ఎండాడ వద్ద దారిదోపిడీ
ABN, Publish Date - Jul 13 , 2024 | 01:15 AM
గంజాయి సేవించి దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
లారీని ఆపి డ్రైవర్‌పై దాడి
రూ.10 వేలు, సెల్‌ఫోన్ తీసుకుని పరారీ
ముఠాను 24 గంటల్లో పట్టుకున్న పోలీసులు
ఎం.వి.పి.కాలనీ, జూలై 12:
గంజాయి సేవించి దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎం.వి.పి. క్రైమ్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డి.సి.పి.వెంకటరత్నం కేసు వివరాలను తెలియచేశారు. పీఎం పాలేనికి చెందిన అరుగుల్ల భాను (19), తోట దుర్గాప్రసాద్ (19), మెరుగు నరసింహులుతో పాటు మరో ఐదుగురు బాలురు గురువారం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో జాతీయ రహదారిపై ఎండాడ వద్ద అటుగా వెళుతున్న లారీని ఆపారు. డ్రైవర్‌పై దాడి చేసి, పది వేల నగదు, మొబైల్ తీసుకుని పరారయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఐదు బృందాలను ఏర్పాటుచేసి, నిందితులను 24 గంటల్లో విజయనగరంలో అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు, రూ.ఐదు వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరూ చెడు వ్యసనాలకు బానిసలై నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో క్రైమ్ ఎ.సి.పి. వెంకటరావు, ఈస్ట్ క్రైమ్ సి.ఐ.ఎస్.ఆడమ్, క్రైమ్ ఎస్.ఐ.హరి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2024 | 08:08 AM