ఉలిక్కిపడిన ఫార్మా సిటీ
ABN, Publish Date - Apr 07 , 2024 | 11:51 PM
విశాఖ ఫార్మాసిటీ ఉలిక్కిపడింది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురికాగా, ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
వేర్వేరు ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదం
ఇద్దరి మృతి, నలుగురికి అస్వస్థత
మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
పరవాడ, ఏప్రిల్ 7: విశాఖ ఫార్మాసిటీ ఉలిక్కిపడింది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురికాగా, ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్ యూనిట్-3 పరిశ్రమలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీక్ అవ్వడంతో కెమిస్ట్, సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సీహెచ్ రమణ(30) మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అలాగే అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-6 పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న ఆళ్ల గోవింద(32) మృతి చెందాడు. మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదాలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆల్కలీ పరిశ్రమలో..
ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్ యూనిట్ -3 పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజాము నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రొడక్ట్ బ్లాక్‌లోని జీజీ-2 ట్యాంక్ పైపులైన్ వద్ద మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకైంది. పైపులైన్‌కు సంబంధించి ఎల్ బెండ్ వద్ద లీకేజి కావడంతో సీ షి్‌ఫ్ట్ విధుల్లో ఉన్న సీహెచ్ రమణ (32) విపరీతంగా గ్యాస్ పీల్చడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పైఫ్లోర్‌లో పనిచేస్తున్న కార్మికులకు గ్యాస్ వాసన రావడంతో కిందకు దిగి వచ్చి చూసేసరికి అప్పటికే రమణ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే లోపు మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే అతనిని చూసేందుకు వచ్చిన నలుగురు కార్మికులు ఎ.శ్రీనివాసరావు (పైడివాడ అగ్రహారం), వై.గోపాల్ (రేగడివలస), వి.అప్పారావు (లంకెలపాలెం), బి.రవీంద్ర (చోడవరం) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి కార్మికులు వారిని తొలుత అనకాపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందజేశారు. మెరుగైన వైద్యం కోసం నలుగురిని విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నలుగురు కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన సీహెచ్ రమణ స్వస్థలం విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో గల గొల్లపేట గ్రామం. ఆయన భార్య సత్యవతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 11 ఏళ్లుగా పరిశ్రమలో సూపర్‌వైజర్, కెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. తానాంలో నివాసం ఉంటూ విధులకు హాజరవుతున్నారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ పైలా జగన్నాథరావు, అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కన్నూరు వెంకటరమణ పరిశ్రమను సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను కంపెనీ షిఫ్ట్ సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి కార్మికుల పరిస్థితి గురించి వాకబు చేశారు.
అపిటోరియా పరిశ్రమలో..
అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-6 పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో వీటీడీ డ్రయర్ రూములో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న ఆళ్ల గోవింద(32) డ్రయర్ రూము బోల్టు బిగించే క్రమంలో ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది. దీంతో లోపల ఉన్న మిథైల్ నైట్రేట్ గ్యాస్ ఒక్కసారిగా రావడంతో పీల్చి కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో డ్రయర్ రూము డోర్ ఓపెన్ అయి శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న కిటికీ గ్లాస్ పగిలి అక్కడే పనిచేస్తున్న సూపర్‌వైజర్ బి.నరేంద్ర కంటికి తగలడంతో గాయమైంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.బాబ్జీ, మరో ఫిట్టర్ బి. గోవింద స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా కుప్పకూలిన గోవిందను తొలుత అగనంపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుని స్వస్థలం పాలకొండ. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ పర్యవేక్షణలో సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిశ్రమలను సందర్శించిన అధికారులు
ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్డీవో చిన్నికృష్ణ, పరిశ్రమల అధికారి చిన్నారావు, పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ శాంతిభూషణ్, సీఐ బాలసూర్యారావు ప్రమాదాలు జరిగిన పరిశ్రమలను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని యాజమాన్యాలకు సూచించారు.
Updated Date - Apr 07 , 2024 | 11:51 PM