి రావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థికి పీహెచ్‌సీలో వైద్య సేవలను అందించకుండా వారి స్వగ్రామమైన ఎం.బూసుకొండకు నాలుగు రోజుల క్రితం పంపించేశారు. సోమవారం రాత్రి సమయంలో శ్యామ్యూల్‌కు తీవ్రమైన కడుపునొప్పితో పాటు వాంతులు, విరోచనాలు అధికం అయ్యాయి. ఆ సమయంలో జోరున వర్షం, మరోపక్క రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో శ్యామ్యూల్ పరిస్థితి విషమించి రాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు అనారోగ్యం బారిన పడితే పాఠశాలోనే ఉంచి వైద్యం అందించకుండా ఎటువంటి వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామానికి పంపించిన పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jul 31 , 2024 | 12:46 AM